మృదు భాషి, సున్నిత హృదయుడు, కవి..! దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు, గొప్ప వక్త..! మితవాది, ఆదర్శ నేత, విలువలున్న నేత..! ముగ్గురు వేర్వేరు వ్యక్తులను వర్ణించే వ్యక్తీకరణలుగా కన్పిస్తున్న ఈ మూడు ఒకే వ్యక్తిలోని మూడు పార్శ్వాలు.
న్యూఢిల్లీ: మృదు భాషి, సున్నిత హృదయుడు, కవి..! దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు, గొప్ప వక్త..! మితవాది, ఆదర్శ నేత, విలువలున్న నేత..! ముగ్గురు వేర్వేరు వ్యక్తులను వర్ణించే వ్యక్తీకరణలుగా కన్పిస్తున్న ఈ మూడు ఒకే వ్యక్తిలోని మూడు పార్శ్వాలు. ఆ వ్యక్తే మాజీ ప్రధాని, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి. మతవాద పార్టీగా పేరున్న బీజేపీకి ‘మితవాద ముఖం’గా ఆయనకు పేరుంది. 1998లో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏలో చేరేందుకు పలు ఇతర పార్టీలు అంగీకరించడానికి ప్రధాన కారణం ఆయనలోని ఈ మితవాద వ్యక్తిత్వమే.
బాబ్రీమసీదు విధ్వంసాన్ని ఖండించి లౌకికవాదుల మనస్సులనూ ఆయన గెలుచుకున్నారు. చక్కని కవిత్వం రాసిన వాజ్‌పేయి పెళ్లి చేసుకోలేదు. 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో బ్రాహ్మణ కుటుంబంలో కృష్ణ బిహారీ, కృష్ణాదేవి దంపతులకు ఆయన జన్మించారు. బ్రిటిష్ పాలననువ్యతిరేకించి కొద్దికాలం జైలు జీవితం గడిపారు. ‘క్విట్ ఇండియా’లోనూపాల్గొన్నారు. హిందూ జాతీయవాద సంస్థ ఆరెస్సెస్‌లో చేరడానికి ముందు కమ్యూనిజం పట్ల ఆకర్షితుడు కావడం విశేషం. 1950లలో న్యాయవిద్యను వదిలేసి ఆరెస్సెస్ పత్రిక నిర్వహణలో నిమగ్నమయ్యారు. జనసంఘ్ నేత శ్యామాప్రసాద్ ముఖర్జీకి సన్నిహిత అనుచరుడయ్యారు. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులను వ్యతిరేకస్తూ ముఖర్జీ 1953లో కశ్మీర్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో వాజ్‌పేయి సహాయంగా అక్కడే ఉన్నారు.
ముఖర్జీ మరణానంతరం ఆయన వారసుడిగా 1957 లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారి జనసంఘ్ తరఫున పోటీచేసి గెలిచారు. యువకుడే అయినప్పటికీ వాక్పటిమతో పార్టీలకతీతంగా సభ్యుల ప్రశంసలందుకున్నారు. వాజ్‌పేయి ప్రతిభను గుర్తించిన నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.. ఏదో ఒకరోజు వాజ్‌పేయి ప్రధాని కాగలడని అప్పుడే జోస్యం చెప్పారు. 1975లో ఎమర్జెన్సీని వ్యతి రేకించి జైలుపాలయ్యారు. 1977లో జనసంఘ్‌ను జనతా పార్టీలో విలీనం చేసి విదేశాంగ మంత్రిగా విధులు చేపట్టారు. అనంతరం 1980లో ప్రాణమిత్రుడు అద్వానీ, భైరాన్‌సింగ్ షెకావత్‌లతో బీజేపీని ప్రారంభించారు.