అహింసా పరమోధర్మః
► రాజ్యాంగమే నా పవిత్ర గ్రంథం.. పార్లమెంటే దేవాలయం
► రాష్ట్రపతిగా చివరి సందేశంలో ప్రణబ్
న్యూఢిల్లీ: భిన్నత్వం, సహనంలోనే భారతదేశ ఆత్మ ఇమిడి ఉందని, అహింసాయుత సమాజంలోనే అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా పాలుపంచుకోగలరని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. నేడు రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్న ప్రణబ్ ముఖర్జీ చివరిసారిగా సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. బహిరంగంగా అభిప్రాయాల్ని వెల్లడించే హక్కును పరిరక్షించాలని ఆకాక్షించారు. సహనమే దేశానికి గొప్ప బలమని పేర్కొన్న ప్రణబ్.. దయ, సహానుభూతి దేశ నాగరికతకు నిజమైన పునాదులని పేర్కొన్నారు. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో భారత రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా, పార్లమెంట్‌ను ఆలయంగా భావించానని చెప్పారు.
రాష్ట్రపతిగా ప్రణబ్ చివరి ప్రసంగ పాఠం..
‘ప్రతిరోజు.. మన చుట్టూ హింస పెరిగిపోతోంది. అజ్ఞానం, భయం, అపనమ్మకం వల్లే ఈ హింస చోటుచేసుకుంటుంది. భౌతిక దాడులు, మాటలతో వేధించడం వంటి పలు రకాల హింసాత్మక చర్యల నుంచి స్వేచ్ఛగా చర్చించే హక్కుకు విముక్తి కల్పించాలి. అహింసాయుత సమాజంతోనే అన్ని వర్గాల ప్రజలకు సమాజంలో పాలుపంచుకునే అవకాశం సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్య సమాజ స్థాపన కోసం అణగారిన, వంచనకు గురైన ప్రజల్ని సమాజంలో భాగస్వాముల్ని చేయాలి.
అందరినీ భాగస్వాముల్ని చేయాలి
భారతదేశం అంటే కేవలం ఒక భౌగోళికమే ప్రాంతం కాదు. ఉన్నత ఆలోచనలు, తత్త్వజ్ఞానం, వివేకం, పారిశ్రామిక మేధస్సు, ఆవిష్కరణలు, ఎన్నో అనుభవాల సమాహారం ఈ దేశం.. ఎన్నో శతాబ్దాలుగా విభిన్న ఆలోచనల సమాగమం నుంచే భిన్నత్వం రూపుదిద్దుకుంది. విభిన్న సంస్కృతులు, నమ్మకాలు, భాషలు, మన దేశాన్ని ప్రత్యేకంగా రూపుదిద్దాయి.
ఇతరులతో అంగీకరించినా, అంగీకరించపోయినా.. మనకు వాదించే అధికారం ఉంది. అయితే ప్రజాభిప్రాయాల్లో తేడాలు తప్పనిసరన్న అంశాన్ని మనం తోసిపుచ్చకూడదు. లేదంటే మన ఆలోచనల మౌలిక స్వరూపం దెబ్బతింటుంది. అందరికి ఆర్థిక ప్రయోజనాలు అందడం సమాజంలో ఎంతో ముఖ్యం. వరుసలో చివర ఉన్న వ్యక్తికి కూడా పథకాల ఫలితాలు అందాలి. ఆనందకర జీవితం గడిపడం అందరి హక్కు. ఉత్తమ పాలన, అందరి భాగస్వామ్యం, పేదరిక నిర్మూలనతోనే అది సాధ్యమవుతుంది.
ప్రపంచస్థాయి విద్యా సంస్థలుగా తీర్చిదిద్దాలి
ప్రపంచ ప్రమాణాల స్థాయికి చేరేలా దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్ని మెరుగుపర్చాలి. కంఠతా పట్టే విధానం కాకుండా జిజ్ఞాస రేకెత్తించే విద్యాసంస్థలుగా యూనివర్సిటీలు ఉండాలి. సృజనాత్మక ఆలోచన, ఆవిష్కరణ, వైజ్ఞానిక ఉత్సుకతను ఉన్నత విద్యాలయ్యాల్లో ప్రోత్సహించాలి. అవసరం కంటే అత్యాశకు పోతే.. ప్రకృతి తన ప్రకోపాన్ని చూపిస్తుంది.
రోజూ అప్రమత్తంగా ఉండేవాడిని
నా 50 ఏళ్ల ప్రజా జీవితంలో భారత రాజ్యాంగమే పవిత్ర గ్రంధం. పార్లమెంట్‌ను దేవాలయంగా భావించా.. ప్రజలకు సేవ చేయాలన్నదే నా ఆకాంక్ష.. ఈ ఐదేళ్లలో ప్రతీ రోజు నా బాధ్యత విషయంలో ఎప్పుడు అప్రమత్తంగా ఉండేవాడిని. దేశ వ్యాప్తంగా పర్యటనల నుంచి, యువత, మేధావులతో మాట్లాడడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నా.. ఆ సంభాషణలు నాలో ఏకాగ్రతను నింపడమే కాకుండా.. ఎంతో ప్రేరేపించాయి. ఐదేళ్లలో రాష్ట్రపతి భవన్‌లో మానవీయ విలువలు పాటించడం, ఆనందకర వాతావరణ కల్పనకు ప్రయత్నించాం. ఉల్లాసం, అభిమానం, నవ్వు, సరదా, మంచి ఆరోగ్యం, సానుకూల దృక్పథంతో కూడిన పనులతో ఆనందం ముడిపడి ఉంటుందని కనుగొన్నా. నవ్వుతూ మాట్లాడడం, సరదాగా ఉండడం, ప్రకృతితో మమేకం వంటివి ఇక్కడి వారి నుంచి నేర్చుకున్నా.
పశ్చిమబెంగాల్‌లోని మారుమూల గ్రామం మిరాఠిలో విద్యార్థిగా మొదలైన ప్రణబ్ ముఖర్జీ జీవన ప్రస్థానం.. అనంతరకాలంలో భారత రాజకీయరంగంలో అత్యున్నత స్థాయికి చేరింది.
ప్రణబ్ ముఖర్జీ
పుట్టిన తేదీ: 11 డిసెంబర్ 1935, మిరాఠి గ్రామం, కిర్ణాహార్, బీర్బూమ్ జిల్లా (పశ్చిమబెంగాల్)
తండ్రి: కమద కింకర్ ముఖర్జీ
తల్లి: రాజ్యలక్ష్మి
వివాహం: 13 జూలై 1957
సంతానం: ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె
విద్యార్హతలు: ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతిశాస్త్రం), ఎల్‌ఎల్‌బీ, డీ.లిట్ (విద్యాసాగర్ కాలేజీ),సూరీ, కలకత్తా వర్సిటీ
వృత్తి: రాజకీయనేత, సామాజిక సేవ, టీచర్, జర్నలిస్టు, రచయిత
రాజకీయ పార్టీ: కాంగ్రెస్
నియోజకవర్గం: జంగీపూర్
అలంకరించిన పదవులు
♦ 1969లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నిక
♦ 1975, 81, 93, 1999లోనూ రాజ్యసభకు ఎన్నిక.
♦ 1980–85వరకు రాజ్యసభలో అధికారపక్ష నేత
♦ 1973–74కాలంలో పారిశ్రామికాభివృద్ధి శాఖ ఉపమంత్రిగా
♦ 1974లో కొన్నినెలలు రవాణా, నౌకాయాన ఉపమంత్రిగా...
♦ 1974–75లో ఆర్థికశాఖ ఉపమంత్రిగా..
♦ 1975–77లో రెవిన్యూ, బ్యాంకింగ్ సహాయమంత్రిగా..
♦ 1980–82లో వాణిజ్యం, గనుల కేబినెట్ మంత్రిగా..
♦ 1982–84లో ఆర్థికమంత్రిగా విధులు నిర్వర్తించారు
♦ 1991–96లో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా..
♦ 1993–95లో వాణిజ్యశాఖ మంత్రిగా..
♦ 1995–96లో విదేశాంగమంత్రిగా..
♦ జంగీపూర్ నుంచి 2004లో లోక్‌సభకు ఎన్నిక. జూన్ నుంచి లోక్‌సభలో అధికారపక్ష నేతగా ఉన్నారు
♦ 2004–06లో రక్షణశాఖ మంత్రిగా..
♦ 2006–09లో విదేశాంగమంత్రిగా..
♦ 2009–2012లో ఆర్థికమంత్రిగా పనిచేశారు
మరికొన్ని పదవుల్లో..
♦ 2004 నుంచి ఇప్పటివరకు 83 మంత్రుల బృందాలకు (జీఓఎం), సాధికారక మంత్రుల బృందాల (ఈజీఓఎం)కూ సారథి.
♦ యూపీఏ–1 హయాంలో దాదాపు 60 జీఓఎం, ఈజీఓఎంలకు నేతృత్వం.
♦ లోక్‌పాల్ సంయుక్త కమిటీకి సారథ్యం.
♦ పచ్‌మడీలో మేథమదన సదస్సులో.. సంకీర్ణ ప్రభుత్వాల దిశగా ముందుకెళ్లాలనే నిర్ణయం తీసుకున్న ముసాయిదా కమిటీకి నేతృత్వం
♦ దశాబ్దాలుగా అమలవుతున్న పార్టీ మేనిఫెస్టో ముఖ్య రూపకర్త
♦ చిన్న రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ కమిటీకి సారథ్యం
♦ పొత్తుల కోసం డీఎంకే, వివిధ పార్టీలతో చర్చలు జరిపారు
ప్రజలతో మమేకమవుతా..
రాష్ట్రపతి పదవి ముగిశాక భవిష్యత్ ప్రణాళికలపై ఈ ఏడాది తొలినాళ్లలో ఓ కార్యక్రమంలో ప్రణబ్ చెప్పిన మాట ఇది.