
న్యూఢిల్లీ: కేంద్రంలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ప్రభుత్వ కూర్పు, మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి తదితర అంశాలపై వారు కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. భేటీలో మోదీ, అమిత్ షా ఏం మాట్లాడుకున్నారనే దానిపై అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, ఏ మంత్రిత్వ శాఖలను ఎవరికి కేటాయించాలనే దానిపైనే వీరు చర్చించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ కొత్తగా బలపడటం అనేది మంత్రివర్గంలో ప్రతిబింబిస్తుందని సమాచారం.
అలాగే గత ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన మంత్రులందరికీ ఇప్పుడు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్, జవడేకర్, పియూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్, నరేంద్ర తోమర్‌లకు కొత్త మంత్రివర్గంలోనూ చోటు ఖాయమైనట్లు కనిపిస్తోంది. అలాగే బీజేపీ మిత్రపక్షాల్లో శివసేన, జేడీయూలకు రెండు పదవులు (ఒక కేబినెట్ మంత్రి, ఒక సహాయ మంత్రి), ఎల్‌జేపీ, శిరోమణి అకాలీదళ్‌కు ఒక పదవి దక్కే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో అన్నాడీఎంకే ఘోరంగా ఓడిపోయి ఒక్క సీటే గెలిచినప్పటికీ, తమిళనాడులో ఆ పార్టీ అధికారంలో ఉండటం, బీజేపీకి కీలక మిత్రపక్షం కావటంతో అన్నాడీఎంకేకు మంత్రిపదవి దక్కనున్నట్లు సమాచారం.
ప్రణబ్‌ను కలిసిన మోదీ
మాజీ రాష్ట్రపతి, సీనియర్ కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీని మోదీ మంగళవారం కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ రాజనీతిజ్ఞు డని మోదీ అభివర్ణించారు. ‘ప్రణబ్ దాను కలవడం ఎల్లప్పుడూ మంచి అనుభవం. ఆయనకున్న జ్ఞానం, దూరదృష్టి మరెవ్వరికీ ఉండవు. ఆయన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకునేలా దేశం కోసం ప్రణబ్ పనిచేశారు’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.
గవర్నర్లు, సీఎంలు, ప్రతిపక్ష నేతలకు ఆహ్వానం
మోదీ ప్రమాణ స్వీకారానికి అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రముఖ ప్రతిపక్ష నేతలను ఆహ్వానించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు ఆహ్వానాలను అందుకున్న వారిలో ప్రముఖులు. మాజీ రాష్ట్రపతులు, ప్రధానులకు కూడా ఆహ్వానాలు పంపనున్నారు. అన్ని ప్రముఖ ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఆహ్వానాలను పంపుతున్నారు. రాష్ట్రపతి భవన్‌లో గురువారం రాత్రి 7 గంటలకు మోదీ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయిస్తారు.
వేడుకకు విదేశీ నేతలు
బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, కిర్గిజ్‌స్తాన్ దేశాల అధ్యక్షులు మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. అలాగే నేపాల్, మారిషస్, భూటాన్ దేశాల ప్రధానులు వరుసగా కేపీ శర్మ ఓలీ, ప్రవీంద్ కుమార్ జగన్నాథ్, లొతయ్ షెరింగ్‌లు కూడా తాము వేడుకకు హాజరవుతున్నట్లు ధ్రువీకరించారు. అలాగే థాయ్‌లాండ్ ఓ ప్రత్యేక రాయబారిని పంపనున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో బిమ్స్‌టెక్ దేశాల ప్రధానులు, అధ్యక్షులు లేదా రాయబారులు వేడుకకు వస్తున్నట్లైంది. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను వెళ్తున్నట్లు మమతా చెప్పారు. కేజ్రీవాల్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఢిల్లీ ప్రభుత్వాధికారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment