వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కిస్తారిలా! | Counting of These slips after postal EVM ballots | Sakshi
Sakshi News home page

వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కిస్తారిలా!

Published Tue, Apr 30 2019 4:33 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

Counting of These slips after postal EVM ballots - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి.. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన వీవీప్యాట్‌ యంత్రాల్లో ఉన్న చీటీల (స్లిప్పులు) లెక్కింపు విషయంలో ఈసీ మార్గదర్శకాలను జారీచేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారమే చీటీలను వెలికి తీసి అభ్యర్థుల వారీ పోలైన ఓట్లను లెక్కిస్తారు. 2014 ఎన్నికల్లో వీవీప్యాట్‌ యంత్రాలను వాడలేదు. ఈవీఎం యంత్రాల పనితీరుపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. ఈసీ కొత్తగా వీవీప్యాట్‌ యంత్రాలను ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టింది.

తొలుత పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గానికి ఒక పోలింగ్‌ బూత్‌ను ఎంపికచేసి, అక్కడ ఉపయోగించిన వీవీప్యాట్‌ యంత్రంలోని చీటీలను లెక్కించాలని భావించారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఐదు బూత్‌లోని వీవీప్యాట్‌లను లెక్కించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఆయా యంత్రాల్లోని చీటీలను వెలికి తీసి, లెక్కింపు వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులపై లెక్కింపు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు.

లెక్కింపు ఇలా...
ఎంపిక చేసిన వీవీప్యాట్‌ యంత్రాల్లో ఉన్న చీటీలు, దానికి అనుసంధానమై ఉన్న బ్యాలెట్‌ యూనిట్‌లో ఉన్న ఓట్ల సంఖ్యతో సరిచూస్తారు. పోలింగ్‌ కేంద్రాల వారీ ఉన్న ఓట్లు, పోలైన ఓట్లు వంటి వివరాలతో రూపొందించిన ‘ఫారం–17ఏ’తో సరిపోల్చుతారు. అంతా సరిగ్గా ఉన్న తర్వాత వీవీప్యాట్‌ యంత్రాల్లోని స్లిప్పులను ఏజెంట్ల సమక్షంలో బయటకు తీస్తారు. వీటిని అభ్యర్థుల వారీగా వేరుచేస్తారు. తదుపరి 25 చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. అభ్యర్థుల వారీ విడదీసి, లెక్కింపు పూర్తి చేయడానికి 2 గంటలకుపైగా పట్టే అవకాశం ఉంది. అయిదు యంత్రాల్లోని స్లిప్పులను మాత్రమే లెక్కించాల్సి ఉన్నందున సమాంతరంగా అన్నీ ఒకేసారి ప్రారంభిస్తారు. ఈవీఎం ఓట్లను లెక్కించే టేబుల్‌నే దీనికి
వినియోగిస్తారు. చీటీలను మాత్రం ట్రేలో వేసి అభ్యర్థుల వారీ వేరుచేయనున్నారు.

లాటరీ పద్ధతిలో ఎంపిక...
లోక్‌సభ నియోజవర్గానికి సంబంధించి రాండమ్‌గా 35 వీవీప్యాట్‌ మెషీన్లను (అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్‌ మెషీన్ల చొప్పున) ఎంపికచేసి లెక్కిస్తారు. ఇదంతా అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో రిటర్నింగ్‌ అధికారి నిర్వహిస్తారు. లాటరీలో వచ్చిన నెంబర్ల వారీ యంత్రాలను వెలికి తీసి వాటిల్లో ఉన్న చీటీలను లెక్కించనున్నారు. లెక్కింపు ప్రక్రియ మొదలవగానే తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను, సర్వీసు ఓట్లను గణిస్తారు. తదుపరి ఈవీఎం యంత్రాల్లో పోలైన ఓట్లను గణిస్తారు. చివరిగా వీవీప్యాట్‌ యంత్రాల్లో ఉన్న చీటీల లెక్కింపు ఆరంభిస్తారు. ఇదంతా పూర్తయ్యాక విజేత పేరును అధికారికంగా ప్రకటిస్తారు. వీవీప్యాట్‌ యంత్రాల్లో చీటీల లెక్కింపు ఆరంభం కాకమునుపే రౌండ్ల వారీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను వెల్లడించనున్నారు. వచ్చే నెలలో లెక్కింపు సిబ్బందికి ఈ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement