సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముద్దుబిడ్డ, భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంంత్రి కే చంద్రశేఖరరావు సంబంధిత తీర్మానాన్ని మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. దీనిపై అధికార పార్టీకి చెందిన సభ్యులతో పాటు, విపక్ష కాంగ్రెస్ సభ్యులు సైతం ప్రసంగించి తీర్మానానికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా దేశ ప్రధానిగా పీవీ చేసిన సేవలను కొనియాడారు. ఆయన సేవలను గుర్తించిన భారతరత్న పురస్కారం ఇవ్వాల్సిందేనని ముక్తకంఠంగా డిమాండ్ చేశారు. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పీవీ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ లభించాల్సిన గౌరవం దక్కలేదన్నారు. ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. (పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలి: కేసీఆర్)
అయితే సీఎం ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని టీఆర్‌ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం వ్యతిరేకించడం గమనార్హం. పీవీకి భాతతరత్న ఇవ్వాలన్న తీర్మాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన మజ్జీస్ పార్టీ ఆ సమయంలో సభ నుంచి వాకౌట్ చేసింది. అయినప్పటికీ తీర్మాన్నీ సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం నుంచి అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ప్రారంభం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment