
దేశ రాజకీయాల్లో ఓ అరుదైన వ్యక్తిత్వం. విదేశాంగ, రక్షణ, ఆర్థిక, వాణిజ్యం వంటి భిన్నమైన మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన సామర్థ్యం. దశాబ్దాల రాజకీయ జీవితంలో స్ఫూర్తిదాయక వ్యవహారశైలితో ఆదర్శంగా నిలిచిన మహామనీషి. చిన్న వయసులోనే రాజనీతిజ్ఞుడిగా, దౌత్యవేత్తగా, రచయితగా, జర్నలిస్టుగా, అధ్యాపకుడిగా ఇలా అవకాశం దొరికిన ప్రతి రంగంలోనూ సత్తా చాటుకున్న సమర్థుడు. ఇవన్నీ భారతదేశానికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురించిన కొన్ని అంశాలు మాత్రమే. 2012 నుంచి 2017 భారత 13వ రాష్ట్రపతిగా సేవలందించిన ప్రణబ్ దా.. నాటి ప్రధాని ఇందిరా గాంధీ నుంచి.. మొన్నటి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వాల్లో వివిధ మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా.. ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలికి 23 ఏళ్లపాటు సీడబ్ల్యూసీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడినపుడల్లా ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించి గట్టెక్కించారు. దేశ రాజకీయాల్లో ప్రణబ్ సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ఈ మహనీయుడి గురించిన కొన్ని విశేషాలు.
నరనరాన దేశభక్తి
1935 డిసెంబర్ 11న పశ్చిమబెంగాల్‌లోని బిర్భుమ్ జిల్లా మిరాటీలో స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో ప్రణబ్ దా జన్మించారు. ఆయన తండ్రి కమద కింకార్ ముఖర్జీ, తల్లి రాజలక్ష్మి. తండ్రి స్వాతంత్య్ర పోరాటాన్ని చూస్తూనే ఆయన పెరిగి పెద్దవాడయ్యారు. చరిత్ర, రాజనీతి శాస్త్రంలో పీజీ పూర్తిచేశారు. ఆ తర్వాత కలకత్తా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. టీచర్‌గా వృత్తిపరమైన జీవితాన్ని ప్రారంభించిన ప్రణబ్ దా.. చాలా రోజుల పాటు ‘దేశేర్ దక్’(మాతృభూమి పిలుపు) అనే పత్రికకు జర్నలిస్టుగా పనిచేశారు. తండ్రి అప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కావడంతో.. ఆయన అడుగుజాడల్లోనే ప్రణబ్ కూడా కాంగ్రెస్ ద్వారానే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు.
ఇందిర ప్రియశిష్యుడిగా..
జాతీయ రాజకీయాల్లో ప్రణబ్ జోరుకు బీజం పడింది మాత్రం 1969లోనే. ప్రణబ్ చొరవను, నాయకత్వ లక్షణాలను గుర్తించిన ఇందిరాగాంధీ.. ఆయన్ను ప్రియశిష్యుడిగా చేసుకున్నారు. 1969లో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. 1979లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవగానే.. సభలో పార్టీ ఉపనేతగా, ఇందిర కేబినెట్లో మంత్రిగా స్థానం సంపాదించారు. 1980లో రాజ్యసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. ప్రణబ్ సామర్థ్యాన్ని గుర్తించిన ఇందిర.. 1982లో కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలను అప్పజెప్పారు. పార్టీలో, ప్రభుత్వంలో ఇందిర తర్వాతి స్థానం ప్రణబ్‌దే అనుకునేవారు. అయితే 1984లో ఇందిర హత్యతో పరిస్థితి తారుమారైంది. పార్టీలో ప్రణబ్ ఎదుగుదలను ఓర్వలేని నేతలంతా ఏకమై.. పార్టీలో ఆయన్ను పక్కనబెట్టేలా రాజీవ్‌పై ఒత్తిడి తీసుకొచ్చారంటారు. 1991లో రాజీవ్ గాంధీ హత్య వరకు పార్టీలో ప్రణబ్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పీవీ నరసింహారావు ప్రధాని కాగానే.. ప్రణబ్‌కు కేంద్ర మంత్రి బాధ్యతలు ఇవ్వడంతోపాటు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్‌గా నియమించారు. 1995–96ల్లో భారత విదేశాంగ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2004లో మళ్లీ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. 2012 వరకు పార్టీ లోక్‌సభాపక్ష నేతగా ఉన్నారు. ఈ సమయంలోనే రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తించారు.
సొంత కూటమి పెట్టినా..
ఇందిర మరణం తర్వాత పార్టీలో ఎదురవతున్న అవమానాలతో.. ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. 1987లో రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. తదనంతర పరిణామాలతో 1989లో ఈ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
రచయితగా
జర్నలిస్టుగా పనిచేసిన అనుభవంతో.. వీలున్నపుడల్లా తన భావాలకు అక్షరరూపం ఇవ్వడాన్ని మాత్రం ప్రణబ్ మరిచిపోలేదు. 1987లో ‘ఆఫ్ ద ట్రాక్’పుస్తకాన్ని 1992లో ‘సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్’, చాలెంజెస్ బిఫోర్ ద నేషన్ పుస్తకాలను.. 2014లో ‘ద డ్రమాటిక్ డెకేడ్: ద డేస్ ఆఫ్ ఇందిరాగాంధీ ఇయర్స్’అనే పుస్తకాలను రచించారు. ఇందిర పాలనను, అధికారాన్ని దగ్గరగా చూసిన అనుభవం.. దౌత్యవేత్తగా ప్రపంచంలో భారత్ స్థానాన్ని అవగతం చేసుకున్న సమర్థుడిగా.. కిందిస్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా దేశంలోపల సమస్యలను చూసిన వ్యక్తిగా తన అనుభవాలను, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ పుస్తకాల్లో పేర్కొన్నారు. భారత 13వ రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ప్రభావవంతంగా సాగింది. లైంగిక నేరాలను తీవ్రంగా పరిగణించేలా.. ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ల్లో సవరణలు చేసిన ‘క్రిమినల్ లా (సవరణ) ఆర్డినెన్స్ – 2013’కు ఆమోదముద్ర పడింది ఈయన రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే.
మంత్రిగా ప్రణబ్..
కేంద్ర మంత్రిగా ఉన్న భారత్– అమెరికా పౌర అణు ఒప్పందంపై ఇరుదేశాల సంతకాలు. ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వంపై అమెరికాను ఒప్పించిందీ ప్రణబ్ హయాంలోనే. జేఎన్‌యూఆర్‌ఎమ్ సహా పలు సామాజిక సంక్షేమపథకాలకు రూపకల్పన చేశారు. 1980ల్లో తొలిసారి ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టిన సమయంలో.. తీసుకొచ్చిన మార్పులతో భారత ఆర్థిక వ్యవస్థ సంస్కరణవాదిగా పేరుతెచ్చుకున్నారు. 2008లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న ప్రణబ్.. 2010లో ఆసియాలో అత్యుత్తమ ఆర్థిక మంత్రి అవార్డు పొందారు. 2013లో బంగ్లాదేశ్ రెండో అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. 1957లో సువ్ర ముఖర్జీతో ఆయన వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. 2015లో ప్రణబ్ దా భార్య కన్నుమూశారు.
దౌత్యవేత్తగా విశేషానుభవం
రాజకీయవేత్తగానే కాదు.. దౌత్యవేత్తగానూ దేశానికి ప్రణబ్ దా సేవలందించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు, ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంకులకు బోర్డ్ ఆఫ్ గవర్నర్‌గా వ్యవహరించారు. కామన్వెల్త్ దేశాల ఆర్థిక మంత్రుల సమావేశాలకు 1982, 83, 84ల్లో భారత బృందానికి నేతృత్వం వహించారు. 1995లో అక్‌లాండ్‌లో జరిగిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ సదస్సులోనూ భారత బృందానికి నాయకత్వం వహించారు.