అర్ధరాత్రి అట్టహాసంగా.. | Starry midnight in Central Hall to welcome GST | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి అట్టహాసంగా..

Published Fri, Jun 30 2017 1:11 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

అర్ధరాత్రి అట్టహాసంగా..

అర్ధరాత్రి అట్టహాసంగా..

నేడు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో జీఎస్‌టీ ప్రారంభోత్సవం
► రాత్రి 10.45 గంటలకు కార్యక్రమం మొదలు.. రాష్ట్రపతి, ప్రధాని, ఆర్థిక మంత్రి ప్రసంగాలు
► జీఎస్‌టీ అమలుకు సూచికగా 12 గంటలకు మోగనున్న భారీ గంట
► కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్, డీఎంకే నిర్ణయం


స్వతంత్ర భారతావనిలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. దేశ చరిత్రలోనే అతిపెద్ద పన్ను సంస్కరణగా అభివర్ణిస్తున్న జీఎస్‌టీ (వస్తు,సేవల పన్ను) చట్టం శుక్రవారం(నేటి) అర్ధరాత్రి నుంచి అమలులోకి రానుంది. పార్లమెంటు సెంట్రల్‌ హాలులో జరిగే ఆరంభ వేడుకలో రాష్ట్రపతి, ప్రధానితో సహా కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు కూడా హాజరవుతారు. వివిధ రంగాల నిపుణుల్ని ఆహ్వానించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా మోదీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

శుక్రవారం రాత్రి 10.45 గంటలకు కార్యక్రమం మొదలై 80 నిమిషాలు కొనసాగనుంది. రాష్ట్రపతి రాకకు ముందు జీఎస్‌టీపై 10 నిమిషాల నిడివిగల షార్ట్‌ఫిల్మ్‌ ప్రదర్శిస్తారు. వేదికపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని దేవేగౌడ ఆసీనులవుతారు. అనంతరం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ క్లుప్తంగా జీఎస్‌టీ గురించి వివరిస్తారు. ప్రధాని, రాష్ట్రపతి 25 నిమిషాల చొప్పున ప్రసంగిస్తారు. రెండు నిమిషాల వీడియో క్లిప్‌ ప్రదర్శించాక... సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు జీఎస్‌టీ అమలులోకి వచ్చిందనేందుకు సూచికగా పెద్ద గంటను మోగిస్తారు.

కేంద్ర మంత్రులు, సీనియర్‌ అధికారులు, ఎంపీలతో పాటు రతన్‌ టాటా, అమితాబ్‌ బచ్చన్, లతా మంగేష్కర్, న్యాయకోవిదులు సోలీ సొరాబ్జీ, కేకే వేణుగోపాల్, హరీష్‌ సాల్వే, ఆర్‌బీఐ మాజీ గవర్నర్లు సి.రంగరాజన్, బిమల్‌ జలాన్, వైవీ రెడ్డి, డి.సుబ్బారావు, ప్రస్తుత గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్, మెట్రో నిపుణుడు శ్రీధరన్‌... ఇలా వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్టులైన 100 మందికి ఆహ్వానాలు పంపారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల్ని కూడా ఆహ్వానించారు. సీఐఐ, ఫిక్కీ, అసోచామ్‌ల చైర్మన్లు కూడా కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ కార్యక్రమం పకడ్బందీ నిర్వహణ కోసం గురువారం రాత్రి రిహార్సల్స్‌ కూడా నిర్వహించారు.

కాంగ్రెస్‌ దూరం...
జీఎస్‌టీ  ప్రత్యేక సమావేశానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించుకుంది. మన్మోహన్‌ సింగ్, ఇతర నేతలతో గురువారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశానంతరం ఈ నిర్ణయం వెలువడింది. సమావేశానికి కాంగ్రెస్‌ హాజరు కావడం లేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సత్యవ్రత్‌ చతుర్వేది చెప్పారు. అయితే జీఎస్‌టీ కాంగ్రెస్‌ ఆలోచనని, ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారని... అందువల్ల సమావేశానికి దూరంగా ఉండడం మంచిది కాదని మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం తదితరులు వాదించినట్లు సమాచారం.

వ్యాపారవర్గాల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంత హడావుడిగా జీఎస్‌టీని అమల్లోకి తేవాల్సిన అవసరం ఏముందని మరికొందరు వాదించారు. చివరకు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ నిర్ణయించుకుంది. దేశానికి స్వాతంత్య్రం రోజున ప్రథమ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ అర్ధరాత్రి ప్రసంగం ‘ట్రైస్ట్‌ విత్‌ డెస్టినీ’ని మోదీ అనుకరించడంపై కూడా కాంగ్రెస్‌ అసహనంగా ఉంది.

జీఎస్‌టీపై మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా గైర్హాజరు కానుంది. డీఎంకే, సీపీఐ కూడా సమావేశానికి హాజరుకాకూడదని నిర్ణయించాయి. సీపీఎం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గైర్హాజరుకానున్నారు. గైర్హాజరు నిర్ణయంపై కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీలు పునరాలోచన చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ సూచించారు. జీఎస్‌టీపై అన్ని రాష్ట్రాలు, పార్టీలతో సంప్రదించాకే నిర్ణయాలు తీసుకున్నామని.. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

ఆగస్టు 14 అర్ధరాత్రి ప్రసంగాన్ని గుర్తుచేసేలా...
పార్లమెంటు భవన సముదాయంలోని సెంట్రల్‌ హాల్‌ వృత్తాకారంలో ఉంటుంది. ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక నిలిచింది. 70 ఏళ్ల క్రితం... 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి... భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చిన క్షణాన ప్రధాని నెహ్రూ జాతినుద్దేశించి ఇక్కడి నుంచే ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర రజతోత్సవ, స్వర్ణోత్సవ వేడుకలకు కూడా సెంట్రల్‌ హాల్‌ వేదికైంది.

ఇక మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన రాజ్యాంగాన్ని రచించిన కమిటీ సమావేశాలు ఇక్కడే నిర్వహించారు. ప్రతి సంవత్సరం పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు సెంట్రల్‌ హాల్లోనే రాష్ట్రపతి ఉభయసభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కొత్త రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించేది కూడా సెంట్రల్‌ హాలులోనే. ఇతర దేశాధినేతలు భారత పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించేది కూడా ఇక్కడే. అందుకే మోదీ ప్రభుత్వం జీఎస్‌టీ ప్రారంభానికి ఈ చారిత్రక భవనాన్ని ఎంచుకుంది.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement