
కోల్‌కతా: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యక్రమానికి వెళ్లకూడదంటూ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ను పలువురు కోరుతున్న వేళ.. వారందరికీ నాగ్‌పూర్‌లోనే సమాధానం చెబుతానని ఆయన అన్నారు. నాగ్‌పూర్‌లో జూన్ 7న సంఘ్ నిర్వహించే కార్యక్రమానికి రావాలని ప్రణబ్‌ను సంఘ్ ఆహ్వానించడం తెల్సిందే. ప్రణబ్ అక్కడ ఆరెస్సెస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ‘తృతీయ వర్‡్ష వర్గ్’ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగానూ హాజరవుతారు. అయితే కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, జాఫర్ షరీఫ్ తదితరులు ప్రణబ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఆరెస్సెస్ సమావేశానికి వెళ్లొద్దని కోరారు. జైరాం మాట్లాడుతూ ‘ప్రణబ్ క్రియాశీల రాజకీయ జీవితంలో ఉన్నన్ని రోజులూ కాంగ్రెస్‌లో మా లాంటి వారికి మార్గనిర్దేశనం చేశారు. ఇప్పుడు ఆయన సంఘ్ కార్యక్రమానికి వెళ్తున్నారు. వెళ్లకుంటే బాగుంటుంది’ అని అన్నారు. ఇలాంటి మరికొందరు వ్యాఖ్యలపై ప్రణబ్ మాట్లాడుతూ ‘నేనేం చెప్పాలో అది నాగ్‌పూర్‌లోనే చెబుతాను. కార్యక్రమానికి వెళ్లొద్దంటూ నాకు చాలా లేఖలు, ఫోన్లు వచ్చాయి. కానీ నేను ఏ ఒక్క దానికీ స్పందించలేదు. నాగ్‌పూర్‌లోనే మాట్లాడతాను’ అని అన్నారు. అయితే మరో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మాత్రం ప్రణబ్‌ను సమర్థించారు.
‘ప్రణబ్ ఇప్పటికే ఆరెస్సెస్ ఆహ్వానాన్ని అంగీకరించారు. ఆయన ఎందుకలా చేశారో ఇప్పుడు చర్చించడం అనవసరం. సార్, మీరు వెళ్లండి. కానీ ఆరెస్సెస్ సిద్ధాంతంలోని తప్పులేంటనేది మీ ప్రసంగం ద్వారా వారికి తెలియజేయండి’ అని చిదంబరం ప్రణబ్‌ను కోరారు. అటు ఆరెస్సెస్ కూడా.. కాంగ్రెస్ నాయకుడైన ప్రణబ్‌కు ఆహ్వానం పంపడంలో తప్పేమీ లేదంటోంది. మహాత్మాగాంధీ, లోక్‌నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ తదితరులు గతంలో తమ కార్యక్రమాల్లో ప్రసంగించారనీ, 1963 గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనాల్సిందిగా నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూడా ఆరెస్సెస్ కార్యకర్తలను ఆహ్వానించారని ఆరెస్సెస్ గతంలోనే పేర్కొనడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment