మీరు నా తండ్రిలాంటి వారు!
- ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని మోదీ లేఖ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు రాసిన లేఖను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ట్విట్టర్‌లో షేర్‌చేసుకున్నారు. రాష్ట్రపతిగా తన చివరిరోజున ఈ లేఖను అందుకున్నానని, ఈ లేఖ తనను కదిలించిందని ఆయన తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ తనపై ఎంతో ప్రేమను, వాత్సల్యాన్ని చూపారని ప్రధాని మోదీ ఈ లేఖలో పేర్కొన్నారు. 'ప్రణబ్ దా.. మన రాజకీయ ప్రస్థానాలు విభిన్నమైన రాజకీయ పార్టీల్లో రూపుదిద్దుకున్నాయి. అయినా, మీ మేధోబలం, విజ్ఞత చేతనే మనం కలిసి సమిష్టతత్వంతో పనిచేయగలిగాం' అని అన్నారు.
'మూడేళ్ల కిందట ఒక బయటి వ్యక్తిగా నేను ఢిల్లీకి వచ్చాను. నా ముందు ఉన్న కర్తవ్యం ఎంతో పెద్దది. సవాలుతో కూడుకున్నది. ఈ సమయంలో మీరు ఎప్పుడు తండ్రిలాగా, గురువులాగా నాకు అండగా నిలిచారు' అని మోదీ అన్నారు. 'మీ మేధస్సు, మార్గదర్శకత్వం, వ్యక్తిగత అనుబంధం నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, బలాన్ని ఇచ్చాయి. మీకున్న జ్ఞానం అపారమైన విషయం జగమెరిగినది. మీ మేధోనైపుణ్యం మా ప్రభుత్వానికి, నాకు ఎంతోగానో సహకరించాయి' అని మోది అన్నారు.
విన్రమ ప్రజాసేవకుడిగా, అసాధారణ నాయకుడిగా రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించిన ప్రణబ్ ముఖర్జీని చూసి దేశం గర్వపడుతున్నదని మోదీ కొనియాడారు. తన మద్దతు, స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని మార్గదర్శకత్వాన్ని అందించినందుకు ప్రణబ్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.