సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) ఫ్రీక్వెన్సీ మార్చే అవకాశం ఉందని అన్నిచోట్లా చెబుతున్నారని, తాను ఢిల్లీ వెళితే దీనిపైనే చర్చిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన సోమవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈవీఎంలు, సెల్‌ఫోన్లు తయారు చేసే ప్రోగ్రామర్ ఒక్కరేనని, వారి కంట్రోల్‌లోనే అంతా జరుగుతుందని చెప్పారు. కారు స్టార్ట్ చేసినట్లు, ఏసీ, టీవీలను రిమోట్‌తో ఆన్ చేసినట్లు ఈవీఎంలను కూడా మానిటర్ చేసే అవకాశం ఉందన్నారు. వీవీ ప్యాట్‌ల ప్రింటర్లను మార్చే అవకాశం ఉంటుందని అంటున్నారని, ఉన్న ఈవీఎంలను మార్చివేసి కొత్త ఈవీఎంలను పెడుతున్నారని చెబుతున్నారని, ఇవన్నీ ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. వీవీ ప్యాట్‌లన్నింటినీ లెక్కించాలని, వీవీ ప్యాట్ స్లిప్ తీసుకుని, తమ ఓటు తాము వేసిన వారికే పడిందో లేదో ఓటరు చూసుకుని, ఒక బాక్సులో వేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో అన్ని పార్టీలు ఈవీఎంలను కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నాయన్నారు. చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే...
వీవీ ప్యాట్‌లు పెట్టించింది నేనే...
‘‘తమకు 300 ఎంపీ సీట్లు వస్తాయని బీజేపీ నేతలు అంటున్నారు. సర్వేలన్నీ వారికి 300 సీట్లు వస్తాయని చెబుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈవీఎంలలో ఏదో జరుగుతోందనే అనుమానాలకు బలం చేకూరుతోంది. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల లెక్కల్లో తేడా వస్తే ఏం చేయాలి? తేడా వచ్చిన చోట మిగిలిన వీవీ ప్యాట్‌లన్నింటినీ లెక్కించాలని 23 రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల జరిగిన పరిణామాలు ఎన్నికల సంఘం విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేశాయి. ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర్నుంచి ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌లో ధ్యానం చేసి పోలింగ్‌ను ప్రభావితం చేసే వరకూ చాలా అంశాలున్నాయి. రాష్ట్రంలో అవసరమైనప్పుడు కేంద్ర బలగాలను పంపలేదు, ఇప్పుడు పంపుతున్నారు. అన్ని పార్టీలను ఏకంచేసి, వీవీ ప్యాట్‌లు పెట్టించిందని నేనే. వాటిపై మాజీ సీఈసీ ఖురేషీకి నేనే ఐడియా ఇచ్చా. వీవీ ప్యాట్‌ల లెక్కింపుపై మా పోరాటం కొనసాగుతుంది. తమ ఓటు తాము అనుకున్న వారికే పడిందో లేదో అనే అనుమానం ప్రజలకు ఉండకూడదు. ఈ సమస్యకు పరిష్కారం లభించేదాకా పోరాడుతాం. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘంలోనే లుకలుకలు తలెత్తాయి. రూ.9 వేల కోట్ల ఖర్చుతో వీవీప్యాట్‌లు పెట్టారు. అంత లగ్జరీ అవసరమా? ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
33 ఏళ్లుగా సర్వేలు చేస్తున్నా..
సర్వేలు చేయడం ఇప్పుడు అందరికీ అలవాటైపోయింది. నేను 33 సంవత్సరాల నుంచి సర్వేలు చేస్తున్నా. ఈ ఎన్నికల్లో నూటికి వెయ్యి శాతం గెలిచేది తెలుగుదేశం పార్టీయే. ఎలాంటి అనుమానం అవసరం లేదు. మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందపడిపోతున్నారు, అప్పుడే మంత్రివర్గం కూడా తయారు చేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను గతంలో వన్‌సైడ్‌గా ఇచ్చారు, ఇప్పుడు మిశ్రమంగా ఇచ్చారు.
ఎగ్జిట్ పోల్స్ చూసి భయపడొద్దు
ఉండవల్లి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి భయపడవద్దని చెప్పారు. మన ప్రభుత్వమే వస్తుందని అన్నారు. 18 నుంచి 20 ఎంపీ స్థానాల్లో గెలుస్తున్నామని, 110 అసెంబ్లీ స్థానాలతో మొదలై 120–130 వరకూ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైండ్‌గేమ్‌తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల అక్రమాలపై మంగళవారం అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రపతిని కలుస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment