సచిన్‌కు భారతరత్న ఇలా ఇచ్చారు!
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను భారతరత్నకు ఎంపిక చేసే ప్రక్రియ ఎప్పుడు మొదలైందో తెలుసా? అతనికి అవార్డును ప్రకటించడానికి కేవలం రెండు రోజుల ముందు! సరిగ్గా చెప్పాలంటే.. సచిన్ తన కెరీర్లో చివరిది, 200వది అయిన టెస్టు మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగిన రోజున! సమాచార హక్కు చట్టం కింద హేమంత్ దూబే అనే వ్యక్తికి ప్రధాని కార్యాలయం ఇచ్చిన సమాచారంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అర్జెంటుగా సచిన్ బయోడేటా పంపాలంటూ 2013 నవంబర్ 14న ముంబై వాంఖడే స్టేడియంలో అతని చివరి టెస్టు మొదలైన తొలి రోజు పీఎంఓ నుంచి కేంద్ర క్రీడా శాఖకు ఆదేశాలందాయి.
ఈ మేరకు మధ్యాహ్నం 1.35కు సమాచారం అందగా, సాయంత్రం 5.22 గంటలకల్లా బయోడేటాను క్రీడా శాఖ పంపింది. మర్నాడు, అంటే నవంబర్ 15న ప్రధాని మన్మోహన్‌సింగ్ ఈ ప్రతిపాదనను రాష్ట్రపతికి పంపారు. 16న ‘సచిన్‌కు భారతరత్న’ ప్రకటన వెలువడింది. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలని కోరుతున్న హేమంత్, ఆ క్రమంలోనే ఈ వివరాలను సేకరించాడు.