
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలపై పడిందా? తమ కార్యక్రమానికి హాజరుకావాలని ఆరెస్సెస్ పంపిన ఆహ్వానాన్ని ఆయన అంగీకరించడం పలు సందేహాలకు తావిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సుమారు 50 ఏళ్లు పనిచేసినా, ప్రధాని పదవి దక్కలేదని ప్రణబ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రియాశీల రాజకీయాల్లో ఉన్నన్నాళ్లూ ఆరెస్సెస్ జాతి వ్యతిరేక, దుష్ట సంస్థ అని మండిపడ్డ ప్రణబ్..ఇప్పుడు అదే సంస్థ వలంటీర్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకాబోతుండటం దేనికి సంకేతమనేది అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న. ఆరెస్సెస్–బీజేపీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతున్న సమయంలో ప్రణబ్ నిర్ణయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆరెస్సెస్ అంటరాని సంస్థ కాదనే సందేశం ఎందుకు ఇవ్వబోతున్నారన్నది ఇప్పటికైతే శేష ప్రశ్నే.
నాగ్‌పూర్ ప్రసంగంలో తేలుతుందా!
ప్రణబ్‌కు ఉన్న హోదా రీత్యా ఆయన్ని ప్రస్తుతానికి ఎవరూ వేలెత్తి చూపట్లేదు. స్వయంగా కాంగ్రెస్ కూడా ఆయన నిర్ణయంపై ఇప్పటి దాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కేంద్రంలో, సుమారు 20 రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో నడిపిస్తున్న ఆరెస్సెస్‌తో చర్చలు జరపడానికే ప్రణబ్ ఈ ఆహ్వానానికి అంగీకరించి ఉంటారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. తాను రాజకీయాల నుంచి వైదొలగలేదని నాగ్‌పూర్ నుంచి ఏమైనా సందేశం పంపినట్లయితే ఆయనపై ఉన్న గౌరవం పోతుందని తెలంగాణ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.
వెళ్లి వాళ్ల తప్పులేంటో చెప్పండి: చిదంబరం
ప్రణబ్ నిర్ణయంపై కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరై ఆ సంస్థ సిద్ధాంతాల్లోని తప్పులేంటో చెప్పాలని ప్రణబ్‌కు విజ్ఞప్తి చేశారు. ఆరెస్సెస్ ఆహ్వానాన్ని ప్రణబ్ ఎందుకు అంగీకరించారన్న దానిపై ఇప్పుడు చర్చించడం వృథా అని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment