సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీ అనుచరులను పీపీ అణగదొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన వ్యక్తి పీవీ అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎందరో సీనియర్లను పీపీ తొక్కేశాడని ఆరోపించారు. బాబ్రీ మసీదును కూల్చి పీవీ పెద్ద తప్పు చేశాడని, దాని వల్ల కాంగ్రెస్‌కు ముస్లింలు దూరమయ్యారన్నారు. అందుకే పీవీని గాంధీ కుటుంబం పక్కన పెట్టిందని చెప్పుకొచ్చారు. ‘రాజకీయాలను మానుకొని హైదరాబాద్‌కు వచ్చిన పీవీని సోనియా గాంధీ పిలిచి ప్రధానిని చేశారు. కానీ పీవీ మాత్రం గాంధీ కుటుంబాన్నే అణగదొక్కే ప్రయత్నం చేశారు. గాంధీ కుటుంబం వాళ్లు వస్తే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని అందరిని తొక్కేశారు. దీంతో ఆయనను కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టింది. బాబ్రీ మసీదు కూల్చినందుకే బీజేపీ నేతలు పీవీని పొగుడుతున్నారు’ అని చిన్నారెడ్డి ఆరోపించారు.
ప్రణబ్ కూడా పీవీలాగానే
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌పై కూడా చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రణబ్ నాగపూర్‌లో జరిగిన ఆరెస్సెస్ సభకు వెళ్లి భారతరత్న తెచ్చెకున్నారని ఆరోపించారు. ప్రణబ్‌ను కాంగ్రెస్ పార్టీయే దేశానికి రాష్ట్రపతి చేసిందన్నారు. బీజేపికి ప్రయోజనాలు చేకూర్చారు కాబట్టే ఆ పార్టీ నేతలు పీవీ, ప్రణబ్‌లను పొగుడుతున్నారని ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ బీజేపీకి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదు కాబట్టే బీజేపీ ఆయనను పొగడడం లేదని చిన్నారెడ్డి అన్నారు.
తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమని ప్రభుత్వం చెబుతోందని.. కానీ, రాష్ట్రానికి లక్షా పదివేల కోట్ల అప్పు ఉందని పార్లమెంటులో ప్రకటించారన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం చెప్పిన లక్షా పదివేల కోట్లను ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని చిన్నారెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment