అప్రమత్తంగా ఉండాలి
‘సంరక్షక’ దాడులపై రాష్ట్రపతి ప్రణబ్
న్యూఢిల్లీ: కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సంరక్షకత్వం పేరుతో చేస్తున్న దాడులపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు సమాజ మౌలిక సూత్రాలను కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశ 70వ స్వాతంత్య్ర వార్షికోత్సవాల సందర్భంగా శనివారమిక్కడ నేషనల్ హెరాల్డ్ పత్రిక వెలువరించిన స్మారక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘మూక ఉన్మాదం తారస్థాయికి చేరి, నిర్హేతుకంగా, నియంత్రించలేని విధంగా మారినప్పుడు మనం కాస్త ఆగి ఆలోచించాలి.. నేను సంరక్షకవాదం గురించి మాట్లాడటం లేదు.
మన కాలపు మౌలిక సూత్రాలను కాపాడుకోవడానికి మనం తగినంత అప్రమత్తంగా ఉన్నామా? లేదా అనే విషయంపై మాట్లాడుతున్నాను’ అని పేర్కొన్నారు. 200 భాషలు, ఏడు మతాలు, 130 కోట్ల జనాభా గల దేశం ఒకే రాజ్యాంగం, జెండా కింద శాంతి సామరస్యాలతో కొనసాగడం గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చట్టాన్ని ఉల్లంఘించారనో, మరొకటనో ఒక వ్యక్తిపై దాడి చేస్తున్న దృశ్యాలను టీవీల్లో, పత్రికల్లో చదివినప్పుడు కాస్త ఆగి ఆలోచించాలని కోరారు.
ఈ విషయంలో ఎవరూ తమ బాధ్యత నుంచి తప్పించుకోకూడదని, మనం ఏం చేశామని భావి తరాలు వివరణ కోరతాయని అన్నారు. ఈ ప్రశ్నను తనకు తాను కూడా వేసుకుంటున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా, రాహుల్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ప్రణబ్.. ‘ఒక స్వాతంత్య్ర పోరాట సైనికుడు తిరిగి అవతరించాడు’ అని ఆ పత్రికను కొనియాడారు.
సమైక్య భావనపై దాడి: సోనియా
చట్టాన్ని అమలు చేయాల్సిన వారి నుంచే ‘సంరక్షక’ హింసకు మద్దతు లభిస్తోందని సోనియా మండిపడ్డారు. మత విద్వేషం, నిరంకుశత్వం పెరిగాయని, ఎవరేం తినాలో ఆదేశిస్తున్నారన్నారు. దేశ సమైక్య భావనపై దాడి జరుగుతోందంటూ ఎన్డీఏ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు సంధించారు. ప్రశ్నించకుండా, నిజాలు చెప్పకుండా, తమను పొగడాలని, అదుపాజ్ఞల్లో ఉండాలని కొందరు మీడియాపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. కాగా, విదేశాలకు వెళ్లిన రాహుల్ శనివారం తిరిగొచ్చారు.