కౌంటింగ్‌లో ఫారం –17సీ ...ఇదే కీలకం | Ballot Paper Account Form-17C with VVPAT | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌లో ఫారం –17సీ ...ఇదే కీలకం

Published Mon, May 20 2019 7:57 PM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

Ballot Paper Account Form-17C with VVPAT - Sakshi

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో ఫారం–17సీ పార్ట్‌–2 ఎంతో కీలకమైంది. ప్రతి కౌంటింగ్‌ ఏజెంట్, పరిశీలకులు, సహాయ పరిశీలకులకు దీనిపై అవగాహన ఉండాలి. కంట్రోల్‌ యూనిట్‌లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం –17సీ లో పొందు పరిచిన మొత్తం ఓట్లు సరిపోల్చి చూడాలి. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గం నంబరు, పోలింగ్‌ కేంద్రం పేరు, ఆ పోలింగ్‌ కేంద్రం వినియోగించిన కంట్రోల్‌ యూనిట్, బ్యాలెట్‌ యూనిట్ల గుర్తింపు నంబర్లను ఫారం–17సీలో నమోదు చేస్తారు.

ఆ పోలింగ్‌ కేంద్రం పరిధిలోనే ఓటర్ల సంఖ్య, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల సంఖ్య (ఫారం–17ఏ లో నమోదు చేసిన వివరాలు), పోలింగ్‌ కేంద్రంలోకి వచ్చాక ఓటు వేయడానికి నిరాకరించి వెళ్లి పోయిన వారు, ఓటు వేసేందుకు పీఓ అనుమతించని వారిసంఖ్య, ఓటింగ్‌ యంత్రంలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఫారం–17సీలో ఉంటాయి. టెండరు బ్యాలెట్‌లు, సరఫరా చేసిన పేపరు సీల్‌ సీరియల్‌ నంబర్లు, సీల్, ఎన్ని పేపర్లు సీల్‌కు వినియోగించారు? వినియోగించని పేపర్‌ సీళ్లు ఎన్ని తిరిగి రిటర్నింగ్‌ అధికారికి వెళ్లాయి? పాడైన పేపర్‌ సీళ్ల సీరియల్‌ నంబర్లు వంటి వివరాలు ఇందులో ఉంటాయి. కౌంటింగ్‌లో ఫారం –17సి ఏజెంట్లకు ఎంతో ఉపయోగపడుతుంది. 

నమోదైన ఓట్లలో తేడా వస్తే....
కౌంటింగ్‌ సమయంలో టేబుల్‌ వద్దకు కంట్రోల్‌ యూనిట్‌తోపాటు ఫారం–17 సీ, పార్ట్‌–1 తప్పనిసరిగా తీసుకొస్తారు. ఆయా అభ్యర్థులకు చెందిన కౌంటింగ్‌ ఏజెంట్లు అంతా ఫారం–17సీలో ఉన్న వివరాలను రాసుకోవాలి. కంట్రోల్‌ యూనిట్‌ డిస్‌ప్లే సెక్షన్‌లో చూపిన పోలైన మొత్తం ఓట్లు, ఫారం–17 సీలో నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా ఉండాలి. క్లరికల్‌ తప్పిదం, మరే కారణం వల్ల కానీ కంట్రోల యూనిట్, ఫారం –17సీ, ఓట్ల సంఖ్యలో తేడాలు వస్తే అది వివాదాస్పదంగా మారుతుంది. అలాంటి కంట్రోల్‌ యూనిట్‌లు పక్కన ఉంచి సమాచారాన్ని రిటర్నింగ్‌ అధికారి ఎన్నికల కమిషన్‌కు పంపుతారు. కంట్రోల్‌ యూనిట్‌ టేబుల్‌ పైకి రాగానే ఏజెంట్ల పరిశీలనకు ఉంచుతారు. ఆ కంట్రోల్‌ యూనిట్‌ ఏ పోలింగ్‌ కేంద్రానికి చెందిందో ఏజెంట్లు నిర్ధారించుకోవాలి.


ట్యాంపరింగ్‌ జరిగితే......

కంట్రోల్‌ యూనిట్‌ టేబుల్‌పైకి రాగానే అభ్యర్థి సీలింగ్‌ సెక్షన్‌ సక్రమంగా ఉందో లేదో కౌంటింగ్‌ ఏజెంట్లు, పరిశీలకులు చూసుకోవాలి. రిజల్ట్‌ సెక్షన్‌పై ఉన్న స్ట్రిప్‌ సీల్‌ గ్రీన్‌ పేపర్‌ సీల్‌ సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి. సీరియల్‌ నంబర్లు ఫారం–17సీ లో నమోదు చేసినవే ఉండాలి. కంట్రోల్‌ యూనిట్‌ పేపర్‌ సీళ్లు, అడ్రస్‌ ట్యాగ్‌ల ట్యాంపరింగ్‌ జరిగాయని గుర్తిస్తే పరిశీలకులు ఆ విషయాన్ని రిటర్నింగ్‌ అధికారి, అబ్జర్వర్‌ల దృష్టికి తీసుకెళ్లాలి. ట్యాంపరింగ్‌ జరగని కంట్రోల్‌ యూనిట్‌లను మాత్రమే కౌంటింగ్‌ నిర్వహించాలి.

వరుస క్రమంలో లెక్కింపు.....
కౌంటింగ్‌ ఒక రౌండ్‌ పూర్తి అయిన వెంటనే అందులోని రెండు కంట్రోల్‌ యూనిట్‌లను జనరల్‌ అబ్జర్వర్‌ తన టేబుల్‌ వద్దకు తెప్పించుకుంటారు. అదనపు కౌంటింగ్‌ పరిశీలకులతో ఓట్లు లెక్కిస్తారు. కంట్రోల్‌ యూనిట్‌లోని ఓట్ల సంఖ్యకు ఫారం –17సీ, పార్ట్‌–2లో కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌ నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే పరిశీలకుడిని కౌంటింగ్‌ నుంచి తప్పిస్తారు. ఆ పరిశీలకుడు తనిఖీ చేసిన మిగిలిన కంట్రోల్‌ యూనిట్‌లన్నింటినీ జనరల్‌ అబ్జర్వర్‌ మరోసారి లెక్కిస్తారు. వివరాలు తప్పుగా నమోదు చేసిన కౌంటింగ్‌ పరిశీలకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. అసాధారణంగా ఇరువురు అభ్యర్థులకు కౌంటింగ్‌లో ఓట్లు సమానంగా వస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రిటర్నింగ్‌ అధికారి లాటరీ ద్వారా ఫలితాన్ని ప్రకటిస్తారు. ఆ లాటరీలో ఎవరు గెలుపొందితే వారినే విజేతగా ప్రకటిస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement