
దేశమంతా ఏకమై ముందుకు సాగాలి
2011లోనే జీఎస్టీ కోసం ప్రయత్నించా: ప్రణబ్
కోల్‌కతా: కులాలు, మతాల ఆధారంగా కాకుండా దేశమంతా ఏకమై.. ఒకటిగా ముందుకు సాగాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఆకాంక్షించారు. ఇటీవల దేశంలో ఓ మతం వారిపై దాడులు పెరుగుతున్న క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కోల్‌కతాలో ఐసీఏఐ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన ‘130 కోట్ల మంది ప్రజలు, ఏడు మతాలు, 200 భాషలు, 1,800 మాండలికాలు భారత్‌లో ఉన్నాయి. ఇది భారతీయ ఆచార వ్యవహారాల గొప్పతనం.
’ అని అన్నారు. వస్తు, సేవల పన్ను తీసుకురావడాన్ని ప్రణబ్ ప్రశంసించారు. ‘రేపటి నుంచి దేశమంతా ఒకే పన్ను వ్యవస్థ కిందకు వస్తుంది. ఒక జాతి, ఒకే పన్ను. అదే జీఎస్టీ. జీఎస్టీ తీసుకురావడానికి అవసరమైన రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లును నేను 2011లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాను. కానీ అది ఆమోదం పొందలేదు’ అని ప్రణబ్ చెప్పుకొచ్చారు.‘గణతంత్ర భారతదేశ రాష్ట్రపతిగా ఇదే నా చివరి కోల్‌కతా పర్యటన’ అని ప్రణబ్ అన్నారు.