
ప్రథమ పౌరుడు ఆచరించి చూపారు..
అంబులెన్స్‌కు దారి చూపి ప్రాణాలు కాపాడండి.. అని వాహనాలపై ఉన్న రాతలను చూడటమే కానీ, ఆచరించే వారు చాలా తక్కువ.
ముర్షిదాబాద్: అంబులెన్స్‌కు దారి చూపి ప్రాణాలు కాపాడండి.. అని వాహనాలపై ఉన్న రాతలను చూడటమే కానీ, ఆచరించే వారు చాలా తక్కువ. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మాత్రం ఆచరించి చూపారు. ప్రజలకు మార్గదర్శనం చేశారు. ఏం జరిగిందంటే.. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం ఉదయం కనిదిఘి గ్రామంలో స్కూల్‌ను ప్రారంభించాల్సి ఉంది. అందుకోసం ఆయన విమానంలో ముర్షిదాబాద్ చేరుకుని అక్కడి నుంచి తన 20 వాహనాలతో బయలుదేరారు.
వాహనాలు 34వ జాతీయ రహదారిపై ఉండగా వెనుక నుంచి అంబులెన్స్ సైరన్ మోగించుకుంటూ వచ్చింది. దీంతో రాష్ట్రపతి వ్యక్తిగత అధికారుల సూచనలతో కాన్వాయ్ వాహనాలు పక్కకు తొలిగాయి. ఫలితంగా ఆ అంబులెన్స్ ఎటువంటి అంతరాయం లేకుండా ముందుకు వెళ్లిపోయింది. అయితే అంబులెన్స్ లో ఎవరున్నదీ తెలియరాలేదు. ప్రస్తుతం రాష్ట్రపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా బెంగాల్ లో ఉన్నారు.