‘సహకార’ స్ఫూర్తికి నిదర్శనం
► జీఎస్టీతో దేశంలో గొప్ప మార్పునకు నాంది
► నా కల నేరవేరినందుకు సంతృప్తిగా ఉంది
► కేంద్ర, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం శుభపరిణామం
► జీఎస్టీ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమల్లోకి రావటం గొప్ప మార్పునకు నాంది అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ పన్ను విధానం భారత ప్రజాస్వామ్య పరిపక్వత, వివేచనకు నిదర్శనమన్నారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో దీన్ని సాకారం చేసేందుకు తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా రాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సమాఖ్య వ్యవస్థకు కొత్త ఉదాహరణగా నిలిచి ఏకాభిప్రాయంతో జీఎస్టీని అమల్లోకి తీసుకురావటం శుభపరిణామమన్నారు.జీఎస్టీ మండలి కూడా 18సార్లు సమావేశమై వివిధ పన్నురేట్లు, పన్ను పరిధిలోకి వచ్చే వస్తువులపై చర్చోపచర్చలు జరిపి ఓ అద్భుతమైన విధానాన్ని రూపొందించటాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు.
రాజకీయాలకు అతీతంగా జీఎస్టీ అమలుకు దేశమంతా ఏకమవటం గొప్ప మార్పునకు సంకేతమన్నారాయన. జీఎస్టీ మండలి ఇకమీదట కూడా ఈ పన్ను విధానం అమలుతీరును నిరంతరం పర్యవేక్షిస్తూ సరైన మార్పుల దిశగా చొరవతీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. ‘పన్ను విధానంలో కొత్త శకం ఇది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ పన్ను విధానం విషయంలో ఏకాభిప్రాయం రావటం గొప్ప పరిణా మం. ఇది ఒకరోజులో సాధ్యమైంది కా దు. దీని వెనక చాలా కృషి ఉంది. రాజకీయాలకు అతీతంగా నాయకులు దేశ అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని పనిచేశారు’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. జీఎస్టీ అమల్లోకి రావటంలో కృషిచేసినవారికి అభినందించారు.
వ్యక్తిగతంగా సంతృప్తికరం
‘2011 మార్చి 22న పార్లమెంటులో జీఎస్టీకి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును అప్పటి ఆర్థిక మంత్రిగా నేనే ప్రవేశపెట్టాను. అప్పుడు దీనికి కాస్త వ్యతిరేకత వచ్చింది. కానీ కొంతకాలానికే సానుకూల మార్పు కనిపించింది. ఇందులో భాగంగా చాలా మంది మంత్రులు, సీఎంలు, అధికారులను కలిశాను. వారంతా నిర్మాణాత్మక సూచనలు చేశారు. కొంత సమయం తీసుకున్నా జీఎస్టీ తప్పకుండా అమల్లోకి వస్తుందనే నమ్మకం నాకుండేది. అందుకే ఈరోజు చాలా సంతృప్తిగా ఉంది’ అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు.
గతేడాది సెప్టెంబర్8న జీఎస్టీ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తన కల సాకారమవుతుందనే నమ్మకం కలిగిందన్నారు. జీఎస్టీ అమలు ప్రారంభంలో సమస్యలు తప్పవని వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ప్రణబ్ సూచించారు. జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక సామర్థ్యం మెరుగుపడటంతోపాటుగా.. పన్ను విధానం, దేశీయ, విదేశీ పెట్టుబడులకు మేలు జరుగుతుందన్నారు. జీఎస్టీ విజయవంతంగా అమలవటంలో దేశప్రజలంతా భాగస్వాములు కావాలని రాష్ట్రపతి కోరారు.