
న్యూఢిల్లీ: బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు.. తాను ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించానని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కూటమి కట్టడాన్ని తాను వ్యతిరేకించానని, దీనిపై పార్టీ నేతలతో వాదనకు దిగినట్టు చెప్పారు. ఇలాంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అస్థిత్వాన్ని దెబ్బతీస్తుందని తాను భావించానని పేర్కొన్నారు. తన తాజా పుస్తకం ‘ద కొలిషన్ ఇయర్స్: 1996 నుంచి 2012’లో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
2004 సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి 2003లో కాంగ్రెస్ పార్టీ కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందని, అయితే దీనిని తాను సమర్థించలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తేనే అస్థిత్వాన్ని కాపాడుకోగలుగుతుందని పేర్కొన్నారు. పంచమరి సదస్సులో అత్యవసరమైతే తప్ప సంకీర్ణాల జోలికి వెళ్లకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని, కానీ 2003లో సిమ్లా సదస్సులో తీసుకున్న నిర్ణయం దానికి పూర్తి భిన్నమైందని చెప్పారు. సిమ్లా సదస్సులో సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌తో పాటు పార్టీలోని చాలామంది పంచమరి సదస్సులో తీసుకున్న నిర్ణయాన్ని మార్చాలని నిర్ణయించారని చెప్పారు.