
‘ఆమె నా రాజకీయ గురువు’
న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లుకు ఆమోదం సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. రేపటితో పదవీకాలం ముగియనుండటంతో ఆయనకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌గా ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ.. 1969 జూలైలో తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టానని తెలిపారు. ఐదుసార్లు రాజ్యసభకు, రెండు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఉన్నానని గుర్తు చేశారు. తాను పార్లమెంట్‌లో అడుగు పెట్టినప్పుడు స్వాతంత్ర్య సమరయోధులు, అపర మేధావులు ఉన్నారని వెల్లడించారు. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని చెప్పారు.
తన రాజకీయ గురువు ఇందిరా గాంధీ అని ప్రకటించారు. ఇందిరా, పీవీ నరసింహారావు, వాజపేయి నుంచి ఎంతో నేర్చుకున్నాని అన్నారు. పార్లమెంట్లో అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు ప్రాతినిథ్యం ఉందన్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ఆర్డినెన్స్ తేవాలని సూచించారు. పార్లమెంట్ సమావేశాల్లో సమయం వృధా అవుతుండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అనేక సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మంచి సహకారం అందిందని తెలిపారు. రాష్ట్రపతిగా తనకు ఎన్నో మధుర స్మృతులు మిగిల్చినందుకు పార్లమెంట్ సభ్యులకు ప్రణబ్ ధన్యవాదాలు తెలిపారు.