ప్రణబ్‌ దా, మీరు నాకు పితృ సమానులు | Pranab Mukherjee shares PM Narendra Modi's letter, says it touched | Sakshi
Sakshi News home page

ప్రణబ్‌ దా, మీరు నాకు పితృ సమానులు

Published Fri, Aug 4 2017 4:09 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

ప్రణబ్‌ దా, మీరు నాకు పితృ సమానులు - Sakshi

ప్రణబ్‌ దా, మీరు నాకు పితృ సమానులు

మీ మార్గదర్శకత్వం నాలో స్ఫూర్తి నింపింది
మీతో కలసి పని చేయడం గొప్ప గౌరవం
ప్రణబ్‌కు ప్రధాని మోదీ ఉద్వేగభరిత లేఖ
మోదీ లేఖ హృదయాన్ని తాకింది: ప్రణబ్‌

న్యూఢిల్లీ: ‘‘ప్రణబ్‌ దా, మీరు నాకు తండ్రిలాంటి వారు.. గొప్ప మార్గదర్శకులు’’అని ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతిగా పనిచేసిన చివరి రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు ఉద్వేగభరితమైన లేఖ రాశారు. రెండు విభిన్న రాజకీయ సిద్ధాంతాలను నమ్మిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బంధాన్ని ఈ లేఖ లోకానికి చాటిచెప్పింది. ప్రణబ్‌ ఈ లేఖను గురువారం ట్వీటర్‌లో పంచుకున్నారు. ‘‘రాష్ట్రపతిగా చివరి రోజున నేను ప్రధాని మోదీ నుంచి ఒక లేఖను అందుకున్నాను.

 ఆ లేఖ నా హృదయాన్ని తాకింది. దీనిని మీ అందరితో పంచుకుంటున్నా’’అని ప్రణబ్‌ ట్వీట్‌ చేశారు. దీనికి మోదీ స్పందిస్తూ.. ‘‘ప్రణబ్‌ దా, మీతో కలసి పనిచేయడాన్ని ఆస్వాదించా’’నని పేర్కొన్నారు. ‘‘మూడేళ్ల క్రితం నేను ఢిల్లీకి ఒక స్థానికేతరునిగా వచ్చాను. అప్పుడు నా ముందు ఉన్న లక్ష్యం చాలా పెద్దది.. సవాల్‌తో కూడుకున్నది. ఇలాంటి సమయంలో మీరు నాకు పితృ సమానులుగా.. మార్గదర్శకునిగా ఉన్నారు. మీ జ్ఞానం, మార్గనిర్దేశనం, వాత్సల్యం నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని ఇచ్చాయి.

 మీ మేధాశక్తి నాకు నిరంతరం మేలు చేసింది. మీరు నాపై ఎంతో ప్రేమ, వాత్సల్యం, శ్రద్ధ చూపారు. వరుస సమావేశాలు, పర్యటనలతో గడిపే నాకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెపుతూ మీరు చేసిన ఒక ఫోన్‌ కాల్‌ నాకు ఎంతో శక్తిని ఇచ్చేది. మన పార్టీలు, ఆదర్శాలు, సిద్ధాంతాలు వేర్వేరు. మన అనుభవాల్లో కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. నా పాలనా అనుభవం అంతా నా రాష్ట్రం నుంచి పొందిందే. కానీ మీరు జాతీయ రాజకీయాలు, విధానాల్లో ఎంతో ముందున్నారు. సమాజానికి సేవ చేయాలనే తలంపుకలిగిన తరం నుంచి వచ్చిన నాయకులు మీరు. మీరు దేశ ప్రజలకు స్ఫూర్తి ప్రదాత.

నిస్వార్థ ప్రజాసేవకునిగా, అసాధారణమైన నాయకునిగా మిమ్మల్ని చూసి దేశం ఎప్పుడూ గర్విస్తుంది. మీరు అందించిన స్ఫూర్తి మాకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశనం చేస్తుంది. రాష్ట్రపతి జీ.. ప్రధానమంత్రిగా మీతో కలసి పనిచేయడం నాకు ఎంతో గౌరవం’’అని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు. జూలై 24న రాష్ట్రపతి బాధ్యతల నుంచి ప్రణబ్‌ తప్పుకోవడానికి ముందురోజు ఈ లేఖను మోదీ రాశారు. కాగా, ప్రధాని లేఖ రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న వ్యక్తిపై చూపించిన గౌరవాన్ని తెలిపిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement