
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించింది. 84 ఏళ్ల ప్రణబ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని ఇక్కడి ఆర్మీ ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రి వర్గాలు మంగళవారం వెల్లడించాయి. మెదడులో రక్తం గడ్డకట్టడంతో సర్జరీ కోసం సోమవారం ప్రణబ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ‘ప్రణబ్ ముఖర్జీ పరిస్థితి విషమంగా ఉంది. ప్రాణాపాయ స్థితి ఉండటంతో బ్రెయిన్ క్లాట్‌ను తొలగించడానికి సోమవారం అత్యవసరంగా శస్త్రచికిత్స చేశాం. ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోగా.. మరింత క్షీణించింది. వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నారు’అని ఢిల్లీలోని కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రి తెలిపింది. ఆరోగ్యం బాగాలేక ప్రణబ్ సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆస్పత్రిలో చేరారు. అప్పుడు చేసిన పరీక్షల్లో మెదడులో రక్తగడ్డకట్టినట్లు తేలింది. కోవిడ్–19 పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. కరోనా పాజిటివ్ ఉన్నా మెదడులో రక్తం గడ్డ పెద్దది కావడంతో వెంటనే వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం వివిధ విభాగాలకు చెందిన నిపుణులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. 2012–2017 మధ్యకాలంలో ప్రణబ్ భారత రాష్ట్రపతిగా వ్యవహరించారు.