bharatha rathna
-
భారతరత్నకు ఎంపికైన ఐదుగురూ 'పంచరత్నాలు'
దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ఏకకాలంలో (కొద్ది తేడాలతో) ఐదుగురిని వరించింది. ఠాకూర్‌కు కొన్నిరోజులు ముందుగా, ఆ తర్వాత కొన్నిరోజులకు అద్వాణీకి, మిగిలిన ముగ్గురికీ తాజాగా ఒకేరోజు చేరింది. చౌదరి చరణ్ సింగ్, స్వామినాథన్, పీ.వీ.నరసింహారావు ముగ్గురూ ముగ్గురే! ఇది బీజేపీ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం. ఈ ఐదుగురిలో ఎల్కే అద్వాణీ ఒక్కరే జీవించివున్నారు. మిగిలినవారు గతించినా, చరిత్రగతిలో చిరయశస్సుతో చిరంజీవిగా జీవిస్తారు. ఠాకూర్‌కు ప్రకటించినప్పుడు దేశంలో పెద్ద స్పందన లేదు. పర్వాలేదులే అనుకున్నారు. అద్వాణీకి ప్రకటించిన రోజు అందరూ ఆశ్చర్యపోయారు. పీ.వీ.నరసింహారావుకు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్‌కు కూడా ఇవ్వాలనే అభ్యర్థనలు తెలుగువారి నుంచి వినిపించాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ముఖ్యంగా తెలుగువారిని అమితానంద పరిచేలా 'పీవీ వార్త' గొప్ప సందడి చేసింది. ఏదోరోజు ఎన్టీఆర్‌కు కూడా దక్కుతుందనే ఆశ కూడా చిగురిస్తోంది. కొద్దికాలం వ్యవధిలోనే ఇందరు పెద్దలకు అతిపెద్ద 'భారతరత్న' ప్రదానం చెయ్యడం చాలా గొప్ప విషయం. ఈ నిర్ణయం వెనకాల ఎందరి సలహాలు ఉన్నప్పటికీ, మనస్ఫూర్తిగా, సంపూర్ణంగా అభినందనలు అందుకోవాల్సిన వ్యక్తి నూటికి నూరు శాతం మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇన్నేళ్ల స్వాతంత్య్ర భారతంలో ఈ తీరుగ నిర్ణయం తీసుకున్న ఏకైక ప్రధాని మోదీ. కొందరికి ఆలస్యమైంది, ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది వున్నారు అన్నమాటలు వాస్తవమే ఐనప్పటికీ, ఈ స్థాయిలో 'భారతరత్న' ప్రదానం చేయడం పరమానందకరం. మొన్ననే! ఇద్దరు తెలుగుతేజాలు ఎం.వెంకయ్యనాయుడు, చిరంజీవికి 'పద్మవిభూషణ్' ప్రకటించడంతో తెలుగువారు ఎంతో అనందించారు. ఆ ఆనందడోలికల్లో ఇంకా తేలుతూనే వున్నాం, తూలుతూనే వున్నాం. నేడు పీవీకి 'భారతరత్న' ప్రకటనతో ఆనందతాండవంలోకి ప్రవేశించాం. ఎన్నికల వేళ నరేంద్రమోదీ తీసుకున్న గొప్ప నిర్ణయమే కాదు, అనూహ్య వ్యూహం. ఈ దెబ్బతో ప్రతిపక్షాలు, ప్రత్యర్ధులకు నోటమాట ఆగిపోయేట్టు చేశారు. అద్భుతమైన రాజనీతి. ఎన్నికల్లో తప్పక మేలుచేస్తుంది. పీవీని కాంగ్రెస్ దూరం చేసుకుంది. కాంగ్రెస్ ఎంత దూరం చేసుకుందో, మోదీ బీజేపీ ప్రభుత్వం అంతకు మించి దగ్గరకు తీసుకుంది. ఈరోజు భారతరత్నకు ఎంపికైన ఐదుగురూ 'పంచరత్నాలు'. వీరి నేపథ్యాలు భిన్నం, ప్రాంతాలు విభిన్నం. కానీ, వీరి ఆత్మ ఒక్కటే! అదే 'భారతీయం'. వీరు కేవలం భారతీయులు కారు, విశ్వమానవులు. ఈ ఐదుగురు పంచభూతాల్లాంటివారు. విశ్వదృష్టితో విశాలంగా అలోచించినవారు. ఇందులో స్వామినాథన్ తప్ప మిగిలినవారికి రాజకీయ నేపథ్యం ఉండవచ్చు గాక! దాని వెనక జాతి హితం వుంది. ఒక్కొక్కరూ ఒక్కొక్క రంగానికి, తత్త్వానికి, ప్రయోజనానికి ప్రతీకలు. అందరూ స్ఫూర్తిప్రదాతలే. వారు వేసిన మార్గంలో నడవడం ఎవరికైనా, ఎప్పటికైనా తప్పదని నిరూపించినవారే. ఈ సందర్భంలో, ఈ సంరంభంలో మన 'తెలుగువెలుగు' పీవీని ప్రత్యేకంగా తలచుకుందాం. వంద సంవత్సరాల క్రితం (1921), ప్రఖ్యాత జంటకవులు కొప్పరపు సోదరులు పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిగూడెంలో రాజా బొమ్మదేవర నాగన్ననాయుడు రాజాస్థానంలో 'సంపూర్ణ శతావధానం' చేశారు. అందులో ఒక పద్యం చెప్పారు. పీవీ నరసింహారావు పుట్టిన సంవత్సరం కూడా 1921. ఆ మహాకవులు రచించిన ఆ పద్యాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం. ఎట్టివారు మంత్రిపదవికి అర్హులు? ఇది ఒక పృచ్ఛకుడు సంధించిన ప్రశ్న. దీనికి కొప్పరపు కవుల పద్యరూపమైన సమాధానం. "పతికిన్ భూప్రజకాప్తుడై, బహు విధోపాయంబులన్ శాత్రవ ప్రతతిం గీడ్వడ జేసి, రాణ్మణికి హర్షశ్రీలు సేకూర్చి, ధీ చతురుండై, పటుకార్య కౌశలుడునై సత్కీర్తులం బొల్తునే మతిమంతుండతడే యమాత్యపద సంభావ్యుండగున్ భూవరా" - ఇదీ సంపూర్ణ పద్యం. 'మంత్రిగా పీఠంపై కూర్చోవలసినవారికి ఎటువంటి అర్హతలు ఉండాలో కవులు స్పష్టంగా వివరించారు. రాజుకు, ప్రజలకు పరమ ఆప్తుడై, బహు ఉపాయాలతో శతృవులను తొక్కిపడేసేవాడై, రాజ్యానికి ఎల్లవేళలా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తూ, చతుర బుద్ధిబల సంపన్నుడై, ఎటువంటి కార్యాన్నైనా అలవోకగా నిర్వహించే చాతుర్యం కలిగి, రాజ్యానికి, రాజుకు, ప్రజలకు, మంత్రిమండలికి, సత్కీర్తులు కలుగజేసే మతిమంతుడు ఎవరై ఉంటారో? అటువంటివారే మంత్రిపదవికి సంపూర్ణంగా అర్హులౌవుతారు రాజా....!' అని ఈ పద్యం చెప్పే తాత్పర్యం. ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం రాజాస్థానాలలో అటువంటి ప్రధానమంత్రులు, మహామంత్రులు ఉండేవారు. అటువంటివారినే మంత్రులుగా నియమించుకొనే ప్రభువులు ఉండేవారు. స్వాతంత్య్రం రాక ముందు, దివానులు కూడా అటువంటివారే ఉండేవారు. పీవీ నరసింహారావు నూటికి నూరుశాతం అటువంటి విలక్షణ, లక్షణ సంపన్నుడైన మంత్రీశ్వరుడే. అటువంటి మహామంత్రులకు అసలు సిసలైన వారసుడే. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మారుతున్న రాజకీయ ప్రభుత్వాల నేపథ్యంలో, పూర్వుల వలె సకల సద్గుణ, సర్వజ్ఞాన క్రియాశూరులైన మంత్రులు దొరకడం దుర్లభమేనని నడుస్తున్న చరిత్ర చెబుతోంది. ఇటువంటి సంధికాలంలోనూ కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు దొరకడం దేశానికి వైభవ చిహ్నం. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానులుగా దేశాన్ని పాలించిన సమయంలో, కేంద్రమంత్రిగా పీవీ విశేషమైన సేవలు దేశానికి అందించారు. వ్యక్తిగతంగానూ వారికి విశిష్టమైన సలహాలను అందజేశారు. తర్వాత కొంతకాలానికి ఆయనే రాజు అయ్యారు. ఆ సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు. ప్రభువుగా తనకు దక్కిన స్వాతంతత్రా్యనికి పొంగిపోయి, నియంతగా మారక, ప్రజాస్వామ్యయుతంగా పాలనను అందించారు. రాజు - మంత్రి ఇద్దరి అంతరంగాలు బాగా ఎరిగిననవాడు కాబట్టి, మంచి మంత్రులను, మంచి సలహాదారులను నియమించుకున్నారు. "రాగ ద్వేషాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా విధులను నిర్వహిస్తాం" అని ప్రమాణ స్వీకార మహోత్సవంనాడు అందరు మంత్రులు ప్రమాణం చేస్తారు. అదికూడా ఆత్మసాక్షిగా అంటూ ఒట్టు కూడా వేస్తారు. ఆ తర్వాత చరిత్రను గమనిస్తే, ఎందరు ఆ ప్రమాణాన్ని పాటించారన్నది లోక విదితమే. దానిని అక్షరాలా పాటించినవారు అతి తక్కువమంది. వారిలో ప్రథమ శ్రేణీయుడుగా గణనీయుడు పీవీ. ఆణిముత్యాల వంటి ఎందరినో తన సలహా మండలిలో, వివిధ హోదాల్లో నియమించుకున్న ప్రతిభా పక్షపాతి. ఆ జాబితా అతి పెద్దది. ఒక్క మన్మోహన్సింగ్ చాలు, గొప్పగా ఉదాహరించడానికి. నిన్ననే మన్మోహన్సింగ్ పై సభా మధ్యమున మన ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల జల్లులు కురిపించారు. ఆ మరునాడే పీవీకి 'భారతరత్న' ప్రకటించారు. పాఠాలు చెప్పుకుంటున్న ఆచార్యుడిని తీసుకువచ్చి, కేంద్రమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన ఘనత మన పీవీదే. తదనంతరం ఆయనే ప్రధానమంత్రిగా పదేళ్లు దేశాన్ని పాలించారు. అంతటి దార్శనిక ప్రతిభ పీవీది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా నియమించుకోవాలో తెలియడం కూడా మంచి మంత్రికి వుండే మంచి లక్షణం. పీవీని అపరచాణుక్యుడుగా అభివర్ణిస్తారు. పీవీలో చాణుక్యుడుతో పాటు తిమ్మరసు, తిక్కన, అల్లసాని పెద్దన కూడా ఉన్నారు. చాణక్యుడు అనగానే అర్థశాస్త్రం గుర్తుకు వస్తుంది. పీవీ అనగానే ఆర్ధిక సంస్కరణలు గుర్తుకు రాక తప్పవు. 'అర్థశాస్త్రం'లో కేవలం ఆర్ధిక అంశాలే కాదు అనేకం ఉన్నాయి. పాలన, రాజనీతి, మనస్తత్వశాస్త్రం, భౌగోళిక పరిజ్ఞానం, విదేశాంగ విధానం మొదలైన విశేష అంశాల కలయిక కౌటిల్యుడి 'అర్థశాస్త్రం'. పీవీ జ్ఞానం కూడా వీటన్నిటి సముదాయమే. చాణుక్యుడు/కౌటిల్యుడు ఎన్నో ఆర్ధిక సంస్కరణలను అమలుపరచాడు. పీవీ కూడా ఇంచుమించుగా అదే వరుసలో సంస్కరణలు చేపట్టారు. కాలమానాలను బట్టి వ్యూహాలు, ప్రాధాన్యతలు మారాయి అంతే. చాణుక్యుడు పేదలపట్ల ఎంతో దయకలిగి ఉండేవాడు. చివరిదశలో తన సంపదనంతా పేదలకే దానం చేశాడు. పీవీ తన వందలాది ఎకరాల భూమిని తొలిదశలోనే పేదలకు దానం చేశారు. చాణుక్యుడికి భయం అంటే ఏమిటో తెలియదు. పీవీ కూడా తాను చేపట్టాలనుకున్న కార్యక్రమాలన్నీ నిర్భీతిగా చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూసంస్కరణలు చేపట్టినప్పుడు భూస్వాములంతా బెదిరించే ప్రయత్నం చేసినా ఎవరికీ లొంగలేదు, ఎక్కడా తగ్గలేదు. చివరికి పదవిని కోల్పోయినా లెక్కచేయలేదు. ప్రధానమంత్రి పదవిని చేపట్టినప్పుడు కూడా ఎవరి బెదిరింపులకు చలించలేదు. ఆయన అంతరాత్మకు తప్ప దేనికీ వెరవలేదు. అందుకే, ఏ పని చేసినా త్రికరణశుద్ధితోనే ఆచరించారు. రాజు తన ఆధిపత్యాన్ని కాపాడుకోడానికి, శతృవుల నుంచి తనను, తన రాజ్యాన్ని రక్షించుకోడానికి అవలంబించాల్సిన మార్గాలను కౌటిల్యుడు వివరించాడు. విదేశీ వాణిజ్యం ఎలా చెయ్యాలి, ధనానికి సంబంధించిన విషయాల్లో ఎలా వ్యవహరించాలి తెలిపాడు. పీవీ వాటన్నింటినీ అందిపుచ్చుకుంటూనే తనదైన మార్గంలో నడిచారు. జ్ఞానయోగిగా తాను పొందిన జ్ఞానాన్ని, ఆ మహాగ్రంథాల సారాన్ని ఆధునిక మార్గంలో ఆచరణలో చూపించారు. జవహర్ నెహ్రూ, ఇందిరాగాంధీ నిర్దేశించిన ఆర్ధిక విధానాలకు గౌరవం, ప్రచారం కలిపిస్తూనే, దేశ పరిస్థితులకు అనుగుణంగా, తన సరళిని జతపరచి జేజేలు కొట్టించుకున్నారు. అదే పీవీ చూపించిన లౌక్య ప్రతిభ. చీఫ్ ఎలక్షన్ కమీషనర్‌గా టీఎన్ శేషన్ ధిక్కార స్వరంతో సర్వ స్వతంత్రుడుగా వ్యవహరిస్తున్న సమయంలో, అదనంగా మరో ఇద్దరు కమీషనర్లను నియమించి, సరిచేసి సమతుల్యతను ఏర్పరచారు. ఇదీ మంత్రాంగంలో భాగమే. కౌటిల్యుడు 'అర్ధశాస్త్ర' రచనకు శ్రీకారం చుట్టినపుడు అర్ధశాస్త్ర ప్రవర్తకులుగా భావించే బృహస్పతికి, శుక్రాచార్యుడికి తొలి నమస్కారం సమర్పించాడు. అట్లే, పీవీ కూడా చాణుక్యుడు, తిమ్మరసు మొదలు మహామంత్రులందరికీ మనసులో నమస్కారం చేసుకొని, ముందుకు సాగి వుంటారు. ఇదంతా భారతీయమైన ఆలోచనా విధానమే. పీవీ ఆసాంతం భారతీయతను అంటిపెట్టుకొని జీవించారు. కౌటిల్యుడు చాలా సూత్రాలను నిర్దేశించాడు. పెద్దల సహవాసం, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఇంచుమించు వాటన్నింటినీ పీవీ పాటించారు. చైనా నుంచి ఎప్పటికైనా ముప్పు ఉంటుందని గ్రహించి, అమెరికాతో బంధాలను పెంచారు. అదే ఈరోజు అక్కరకు వస్తోంది. భవిష్యత్తు మొత్తం శాస్త్ర, సాంకేతిక రంగాలదేనని గ్రహించి, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థల బలోపేతానికి బలమైన పునాదులు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎక్కడో కుగ్రామం నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసీలో ఉండేవారిని, చూస్తూ వీడియో కాల్లో మాట్లాడుకునే సౌకర్యం ఈనాడు మనం అనుభవిస్తున్నాం. ఇండియాలో కూర్చొని ఆస్ట్రేలియా యూనివర్సిటీలో ఆన్ లైన్ కోర్సును చేయగలుగుతున్నాం. అంబాసిడర్, ఫియట్, మారుతివంటి నాలుగైదు మోడల్స్ తప్ప మిగిలిన కార్లు మనకు తెలియదు. ఇప్పుడు రోల్స్ రాయిస్ మొదలు అనేక విదేశీ కార్లు మన రోడ్లపై తిరుగుతున్నాయి. విమానాలలో ప్రపంచ దేశాలన్నింటినీ ఈనాడు చుట్టేస్తున్నాం. ఈ సకల భోగాలన్నీ పీవీ నరసింహారావు కల్పించిన ఆర్ధిక సంస్కరణల మహాఫలమే. ఇదే దార్శనికత, దేశభక్తికి ప్రతీక. మౌనం విలువ, మాట విలువ తెలిసిన వాడు కాబట్టే, అన్ని భాషలను నేర్చుకున్నా కొన్ని వేళల్లో మౌనాన్నే ఆశ్రయించారు. ఒక సందర్భంలో, స్పానిష్‌లో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇదీ మంత్రిత్వ ప్రతిభలో భాగమే. దార్శనికత, దేశభక్తి, సకలశాస్త్ర జ్ఞానసంపద, సంయమనం, ఆచరణాశీలం కలిగిన జ్ఞానయోగి, కర్మయోగి పీవీ. మహారాజులు, చక్రవర్తుల కాలం తర్వాత ఆధునిక యుగంలో, నేటి భారతంలో పీవీ నరసింహారావు నిస్సందేహంగా మహామంత్రి శబ్దవాచ్యుడు. అచ్చమైన ఆంధ్రుడు, స్వచ్ఛమైన భారతీయుడు. ఈ మహామనీషికి భారతప్రభుత్వం 'భారతరత్న' అందించి తన ఔన్నత్యాన్ని చాటుకుంది. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
భారత రత్న.. కేంద్రం సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో తొలిసారి ఈ ఏడాదిలోనే ఐదుగురికి భారతరత్న ప్రకటించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో ఒకే సంవత్సరంలో ఎక్కువమందికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించినట్లయింది. గతంలో 1999లో నలుగురికి భారతరత్న ప్రకటించడమే ఇప్పటివరకు రికార్డు. ఈ ఏడాది భారతరత్న దక్కించుకున్నవారితో కలిపి భారతరత్నాల జాబితాలో ఇప్పటివరకు చోటు దక్కించుకున్న వారి సంఖ్య మొత్తం 53కు చేరింది.కేంద్ర ప్రభుత్వం 1954లో అత్యున్నత పౌర పురస్కారాలైన భారతరత్న, పద్మవిభూషణ్‌లను ఏర్పాటుచేసింది. ఏదైనా రంగంలో అసాధారణ సేవలు అందించి అత్యున్నత స్థాయి పనితీరు కనబరిచిన వారికి భారతరత్న ఇస్తారు. ఈ పురస్కారానికి సంబంధించిన సిఫార్సులను ప్రధాని రాష్ట్రపతికి అందజేస్తారు. ప్రధాని చేసే సిఫారసు తప్ప ఎలాంటి కేంద్ర ప్రభుత్వం ఇతర అధికారిక సిఫారసులేవి రాష్ట్రపతికి వెళ్లవు. అవార్డు కింద రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువపత్రం, భారతరత్న పతకం అందిస్తారు. ఎలాంటి నగదు ఇవ్వరు. ఇదీ చదవండి.. 8 మంది ఎంపీలతో ప్రధాని లంచ్.. స్వయంగా బిల్లు చెల్లింపు -
ఘంటసాలకు భారతరత్న.. 33 దేశాల తెలుగు సంస్థల విన్నపం
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శతజయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలనే నినాదంతో శంకరనేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యములో ఇప్పటివరకు 150 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డాదాపు ఒక సంవత్సరం పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎంతో మంది సినీ ప్రముఖులు 33 దేశాల తెలుగు స్మస్థల నాయకులు, తెలుగేతర ప్రముఖులు కూడా పాల్గొన్నారని తెలిపారు. గత 6 నెలలుగా రత్నకుమార్ (సింగపూర్), ఘంటసాల కుటుంబ సభ్యుల సహకారం చాలా ఉందని తెలియచేశారు. ఇందులో భాగంగా యూఎస్ఏ నుంచి ప్రముఖ గాయకుడు, రచయిత ఫణి డొక్క వ్యాఖ్యాతగా 24 జులై 2022 నాడు జరిగిన ఆన్లైన్ జూమ్(Zoom) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అమరగాయకుడు, సంగీత దర్శకుడు, పదివేలకు పైగా పాటలు పాడి భారతదేశం, ముఖ్యంగా దక్షిణ భారతదేశం గర్వించతగునటువంటి మహాగాయకుడని కొనియాడారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని ఎందరో కళాకారులు ఆకాంక్షతో తాను కూడా ఏకీభవిస్తూ, భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నానని తెలిపారు. మరొక విశిష్ట అతిథి ప్రముఖ గాయకుడు, నటుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఘంటసాల గురించి మాట్లాడే అర్హత గాని, ఆయన గాన వైభవాన్ని గురించి చర్చించే అంత శక్తి గాని తనకు లేదని చెప్పారు. అయితే ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి గాయకుడికిగా ఆయనను సంగీత విద్వాంసుడాగానే కాకుండా, స్వాతంత్ర సమరయోధుడిగా కూడా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన గాంధర్వ గానం ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనుసరించడంతో పాటు అనుకరిస్తున్నారని అన్నారు. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, నంది, మా మ్యూజిక్ అవార్డు గ్రహీత (చెన్నై, ఇండియా) గోపిక పూర్ణిమ మాట్లాడుతూ, మహాగాయకులు, సంగీత దర్శకులు ఘంటసాలకు భారతరత్న పురస్కారంతో సత్కరించాలని ఒక ఆశయం కోసం కృషిచేస్తున్న దాదాపు 33 దేశాల తెలుగు సంఘాల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. యూఎస్ఏ నుంచి శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు ఆనంద్ దాసరి (డల్లాస్), రవి రెడ్డి మరకా (నెవార్క్), టీఏఎస్‌సీ అధ్యక్షుడు రావు కల్వకోట (లాస్ ఏంజిల్స్), అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ రవి, శశికళ పెనుమర్తి (అట్లాంటా), తదితరులు పాల్గొని మాట్లాడుతూ.. ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఘంటసాలకి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవమని అభిప్రాయపడుతూ ఆయనకి భారతరత్న అవార్డుతో సత్కరించాల్సిందే ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికాలోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారం భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు జెర్మనీ, నెథర్లాండ్స్, తైవాన్ , ఐర్లాండ్, జపాన్ స్విట్జర్లాండ్, నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 150 టీవీ కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ లింక్‌ని నొక్కి సంతకాల సేకరణకు మీ మద్దతు తెలియ చేయండి: https://www.change.org/BharatRatnaForGhantasalaGaru. ఈ కార్యక్రమలో పాల్గొన్న అందరికి బాలరెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటె ఈ చిరునామాకి ghantasala100th@gmail.com వివరాలు పంపగలరు. -
కేసీఆర్ తీర్మానం : వ్యతిరేకించిన ఎంఐఎం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముద్దుబిడ్డ, భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంంత్రి కే చంద్రశేఖరరావు సంబంధిత తీర్మానాన్ని మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. దీనిపై అధికార పార్టీకి చెందిన సభ్యులతో పాటు, విపక్ష కాంగ్రెస్ సభ్యులు సైతం ప్రసంగించి తీర్మానానికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా దేశ ప్రధానిగా పీవీ చేసిన సేవలను కొనియాడారు. ఆయన సేవలను గుర్తించిన భారతరత్న పురస్కారం ఇవ్వాల్సిందేనని ముక్తకంఠంగా డిమాండ్ చేశారు. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పీవీ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ లభించాల్సిన గౌరవం దక్కలేదన్నారు. ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. (పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలి: కేసీఆర్) అయితే సీఎం ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం వ్యతిరేకించడం గమనార్హం. పీవీకి భాతతరత్న ఇవ్వాలన్న తీర్మాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన మజ్జీస్ పార్టీ ఆ సమయంలో సభ నుంచి వాకౌట్ చేసింది. అయినప్పటికీ తీర్మాన్నీ సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం నుంచి అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ప్రారంభం కానున్నాయి. -
పీవీపై కేసీఆర్ సంచలన నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముద్దుబిడ్డ, దేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించారు. అలాగే నెక్లెస్‌రోడ్డుకు పీవీ జ్ఞాన్ మార్గ్‌గా పేరు పెట్టాలని, హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్ ఏర్పాటుకు కేసీఆర్ సంకల్పించారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో పీవీ శతజయంతి వేడుకల నిర్వహణపై శుక్రవారం సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీకి పీవీ నరసింహారావు పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ సాహసోపేతమైన భూ సంస్కరణలు అమలు చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. (సంస్కరణల ఆద్యుడు పీవీ) ఆయన సంస్కరణల ఫలితంగానే తెలంగాణలో 93 శాతం మంది చిన్న, సన్నకారు రైతులకు భూమి వచ్చిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చడంతో పాటు..అనేక రంగాల్లో సంస్కరణలు తెచ్చిన పీవీ ఆదర్శప్రాయుడని కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పీవీకి మరింత గౌరవం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లక్నేపల్లి, వంగర గ్రామాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. పీవీ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దేశ,విదేశాల్లో కూడా పీవీ శత జయంతి వేడుకలు నిర్వహించాలన్నారు. పార్లమెంట్లో మాజీ ప్రధాని విగ్రహం ప్రతిష్టించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. (ధీశాలి.. సంస్కరణశీలి) -
నడిచే దేవుడు కానరాలేదా?
రాష్ట్రంలో ఇప్పుడు భారతరత్న పురస్కారంపై వివాదం సాగుతోంది. స్వాతంత్య్ర సమరయోధుడు వీర సావర్కర్‌పై సీఎల్పీ నేత సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు చేయగా, బీజేపీ మంత్రులు అంతకంటే తీవ్రంగా ప్రతిదాడి సాగిస్తున్నారు. సాక్షి, హుబ్లీ (బెంగుళూరు): నడిచే దేవునిగా ప్రసిద్ధి చెందిన దివంగత తుమకూరు సిద్ధగంగా మఠాధిపతి శివకుమార స్వామీజీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని గుర్తుకు రాలేదా? పదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిన సమయంలో నిద్రపోయారా? అప్పుడు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకపోవడం శోచనీయం అని రాష్ట్ర మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి జగదీష్ శెట్టర్ కాంగ్రెస్‌పార్టీపై ధ్వజమెత్తారు. ఆదివారం హుబ్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వామీజీకి భారతరత్న కచ్చితంగా లభించాల్సిందన్నారు. ప్రస్తుతం తాము కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంపై డిమాండ్ చేస్తున్నామన్నారు. సిద్ధరామయ్యకు బుద్ధి ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు. ‘సిద్ధరామయ్య కాంగ్రెస్‌లోకి ఇటీవలే వచ్చారు. ఎమర్జన్సీ సమయంలో ఇదే సిద్ధరామయ్య ఇందిరాగాంధీ నియంతృత్వ ధోరణిపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు’ అని ఎద్దేవా చేశారు. అపార ప్రజాసేవ చేసిన శివకుమారస్వామిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. బోఫోర్స్ కుంభకోణాన్ని మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఈ దేశానికి కానుకగా ఇస్తే, ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తమ పరిపాలనను అందిస్తున్నారని అన్నారు. సిద్ధరామయ్య కాంగ్రెస్ గురించి చేసిన వ్యాఖ్యలను ఒకసారి పరిశీలించుకోవాలన్నారు. గతంలో ఎలాంటి ప్రకటనలు చేశారో ఆత్మావలోకనం చేసుకుంటే నిరంకుశ ధోరణి ఎవరిదో తేటతెల్లమవుతుందన్నారు. మహదాయిపై చర్చకు సిద్ధం గోవాలో కాంగ్రెస్ ఊరుకుంటే మహదాయి సమస్య తీరుతుందన్నారు. మహదాయిలో గోవా కాంగ్రెస్ వైఖరి ఏమిటని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ఒకే విధమైన వైఖరిని అవలంబిస్తోందన్నారు. మహదాయిపై గోవా సీఎం చర్చలకు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే మహదాయిపై నోటిఫికేషన్ వెలవడనుందని ఆయన హామీ ఇచ్చారు. సమరయోధులను చులకన చేయొద్దు: సీనియర్ రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర పోరాట యోధుల గురించి చులకనగా మాట్లాడటం మాజీ సీఎం సిద్ధరామయ్యకు తగదని డిప్యూటీ సీఎం గోవింద కారజోళ అన్నారు. హుబ్లీలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సిద్ధరామయ్య ముందు చరిత్రను తెలుసుకొని బాధ్యతాయుతంగా మాట్లాడటం నేర్చుకోవాలన్నారు. భాషా ప్రయోగాన్ని ఎలా చేయాలో తెలుసుకుంటే మంచిదన్నారు. ఎంతో రాజకీయ అనుభవం కలిగిన సిద్ధరామయ్య స్వాతంత్య్ర సాధన కోసం సర్వస్వం త్యాగం చేసి చివరికి ప్రాణాలను కూడా తృణప్రాయంగా అర్పించిన వారి పట్ల గౌరవభావంతో మాట్లాడాలన్నారు. అలా కాకుండా రాజకీయ లబ్ధి కోసం మహానుభావులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ఆయన గౌరవానికి మంచిది కాదన్నారు. -
భువిపై మెరిసిన రత్నం భూపేన్
‘‘భూమిని చీల్చుకుంటూ నేలంతా పరుచుకొని పారుతున్న నీకు, లక్షలాది ప్రజల హాహాకారాలు వినపడలేదా? నైతికతా, మానవతా ధ్వంసమైన చోట... చేష్టలుడిగి చూస్తున్నావా? నిర్లక్ష్యంగా, నిశ్శబ్దంగా, దారీతెన్నూలేకఎందుకా పరుగు నీకు గంగా’’ ‘‘వేనోళ్ళ ఘోషిస్తోన్న నీ చరితెక్కడ? సామాజిక అశాంతిపట్ల ఎందుకీ మౌనం’’ ... అని బ్రహ్మపుత్రానదిని నిలదీసిన కవి, గాయకుడు, సంగీత విజ్ఞానఖనీ, సామాజిక సేనాని వేరెవ్వరో కాదు గాన గంధర్వుడు భూపేన్ హజారికా. మిత్రులూ, సన్నిహి తులూ, అభిమానులూ, శ్రేయోభిలాషులూ భూపేన్‌దా అని ప్రేమగా పిలుచుకునే నాటి జనగాననిధీ, నేటి భారత రత్న భూపేన్ హజారికా ప్రశ్నలో సామాజిక బాధ్యత ఉంది. నదీనదాలను ప్రశ్నించడమే కాదు ప్రపంచ ప్రజల మనసులను తన గానామృత జలపాతంలో ముంచెత్తిన సంగీత సామ్రాజ్య రారాజు భూపేన్ దా. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చి అనతి కాలంలోనే లక్షలాది ప్రజల గుండెల్లో ఒదిగిపోయిన భూపేన్ హజారికా జీవితంలో ఏ కోణాన్ని తడిమి చూసినా ప్రజలఘోషే పల్లవై పలుకుతుంది. ఆయనలోని సంగీతం, సామాజిక చైతన్యం అతడిని అరుదైన సంగీతోద్యమ సేనానిగా నిలిపాయి. గొప్ప మానవతావాది అయిన భూపేన్ హజారికా అస్సాంలోని సదియా గ్రామంలో 1926, సెప్టెంబర్ 8వ తేదీన నీలకంఠ హజారికా, శాంతి ప్రియ హజారికాలకు జన్మించారు. హజారికా తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. అస్సాంలో షెడ్యూల్డ్ కులాలలో ఒకటైన కాయిబర్త కులానికి చెందినవాడు హజారికా. తండ్రి నీలకంఠ హజారికా ఆ ప్రాంతంలో సామాజిక ఉద్యమాలలో, కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవాడు. దానితోపాటు భూపేన్‌దా తల్లిదండ్రులిద్దరూ సంగీతంలో ప్రవేశం ఉన్నవారే. ఆయన మేనమామకు కూడా సంగీతంలో ప్రావీణ్యం ఉంది. భూపేన్‌దా తండ్రి 1929లోనే గౌహతిలోని బరాల్ ముఖ్ ప్రాంతానికి బదిలీ అయ్యారు. అక్కడి నుంచి 1935లో తేజ్‌పూర్‌కు వెళ్ళిన తర్వాత అక్కడ భూపేన్‌దా రాజకీయ ఓనమాలు దిద్దారు. ప్రముఖ నాటక రచయిత, కవి, అస్సాం ప్రప్రథమ సినీదర్శకులు జ్యోతిప్రసాద్ అగర్వాల్ పరిచయంతో పదేళ్ళ వయస్సులోనే 1936లో సెలోనా కంపెనీకి చెందిన అరోరా స్టూడియోలో భూపేన్‌దా పాడిన తొలి పాటను రికార్డు చేశారు. పన్నెండేళ్ళ వయస్సులోనే జ్యోతిప్రసాద్ అగర్వాల్ నిర్మించిన ‘ఇంద్రమాలతి’ సినిమాలో భూపేన్‌దా గొంతు నుంచి జాలు వారిన రెండు పాటలు ఆయన జీవితాన్ని మలుపుతిప్పాయి. అది మొదలు 2011లో తుదిశ్వాస వీడేవరకూ ఆయన గాత్రమే ఊపిరిగా బతికారు. అస్సామీ, బెంగాలీ, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ లాంటి విభిన్నభాషల్లోని వేనవేల పాటల్లోకి ఆయన గొంతు తర్జుమా అయ్యింది. వైవిధ్యాన్ని ఆరాధించే ప్రతి సంగీత ప్రియుడి ఇంటా ఆయన గొంతు ప్రతిధ్వనించింది. పాటే ప్రాణంగా బతికిన అలాంటి గొప్ప సంగీత స్వాప్నికుడిని ఇంటర్వూ్య చేసే మహావకాశం ఒక జర్నలిస్టుగా నాకు దక్కింది. 1994 నవంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవానికి ఆయన జ్యూరీ మెంబర్‌గా వచ్చారు. హజారికా బాల్యం, యవ్వనం, జీవితం అంతా కవిత్వం, గాత్రంతో నిండి ఉంటాయి. తల్లిదండ్రులే తనకు తొలి స్ఫూర్తి అంటారు. ఆ తర్వాత తన చుట్టూ ఉన్న సమాజం నుంచి చాలా నేర్చుకున్నానని స్వయంగా చెపుతారు. బడికెళ్ళి రాగానే ప్రతి రోజూ సాయంకాలం ఇంటి దగ్గర ఉండే లారీ డ్రైవర్లతో కూర్చొని వాళ్ళు పాడే పాటలు, వారి టేప్ రికార్డర్లలో పెట్టుకునే పాటలు వింటూ గడపడం భూపేన్ దా దినచర్యలో భాగమైంది. భూపేన్ దా జీవితంలో మరో ముఖ్యమైన మలుపు బిష్ణురఖాను కలుసుకోవడం. బిష్ణురఖా సోషలిస్టు రాజకీయాలు కలిగిన కవి, గాయకుడు. పేదలు, శ్రామికులు, పీడితుల గురించి బిష్ణురఖా పాడేపాటలు భూపేన్ దా సైద్ధాంతిక దృక్పథానికి బాటలు వేశాయి. అదేవిధంగా తనను గాయకుడిగా సినీరంగానికి పరిచయం చేసిన జ్యోతి ప్రసాద్ అగర్వాల్ నుంచే హజారికాకు మార్క్సిస్టు సిద్ధాంతంతో పరిచయమైంది. భూపేన్‌దా తల్లిదండ్రులకు తమ కొడుకు జర్నలిస్టు కావాలని ఉండేది. కానీ ఆయన ప్రపంచం సంగీతమే. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు కలకత్తాలో బీఏ డిగ్రీ, బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టాను సాధించారు. చాలా కొద్దికాలం గౌహతీలోని రేడియో కేంద్రంలో పనిచేశారు. ఆ తర్వాత స్కాలర్షిప్ రావడంతో జర్నలిజంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి 1949 లో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. ఆయన కొలంబియాలో చదువుతున్న సమయంలో నల్లజాతి ప్రజల హక్కుల ఉద్యమం ఉధృతంగా సాగు తోంది. ఆ ఉద్యమంలో నల్లజాతి గాయకుడు పాల్ రాబ్సన్ ఒక ధిక్కార స్వరం. భూపేన్ హజారికాను పాల్ రాబ్సన్ సంగీతం, పాటలు అమి తంగా ఆకర్షించాయి. దీంతో నల్లజాతి ప్రజా ఉద్యమంలో హజారికా కూడా భాగమయ్యారు. పాల్ రాబ్సన్ ప్రదర్శనల మీద అమెరికా పోలీసుల నిర్బంధం తీవ్రంగా ఉండేది. చాలాసార్లు పాల్రాబ్సన్తో పాటు, ప్రదర్శనలను చూడటానికి వచ్చిన ప్రేక్షకులను కూడా అరెస్టు చేసేవాళ్ళు. అదే సందర్భంలో భూపేన్ హజారికా కూడా రెండు సార్లు అరెస్టయ్యారు. ఆ సమయంలో అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మీ పండిట్ అమెరికాలో భారత రాయబారిగా ఉన్నారు. ఆమే స్వయంగా జోక్యం చేసుకొని భూపేన్ హజారికాను విడుదల చేయించినట్టు, భూపేన్ స్వయంగా నాతో ఇంటర్వూ్యలో చెప్పారు. ఆ తరువాత కూడా ఆయన తన విప్లవ రాజకీయాల నుంచి వెనుదిరగలేదు. భారతదేశంలోనూ అదే స్ఫూర్తిని కొనసాగించారు. 1953వ సంవ త్సరంలో అమెరికా నుంచి భారత దేశానికి తిరిగిరాగానే ఆనాడు కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉన్న భారత ప్రజానాట్య మండలి (ఇఫ్టా)తో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నారు. 1955లో గౌహతీలో జరిగిన ఇఫ్టా అఖిల అస్సాం మూడవ మహాసభలకు ఆహ్వన సంఘం కార్యదర్శిగా పనిచేశారు. అస్సాంలో.. ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాల పర్వతాలు, అడవులు, నదులు, సముద్రం ఆయన పాటల్లో ప్రతిధ్వనించేవి. తేయాకు తోటల్లో పనిచేసే మహిళా కార్మికుల దయనీయ స్థితిని ప్రతిబింబిస్తూ తాను రాసిన ‘‘ఏక్ కలి దో పత్తియా’’ అనే పాట ఆయన్ను శ్రామికజనపక్షపాతిగా నిలబెట్టాయి. పల్లకీలు మోసే బోయీలపై రాసిన ‘‘డోల.. హో.. డోల’’ పాట వారి చెమట చుక్కల విలువను ఇనుమడిస్తుంది. ఇలా ఆయన రాసి, పాడిన ప్రతి పాటా జనప్రియమై, ప్రజల నీరాజనాలందుకుంది. కవిగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, సినిమా దర్శకుడిగా పదుల సినిమాల నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఎన్నో అవార్డులను, రివార్డులను సొంతం చేసుకున్నారు. సినిమా రంగంలో అత్యున్నతమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్ బిరుదులను సొంతం చేసుకున్న భూపేన్దాకి మర ణానంతరం 2019లో భారత రత్న అవార్డునిచ్చారు. ప్రపంచ ప్రజల మదిలో తనదైన స్థానం సంపాదించుకున్న భూపేన్ దా నిగర్వి. 1994లో నేను ఇంటర్వూ్య చేసిన సందర్భంలో ఎ.ఆర్.రెహమాన్‌పై మీ అభిప్రాయం ఏమిటని అడిగాను. ఎ.ఆర్.రెహమాన్ కృషిని ఆయన ప్రశంసిస్తూనే, శాస్త్రీయ సంగీతంతోనే సంతృప్తి పడకుండా, ప్రజల నాలుకల మీద నాట్యమాడే సంగీత ఝరులను ఒడిసిపట్టుకోగలిగితే రెహమాన్ మంచి సంగీత దర్శకుడవుతాడని చెప్పారు. భూపేన్ హజారికా జీవితంలో మరొక ముఖ్యమైన ఘట్టం ప్రముఖ చలనచిత్ర దర్శకురాలు, రచయిత కల్పనా లజ్మితో పరిచయం. 1980 ప్రారంభంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆయన తుదిశ్వాస విడిచే వరకూ ఇద్దరూ మంచి మిత్రులుగా కొనసాగారు. వీరిద్దరూ 1986లో ‘ఏక్ ఫల్’’ అనే చిత్రానికి సంగీత దర్శకత్వం అందించారు. ఈ ఇరువురి కాంబినేషన్లో చాలా అద్భుతమైన సినిమాలు వచ్చాయి. సినీ ప్రపంచంలో తమదైన ముద్రవేసారు. కల్పనా లజ్మి, భూపేన్ దా కలిసే జీవించారు. కలిసే స్వప్నించారు. ఆ ఇద్దరి కలల కొనసాగింపుగా వచ్చిందే ‘రుడాలి’ సినిమా. అదే భారతదేశ చలన చిత్ర రంగంలో సంచలనం రేపింది. మాధురీ దీక్షిత్ నటించిన ‘దామిని’ సినిమా కూడా వేనోళ్ళ కొనియాడబడింది. వీరిద్దరి సహజీవనం మీద ఎన్నో పుకార్లు వచ్చాయి. ఎన్నెన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. అయినా కల్పనా లజ్మీ, భూపేన్లు ఒకరికోసం ఒకరన్నట్టుగా బతికారు. రాజకీయంగా భూపేన్ దా నిర్వహించిన పాత్ర మరువలేనిది. 1967–72 మధ్యలో అస్సాం శాసన సభలో ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. అస్సాంతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అనేక ఉద్యమాలతో భూపేన్ దాకు సత్సంబంధాలుండేవి. ఈశాన్య రాష్ట్రాలను ఢిల్లీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయనే వాదనను భూపేన్ అవకాశం వచ్చినప్పుడల్లా వినిపించారు. సాయుధ తిరుగుబాట్లను ప్రత్యక్షంగా సమ ర్థించకపోయినా, అటువంటి పరిణామాలకు ప్రభుత్వాలదే బాధ్యతని తేల్చి చెప్పిన ధీశాలి. అస్సాంలో అస్సాం గణపరిషత్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన తన నిరసన గళాన్ని విడువలేదు. ఆ ప్రభుత్వం కూడా అస్సాం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని బహిరంగంగా చెప్పారు. నవంబర్ 5, 2011న కన్నుమూసిన భూపేన్‌దాకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది నివాళి అర్పించారు. గౌహతిలో నవంబర్ 9వ తేదీన జరిగిన అంత్యక్రియల్లో దాదాపు 5 లక్షల మంది పాల్గొనడం ‘భారతరత్న’ కంటే చాలా ముందు సంగీత సామ్రాజ్యాధిపతికి భారత ప్రజలిచ్చిన ఘనమైన నివాళి. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
రాజనీతిజ్ఞుడికి అసలైన గౌరవం!
దేశ రాజకీయాల్లో ఓ అరుదైన వ్యక్తిత్వం. విదేశాంగ, రక్షణ, ఆర్థిక, వాణిజ్యం వంటి భిన్నమైన మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన సామర్థ్యం. దశాబ్దాల రాజకీయ జీవితంలో స్ఫూర్తిదాయక వ్యవహారశైలితో ఆదర్శంగా నిలిచిన మహామనీషి. చిన్న వయసులోనే రాజనీతిజ్ఞుడిగా, దౌత్యవేత్తగా, రచయితగా, జర్నలిస్టుగా, అధ్యాపకుడిగా ఇలా అవకాశం దొరికిన ప్రతి రంగంలోనూ సత్తా చాటుకున్న సమర్థుడు. ఇవన్నీ భారతదేశానికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురించిన కొన్ని అంశాలు మాత్రమే. 2012 నుంచి 2017 భారత 13వ రాష్ట్రపతిగా సేవలందించిన ప్రణబ్ దా.. నాటి ప్రధాని ఇందిరా గాంధీ నుంచి.. మొన్నటి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వాల్లో వివిధ మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా.. ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలికి 23 ఏళ్లపాటు సీడబ్ల్యూసీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడినపుడల్లా ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించి గట్టెక్కించారు. దేశ రాజకీయాల్లో ప్రణబ్ సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ఈ మహనీయుడి గురించిన కొన్ని విశేషాలు. నరనరాన దేశభక్తి 1935 డిసెంబర్ 11న పశ్చిమబెంగాల్లోని బిర్భుమ్ జిల్లా మిరాటీలో స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో ప్రణబ్ దా జన్మించారు. ఆయన తండ్రి కమద కింకార్ ముఖర్జీ, తల్లి రాజలక్ష్మి. తండ్రి స్వాతంత్య్ర పోరాటాన్ని చూస్తూనే ఆయన పెరిగి పెద్దవాడయ్యారు. చరిత్ర, రాజనీతి శాస్త్రంలో పీజీ పూర్తిచేశారు. ఆ తర్వాత కలకత్తా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. టీచర్‌గా వృత్తిపరమైన జీవితాన్ని ప్రారంభించిన ప్రణబ్ దా.. చాలా రోజుల పాటు ‘దేశేర్ దక్’(మాతృభూమి పిలుపు) అనే పత్రికకు జర్నలిస్టుగా పనిచేశారు. తండ్రి అప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కావడంతో.. ఆయన అడుగుజాడల్లోనే ప్రణబ్ కూడా కాంగ్రెస్ ద్వారానే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఇందిర ప్రియశిష్యుడిగా.. జాతీయ రాజకీయాల్లో ప్రణబ్ జోరుకు బీజం పడింది మాత్రం 1969లోనే. ప్రణబ్ చొరవను, నాయకత్వ లక్షణాలను గుర్తించిన ఇందిరాగాంధీ.. ఆయన్ను ప్రియశిష్యుడిగా చేసుకున్నారు. 1969లో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. 1979లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవగానే.. సభలో పార్టీ ఉపనేతగా, ఇందిర కేబినెట్లో మంత్రిగా స్థానం సంపాదించారు. 1980లో రాజ్యసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. ప్రణబ్ సామర్థ్యాన్ని గుర్తించిన ఇందిర.. 1982లో కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలను అప్పజెప్పారు. పార్టీలో, ప్రభుత్వంలో ఇందిర తర్వాతి స్థానం ప్రణబ్‌దే అనుకునేవారు. అయితే 1984లో ఇందిర హత్యతో పరిస్థితి తారుమారైంది. పార్టీలో ప్రణబ్ ఎదుగుదలను ఓర్వలేని నేతలంతా ఏకమై.. పార్టీలో ఆయన్ను పక్కనబెట్టేలా రాజీవ్‌పై ఒత్తిడి తీసుకొచ్చారంటారు. 1991లో రాజీవ్ గాంధీ హత్య వరకు పార్టీలో ప్రణబ్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పీవీ నరసింహారావు ప్రధాని కాగానే.. ప్రణబ్‌కు కేంద్ర మంత్రి బాధ్యతలు ఇవ్వడంతోపాటు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్‌గా నియమించారు. 1995–96ల్లో భారత విదేశాంగ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2004లో మళ్లీ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. 2012 వరకు పార్టీ లోక్‌సభాపక్ష నేతగా ఉన్నారు. ఈ సమయంలోనే రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తించారు. సొంత కూటమి పెట్టినా.. ఇందిర మరణం తర్వాత పార్టీలో ఎదురవతున్న అవమానాలతో.. ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. 1987లో రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. తదనంతర పరిణామాలతో 1989లో ఈ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రచయితగా జర్నలిస్టుగా పనిచేసిన అనుభవంతో.. వీలున్నపుడల్లా తన భావాలకు అక్షరరూపం ఇవ్వడాన్ని మాత్రం ప్రణబ్ మరిచిపోలేదు. 1987లో ‘ఆఫ్ ద ట్రాక్’పుస్తకాన్ని 1992లో ‘సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్’, చాలెంజెస్ బిఫోర్ ద నేషన్ పుస్తకాలను.. 2014లో ‘ద డ్రమాటిక్ డెకేడ్: ద డేస్ ఆఫ్ ఇందిరాగాంధీ ఇయర్స్’అనే పుస్తకాలను రచించారు. ఇందిర పాలనను, అధికారాన్ని దగ్గరగా చూసిన అనుభవం.. దౌత్యవేత్తగా ప్రపంచంలో భారత్ స్థానాన్ని అవగతం చేసుకున్న సమర్థుడిగా.. కిందిస్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా దేశంలోపల సమస్యలను చూసిన వ్యక్తిగా తన అనుభవాలను, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ పుస్తకాల్లో పేర్కొన్నారు. భారత 13వ రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ప్రభావవంతంగా సాగింది. లైంగిక నేరాలను తీవ్రంగా పరిగణించేలా.. ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ల్లో సవరణలు చేసిన ‘క్రిమినల్ లా (సవరణ) ఆర్డినెన్స్ – 2013’కు ఆమోదముద్ర పడింది ఈయన రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే. మంత్రిగా ప్రణబ్.. కేంద్ర మంత్రిగా ఉన్న భారత్– అమెరికా పౌర అణు ఒప్పందంపై ఇరుదేశాల సంతకాలు. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వంపై అమెరికాను ఒప్పించిందీ ప్రణబ్ హయాంలోనే. జేఎన్యూఆర్ఎమ్ సహా పలు సామాజిక సంక్షేమపథకాలకు రూపకల్పన చేశారు. 1980ల్లో తొలిసారి ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టిన సమయంలో.. తీసుకొచ్చిన మార్పులతో భారత ఆర్థిక వ్యవస్థ సంస్కరణవాదిగా పేరుతెచ్చుకున్నారు. 2008లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న ప్రణబ్.. 2010లో ఆసియాలో అత్యుత్తమ ఆర్థిక మంత్రి అవార్డు పొందారు. 2013లో బంగ్లాదేశ్ రెండో అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. 1957లో సువ్ర ముఖర్జీతో ఆయన వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. 2015లో ప్రణబ్ దా భార్య కన్నుమూశారు. దౌత్యవేత్తగా విశేషానుభవం రాజకీయవేత్తగానే కాదు.. దౌత్యవేత్తగానూ దేశానికి ప్రణబ్ దా సేవలందించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకులకు బోర్డ్ ఆఫ్ గవర్నర్‌గా వ్యవహరించారు. కామన్వెల్త్ దేశాల ఆర్థిక మంత్రుల సమావేశాలకు 1982, 83, 84ల్లో భారత బృందానికి నేతృత్వం వహించారు. 1995లో అక్లాండ్లో జరిగిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ సదస్సులోనూ భారత బృందానికి నాయకత్వం వహించారు. -
మొదట కమ్యూనిస్ట్.. తర్వాత నేషనలిస్ట్!
న్యూఢిల్లీ: మృదు భాషి, సున్నిత హృదయుడు, కవి..! దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు, గొప్ప వక్త..! మితవాది, ఆదర్శ నేత, విలువలున్న నేత..! ముగ్గురు వేర్వేరు వ్యక్తులను వర్ణించే వ్యక్తీకరణలుగా కన్పిస్తున్న ఈ మూడు ఒకే వ్యక్తిలోని మూడు పార్శ్వాలు. ఆ వ్యక్తే మాజీ ప్రధాని, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి. మతవాద పార్టీగా పేరున్న బీజేపీకి ‘మితవాద ముఖం’గా ఆయనకు పేరుంది. 1998లో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏలో చేరేందుకు పలు ఇతర పార్టీలు అంగీకరించడానికి ప్రధాన కారణం ఆయనలోని ఈ మితవాద వ్యక్తిత్వమే. బాబ్రీమసీదు విధ్వంసాన్ని ఖండించి లౌకికవాదుల మనస్సులనూ ఆయన గెలుచుకున్నారు. చక్కని కవిత్వం రాసిన వాజ్‌పేయి పెళ్లి చేసుకోలేదు. 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో బ్రాహ్మణ కుటుంబంలో కృష్ణ బిహారీ, కృష్ణాదేవి దంపతులకు ఆయన జన్మించారు. బ్రిటిష్ పాలననువ్యతిరేకించి కొద్దికాలం జైలు జీవితం గడిపారు. ‘క్విట్ ఇండియా’లోనూపాల్గొన్నారు. హిందూ జాతీయవాద సంస్థ ఆరెస్సెస్‌లో చేరడానికి ముందు కమ్యూనిజం పట్ల ఆకర్షితుడు కావడం విశేషం. 1950లలో న్యాయవిద్యను వదిలేసి ఆరెస్సెస్ పత్రిక నిర్వహణలో నిమగ్నమయ్యారు. జనసంఘ్ నేత శ్యామాప్రసాద్ ముఖర్జీకి సన్నిహిత అనుచరుడయ్యారు. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులను వ్యతిరేకస్తూ ముఖర్జీ 1953లో కశ్మీర్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో వాజ్‌పేయి సహాయంగా అక్కడే ఉన్నారు. ముఖర్జీ మరణానంతరం ఆయన వారసుడిగా 1957 లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారి జనసంఘ్ తరఫున పోటీచేసి గెలిచారు. యువకుడే అయినప్పటికీ వాక్పటిమతో పార్టీలకతీతంగా సభ్యుల ప్రశంసలందుకున్నారు. వాజ్‌పేయి ప్రతిభను గుర్తించిన నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. ఏదో ఒకరోజు వాజ్‌పేయి ప్రధాని కాగలడని అప్పుడే జోస్యం చెప్పారు. 1975లో ఎమర్జెన్సీని వ్యతి రేకించి జైలుపాలయ్యారు. 1977లో జనసంఘ్‌ను జనతా పార్టీలో విలీనం చేసి విదేశాంగ మంత్రిగా విధులు చేపట్టారు. అనంతరం 1980లో ప్రాణమిత్రుడు అద్వానీ, భైరాన్‌సింగ్ షెకావత్‌లతో బీజేపీని ప్రారంభించారు. -
భారత రత్న.. వాజ్‌పేయి!
న్యూఢిల్లీ: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న'ను మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞ దిగ్గజం, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. తొలిసారి, ప్రొటోకాల్‌ను కాదని, రాష్ట్రపతి భవన్లో కాకుండా, వాజ్‌పేయి నివాసానికి స్వయంగా వచ్చి.. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని శుక్రవారం ఆ దార్శనిక నేతకు అందజేశారు. ఐదేళ్లూ విజయవంతంగా కొనసాగిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు సృష్టించిన.. 5 దశాబ్దాల పాటు పార్లమెంటేరియన్‌గా సేవలందించిన అటల్జీ ప్రస్తుతం 90 ఏళ్ల వయసులో తీవ్రమైన వృద్ధాప్య సమస్యలతో కదల్లేని స్థితిలో ఉండడం తెలిసిందే. ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లో ఉన్న వాజ్‌పేయి నివాసంలో కొద్దిమంది ఆహూతుల సమక్షంలో ప్రత్యేకంగా జరిగిన ఈ వేడుకకు హాజరైన వారిలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాజ్‌పేయి పెంపుడు కుమార్తె నమిత, అల్లుడు రంజన్ భట్టాచార్య తదితరులు ఉన్నారు. అనంతరం ప్రశంసాపత్రం చదివి వినిపించారు. ‘అందరినీ కలుపుకుపోయి, ఒక్కతాటిపైకి తీసుకువచ్చిన చురుకైన రాజనీతిజ్ఙుడు వాజ్‌పేయి. పాకిస్తాన్‌తో చర్చలను ప్రారంభించే విషయంలో సహచరులు, ప్రతిపక్షాలను కాదని అంతరాత్మనే నమ్ముకుని ముందడుగు వేశారు’ అని అందులో పేర్కొన్నారు. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన తేనీటి విందులో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ అగ్రనేత అద్వానీ, ఆరెస్సెస్ చీఫ్ భాగవత్, పలువురు కేంద్రమంత్రులు, సీఎంలుప్రకాశ్సింగ్ బాదల్(పంజాబ్), వసుంధర రాజే(రాజస్తాన్), శివరాజ్ సింగ్ చౌహాన్(మధ్యప్రదేశ్), సయీద్(జమ్మూకశ్మీర్), చంద్రబాబునాయుడు(ఆంధ్రప్రదేశ్) తదితరులు పాల్గొన్నారు. వాజ్‌పేయికి భారతరత్న ప్రదానం చేయడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. వాజ్‌పేయికి గత ఏడాది డిసెంబర్ 24న, తన 90వ జన్మదినోత్సవానికి ఒకరోజు ముందు భారత రత్న ప్రకటించడం తెలిసిందే. భరతమాత ముద్దుబిడ్డ.. వాజ్‌పేయి తన జీవితాన్ని దేశసేవకే అంకితం చేసిన స్ఫూర్తిదాయక నేత అని మోదీ కొనియాడారు. అటల్‌జీని భరతమాత ముద్దుబిడ్డగా అభివర్ణించారు. స్వయంగా వాజ్‌పేయి నివాసానికి వచ్చి ఈ పురస్కారాన్ని అందజేసిన రాష్ట్రపతికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘అటల్జీ అనుక్షణం దేశం గురించే ఆలోచించే అసమాన నేత ఆయన. ఈ దేశంలో నాలాంటి కోట్లాదిమందికి ఆయనే స్ఫూర్తి. ఆయన జీవితం మాకు ఇలాగే స్ఫూర్తినిస్తూ ఉండాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా’ అన్నారు. భారతీయులకు ఇది చరిత్రాత్మకమైన రోజంటూ ఆ తరువాత ట్వీట్ చేశారు. అనారోగ్యం వల్ల వాజ్‌పేయిజీ బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నందువల్ల ఆయనింట్లోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని అరుణ్‌జైట్లీ తెలిపారు. వాజ్‌పేయికి భారతరత్న ప్రదానం చేయడంపై కాంగ్రెస్ చీఫ్ సోనియా హర్షం వ్యక్తం చేశారు. అణు పరీక్షల సాహసం.. దేశ విదేశాంగ విధానాన్ని కొత్త పుంతలు తొక్కించిన దార్శనికుడిగా పేరుగాంచిన వాజ్‌పేయి 1998 నుంచి 2004 వరకు ప్రధానిగా ఉన్నారు. పాక్‌తో సంబంధాల కోసం ప్రధానిగా ఆయన చేపట్టిన లాహోర్ బస్సు యాత్ర(1999), అప్పటి పాక్ ప్రధాని నవాజ్‌తో కలసి విడుదల చేసిన లాహోర్ ప్రకటన, విమర్శకుల ప్రశంసలనందుకున్నాయి. 1998-99 మధ్య ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో చేపట్టిన అణు పరీక్షలు అత్యంత సాహసంగా భావిస్తారు. 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన పదిసార్లు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అనారోగ్యం ఏమిటి? 2009లో వాజ్‌పేయి గుండెపోటుకు గురయ్యారు. అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు మాట పడిపోయిన పరిస్థితి. క్రమంగా మనుషులను గుర్తుపట్టే సామర్థ్యాన్ని కోల్పోయారు. ప్రస్తుతం మంచంపై నుంచి లేవలేని పరిస్థితిలో ఉండటంతో సహాయకులే అన్నివిధాలుగా చూసుకుంటున్నారు. స్పాంజ్‌తో శరీరాన్ని శుభ్రం చేయడం, దుస్తులు మార్చడం, సమయానికి అన్నీ అమర్చడం మొదలైనవన్నీ చేస్తున్నారు. ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు మాత్రమే బయటకు తీసుకువెళ్తున్నారు. దీర్ఘకాలిక డయాబెటిస్, డిమెన్షియా(జ్ఞాపకశక్తి, హేతుబద్ధత కోల్పోవడం)తో ఆయన బాధపడుతున్నారని సమాచారం. -
సచిన్‌కు భారతరత్న ఇలా ఇచ్చారు!
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను భారతరత్నకు ఎంపిక చేసే ప్రక్రియ ఎప్పుడు మొదలైందో తెలుసా? అతనికి అవార్డును ప్రకటించడానికి కేవలం రెండు రోజుల ముందు! సరిగ్గా చెప్పాలంటే.. సచిన్ తన కెరీర్లో చివరిది, 200వది అయిన టెస్టు మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగిన రోజున! సమాచార హక్కు చట్టం కింద హేమంత్ దూబే అనే వ్యక్తికి ప్రధాని కార్యాలయం ఇచ్చిన సమాచారంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అర్జెంటుగా సచిన్ బయోడేటా పంపాలంటూ 2013 నవంబర్ 14న ముంబై వాంఖడే స్టేడియంలో అతని చివరి టెస్టు మొదలైన తొలి రోజు పీఎంఓ నుంచి కేంద్ర క్రీడా శాఖకు ఆదేశాలందాయి. ఈ మేరకు మధ్యాహ్నం 1.35కు సమాచారం అందగా, సాయంత్రం 5.22 గంటలకల్లా బయోడేటాను క్రీడా శాఖ పంపింది. మర్నాడు, అంటే నవంబర్ 15న ప్రధాని మన్మోహన్సింగ్ ఈ ప్రతిపాదనను రాష్ట్రపతికి పంపారు. 16న ‘సచిన్‌కు భారతరత్న’ ప్రకటన వెలువడింది. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలని కోరుతున్న హేమంత్, ఆ క్రమంలోనే ఈ వివరాలను సేకరించాడు.