
లక్నో, న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపునకు మరో రెండురోజులు కూడా సమయంలేని నేపథ్యంలో ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు మంగళవారం రాజకీయంగా దుమారం సృష్టించాయి. దీనిపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల తీర్పు తారుమారు వార్తలు తనను ఆందోళనకు గురిచేస్తున్నట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు యంత్రాల (ఈవీఎంలు)ను చుట్టుముట్టిన ఊహాగానాలన్నిటికీ తెరదించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పైనే ఉందని ఆయన చెప్పారు. తమ అధీనంలో ఉన్న ఈవీఎంలకు రక్షణ, భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈసీపైనే ఉందన్నారు. కాంగ్రెస్ మాజీ దిగ్గజ నేత కూడా అయిన ప్రణబ్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రజా తీర్పు చాలా పవిత్రమైనదని, అది ఏ అతి చిన్న సందేహానికీ తావివ్వనంత ఉన్నతంగా ఉండాలని అన్నారు. ఎన్నికలు సమర్ధంగా నిర్వహించినందుకు ఈసీని ప్రణబ్ సోమవారం అభినందించిన సంగతి తెలిసిందే.
విపక్షాల ఆందోళన
ఈవీఎంల తరలింపు, ట్యాంపరింగ్ ఆరోపణల సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం నిరసన ప్రదర్శనలకు దారితీసింది. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంల తరలింపు ఫిర్యాదుల పరిష్కారం దిశగా ఈసీ తక్షణమే సరైన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విపక్షాలు ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించడాన్ని బీజేపీ ఖండించింది. మళ్లీ మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేలా ఓటర్లు తీర్పు ఇచ్చిన పక్షంలో, ఓటమిని హుందాగా అంగీకరించాలని కోరింది.
ఘాటుగా స్పందించిన ఈసీ
పోలింగ్ సందర్భంగా ఉపయోగించిన ఈవీఎంల స్థానంలో వేరే ఈవీఎంలను ఉంచుతున్నారనే ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పందించింది. అవన్నీ తప్పుడు, పనికిమాలిన, నిరాధార ఆరోపణలుగా పేర్కొంది. ఏడు విడతల్లో వినియోగించిన ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూముల్లో అత్యంత భద్రంగా ఉన్నాయని తెలిపింది. టీవీలు, సోషల్ మీడియాల్లో చూపిస్తున్న దృశ్యాలకు, పోలింగ్ సందర్భంగా వినియోగించిన ఈవీఎంలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే అధికారం చేపట్టనుందని దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ వెల్లడించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment