స్వర్ణభారతి స్టేడియంలో మాక్ కౌంటింగ్‌లో పాల్గొన్న అధికారులు
సాక్షి, విశాఖపట్నం : మరో ఆరు రోజుల్లో చేపట్టనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఆర్వోలు, ఏఆర్వోలు, సూపర్‌వైజర్లు, ఇతర కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విశాఖలో మూడు లోక్‌సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు అత్యల్పంగా 17 రౌండ్లు, అత్యధికంగా 23రౌండ్ల వరకు సాగనుంది. తొలి రౌండ్ ఫలితం లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన అరగంటలోనే వెల్లడికానుంది. 12 గంటలకు తొలి ఫలితం వెల్లడికానుంది. పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లతోపాటు రౌండ్ల వారీగా ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం 1.30గంటలకల్లా పూర్తి కానుంది. వీవీ ప్యాట్ల స్లిప్‌ల కౌంటింగ్ పూర్తయితేకానీ అధికారికంగా ఫలితాలు వెల్లడించకున్నప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంటకే దాదాపు అన్ని నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. తొలిసారి రౌండ్ల వారీగా ఫలితాలను సువిధ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. దీంతో ఏ అభ్యర్థికి ఏ రౌండ్‌లో ఎన్ని ఓట్లు పోలయ్యాయో పోర్టల్ ద్వారా క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు కలుగనుంది.
తొలి ఫలితం విశాఖ దక్షిణానిదే
బూత్‌ల సంఖ్యా పరంగా చూసినా, పోలైన ఓట్ల పరంగా చూసినా తొలి ఫలితం విశాఖ దక్షిణానిదే. ఈ నియోజకవర్గ పరిధిలో 236 పోలింగ్ బూత్‌లున్నాయి. పైగా జిల్లాలో అత్యల్ప ఓట్లు నమోదైన రెండో నియోజకవర్గం కూడా ఇదే. 2,09,186 ఓట్లకు గానూ 1,27,909 ఓట్లు పోలయ్యాయి. రౌండ్‌కు 14 ఈవీఎంలలో కౌంటింగ్ సాగనుండడంతో 17 రౌండ్లలోనే ఈ నియోజకవర్గ ఫలితం వెల్లడికానుంది. విశాఖ దక్షిణం తర్వాత కొద్ది నిముషాల తేడాలో రెండో ఫలితంగా విశాఖ పశ్చిమం వెల్లడికానుంది. ఈ నియోజకవర్గ పరిధిలో 237 పోలింగ్ బూత్‌లే ఉన్నప్పటికీ పోలైనవి 1,37,499 ఓట్లు కావడంతో దక్షిణం తర్వాత కొద్ది నిముషాల వ్యవధిలోనే పశ్చిమ ఫలితం వెల్లడవుతుంది.
భీమిలి, పాడేరుల్లో 23 రౌండ్ల కౌంటింగ్
పోలైన ఓట్లను బట్టి చూస్తే ఆ తర్వాత వరుసగా పాడేరు, అరుకు, మాడుగుల, అరుకు, అనకాపల్లి, యలమంచలి, విశాఖ తూర్పు, విశాఖ ఉత్తరం, చోడవరం, పాయకరావుపేట, పెందుర్తి, గాజువాక, భీమిలి నియోజకవర్గాల వారీగా ఫలితాలు వెల్లడికావాల్సి ఉన్నప్పటికీ పోలింగ్ బూత్‌ల వారీగా చూస్తే మాత్రం మాడుగుల, విశాఖ పశ్చిమం, చోడవరం, యలమంచలి, అనకాపల్లి, నర్సీపట్నం, విశాఖ ఉత్తరం, విశాఖ తూర్పు, పెందుర్తి, అరుకు, పాడేరు, చివరగా భీమిలి నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. భీమిలి, పాడేరుల్లో 23 రౌండ్ల వరకు కౌంటింగ్ సాగనుంది. తొలి రౌండ్‌కు అరగంట సమయం పడుతుంది. ఇక ఆ తర్వాత ప్రతి రౌండ్‌కు 20 నిముషాలకు మించి సమయం పట్టే అవకాశాలు లేవు.
ఏజెంట్లతో ప్రమాణంతో మొదలు..
23వ తేదీ ఉదయం 7.55 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. తొలుత నియోజకవర్గాల వారీగా ఆర్వోలు సరిగ్గా 7.55 గంటలకు కౌంటింగ్ ప్రక్రియపై ఈసీ నియమ నిబంధనలను వివరిస్తూ ఏజెంట్లతో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత సరిగ్గా 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. తొలుత సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపునకు శ్రీకారం చుడతారు. వీటి లెక్కింపు పూర్తయినా అవకపోయినా సరిగ్గా 8.30గంటలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ మొదలుపెడతారు. లోక్‌సభ, అసెంబ్లీల వారీగా ఈవీఎంలను వేర్వేరుగా రెండు స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపర్చారు.
కౌంటింగ్ కోసం కూడా అదే విధంగా ప్రతి నియోజకవర్గానికి రెండు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. సీరియల్ ప్రకారం పోలింగ్ బూత్‌ల వారీగా అసెంబ్లీ, లోక్‌సభ ఈవీఎంలను వేర్వేరుగా రౌండ్‌కు 14 చొప్పున బయటకు తీసుకొస్తారు. అసెంబ్లీ ఈవీఎంలను అసెంబ్లీ కౌంటింగ్ హాలుకు, లోక్‌సభ ఈవీఎంలను లోక్‌సభ కౌంటింగ్ హాలుకు తీసుకెళ్తారు. 8.30 గంటలకు తొలి రౌండ్ కౌంటింగ్‌కు శ్రీకారం చుడతారు. 14 టేబుల్స్‌లో కౌంటింగ్ పూర్తి కాగానే టేబలేషన్ (ఈవీఎంల వారీగా పోలైన ఓట్లను ఓ చార్ట్‌లో రౌండ్‌ల వారీగా కూడే విధానం) చేస్తారు. ఆ తర్వాత రౌండ్ల వారీగా వివరాలను ఈసీకి పంపడంతో పాటు సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. అలా చేసిన తర్వాతే రౌండ్ ఫలితాలను అధికారికంగా వెల్లడిస్తారు. ఆ తర్వాత మళ్లీ రెండో రౌండ్‌కు సంబంధించిన ఈవీఎంలను కౌంటింగ్ హాలుకు తీసుకొస్తారు.
ఇలా రౌండ్ల వారీగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. తుది రౌండ్‌కొచ్చేసరికి సమాంతరంగా సర్వీస్, పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తికావాల్సి ఉంటుంది. ఒక వేళ పోలైన ఓట్ల సంఖ్యను బట్టి వాటి లెక్కింపు ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని భావిస్తే తుది రౌండ్‌ను ఆపుతారు. సర్వీస్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తుది రౌండ్ ఫలితాలకు పోస్టల్, సర్వీస్ ఓట్లను కలిపి తుది ఫలితాలను నిర్ణయిస్తారు.
మైక్రో అబ్జర్వర్‌కే సెల్‌ఫోన్
లోక్‌సభ ఓట్లను కౌంటింగ్ చేసే హాలులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లకు 14 మంది ఏజెంట్లు ఉంటారు. ఇక లోక్‌సభ ఆర్వో టేబుల్ పక్కనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం రెండు, సర్వీస్ ఓట్ల లెక్కింపు కోసం రెండు టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. వీటి వద్ద ఒక్కో టేబుల్‌కు ఒక్కో ఏజెంట్ ఉంటారు. అలాగే అభ్యర్థితో పాటు జనరల్ ఏజెంట్‌గా మరొకరుంటారు. ఇక అసెంబ్లీ కౌంటింగ్ హాలులో మాత్రం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. 14 టేబుల్స్‌కు 14 మంది ఏజెంట్లు ఉంటారు. అసెంబ్లీ ఆర్వో పక్కనే పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు కోసం చెరో టేబుల్ ఏర్పాటు చేస్తారు. ఆయా టేబుల్స్ వద్ద ఒక్కో ఏజెంట్ ఉంటారు. ఇక్కడ కూడా అభ్యర్థితో పాటు ఓ జనరల్ ఏజెంట్ ఉంటారు. అభ్యర్థితో సహా ఏజెంట్లు ఎవ్వరూ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిగ్ పరికరాలను కౌంటింగ్ హాలులోకి తీసుకెళ్లడానికి వీల్లేదు. అలాగే కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్‌కు మాత్రమే సెల్‌ఫోన్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక విధుల్లో ఉన్న ఇతర కౌంటింగ్ అధికారులు, సిబ్బంది ఎవరిని సంప్రదించాలన్నా హ్యాండ్‌సెట్ల ద్వారానే మాట్లాడాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment