సచిన్ ఎక్కడంటే అక్కడే!
ముంబై: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు వేదికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాన్ని మాస్టర్ బ్లాస్టర్‌కే వదిలేశారు. మ్యాచ్‌కు తాము ఆతిథ్యమిస్తామని ముంబై, కోల్‌కతా క్రికెట్ అసోసియేషన్లు బీసీసీఐపై ఒత్తిడి తెస్తుండటంతో చేసేదేమీ లేక బోర్డు మాస్టర్‌కు అవకాశమిచ్చింది.
విండీస్‌తో సిరీస్‌కు సంబంధించి షెడ్యూల్‌ను ఇప్పటికే ఖరారు చేసిన నేపథ్యంలో సచిన్‌ను సంప్రదించి వేదికలను ప్రకటించనున్నారు. అయితే బీసీసీఐ రొటేషన్ పాలసీ ప్రకారం బెంగళూరు, అహ్మదాబాద్‌లకు ఈ మ్యాచ్‌లు కేటాయించాల్సి ఉంది. కానీ అరుదైన ఈ టెస్టు మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈసారి వాంఖడే, ఈడెన్‌గార్డెన్స్‌లలో ఒకటి ఎంపిక చేయనున్నారు. అయితే సెంటిమెంట్‌గా ముంబైకే ఎక్కువ అవకాశం ఉంది. సచిన్ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎక్కువగా అక్కడే ఉన్నారు కాబట్టి వాంఖడేకు కేటాయించడమే సరైందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. మరోవైపు చేతి గాయం నుంచి కోలుకున్న సచిన్... విండీస్ సిరీస్‌పై దృష్టిపెట్టాడు. టెస్టులకు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ముంబై తరఫున రంజీల్లో ఆడాలని భావిస్తున్నట్లు సమాచారం.