
న్యూఢిల్లీ: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన చివరి పుస్తకం ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ ఆయన ఇంట్లోనే విభేదాలకు దారి తీసింది. ఆ పుస్తకాన్ని తన అనుమతి లేకుండా ప్రచురించ కూడదని కుమారుడు అభిజిత్ ముఖర్జీ చెబుతూ ఉంటే, పుస్తకం విడుదలకు అనవసరమైన ఆటంకాలు సృష్టించవద్దని ఆయన సోదరి శర్మిష్ట ముఖర్జీ విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరు పొందిన ప్రణబ్ ముఖర్జీ రాసిన ఈ చివరి పుస్తకంలో ఆయన సోనియాగాంధీ పైనా, మన్మోహన్ సింగ్‌పైనా చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇటీవల బయటకి వచ్చాయి.
తాను రాష్ట్రపతి అయ్యాక కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని చెబుతూ తనకు తెలిసిన ఇన్‌సైడ్ సమాచారాన్ని ప్రణబ్ ఆ పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకం అక్కా తమ్ముళ్ల మధ్య విభేదాలకు దారి తీయడం చర్చనీ యాంశంగా మారింది. తాను ఆ పుస్తకం తుది ప్రతుల్ని పూర్తిగా చదివిన తర్వాతే ప్రచురణకు అనుమతినిస్తానని అప్పటి వరకు పుస్తక విడుదలని నిలిపివేయాలని ప్రచురణ కర్తలకి చెప్పినట్టుగా కాంగ్రెస్ మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. దీనిపై అభిజిత్ సోదరి శర్మిష్ట తీవ్రంగా ప్రతిస్పందించారు. చీప్ పబ్లిసిటీ కోసం అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ అంటూ ట్వీట్ చేశారు.