సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఏ ఒక్కరినీ వదలకుండా ఎటాక్ చేస్తోంది. వైరస్ బారినపడి ఇప్పటికే పలువురు ప్రముఖలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సైతం వైరస్‌తో పోరాటం చేస్తున్నారు. ఈ నెల 14న ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమించింది. కరోనాతో పాటు డెంగ్యూ కూడా ఎటాక్ చేయడంతో గడిచిన 24 గంటల్లో మరింత విషమంగా ఉందని లోక్‌నాయక్ జయప్రకాశ్ నాయక్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రక్తకణాల సంఖ్య తగ్గిపోవడంతో పాటు శరీరంలో ఆక్సిజన్‌శాతం పడిపోయిందని పేర్కొన్నారు. (రికవరీ రేటు పైపైకి)
మెరుగైన వైద్య సదుపాయం కోసం మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించామని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. మనీశ్ ఆరోగ్య పరిస్థితిపై పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈయన క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు దేశ రాజధానిలో పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నప్పటికీ.. కోలుకునే వారి సంఖ్య పెరగడం కొంతమేర ఊరటనిస్తోంది. తాజా గణాంకాలతో ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 60 వేలు దాటింది.
Comments
Please login to add a commentAdd a comment