National Herald Magazine
-
అప్రమత్తంగా ఉండాలి
‘సంరక్షక’ దాడులపై రాష్ట్రపతి ప్రణబ్ న్యూఢిల్లీ: కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సంరక్షకత్వం పేరుతో చేస్తున్న దాడులపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు సమాజ మౌలిక సూత్రాలను కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశ 70వ స్వాతంత్య్ర వార్షికోత్సవాల సందర్భంగా శనివారమిక్కడ నేషనల్ హెరాల్డ్ పత్రిక వెలువరించిన స్మారక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘మూక ఉన్మాదం తారస్థాయికి చేరి, నిర్హేతుకంగా, నియంత్రించలేని విధంగా మారినప్పుడు మనం కాస్త ఆగి ఆలోచించాలి.. నేను సంరక్షకవాదం గురించి మాట్లాడటం లేదు. మన కాలపు మౌలిక సూత్రాలను కాపాడుకోవడానికి మనం తగినంత అప్రమత్తంగా ఉన్నామా? లేదా అనే విషయంపై మాట్లాడుతున్నాను’ అని పేర్కొన్నారు. 200 భాషలు, ఏడు మతాలు, 130 కోట్ల జనాభా గల దేశం ఒకే రాజ్యాంగం, జెండా కింద శాంతి సామరస్యాలతో కొనసాగడం గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చట్టాన్ని ఉల్లంఘించారనో, మరొకటనో ఒక వ్యక్తిపై దాడి చేస్తున్న దృశ్యాలను టీవీల్లో, పత్రికల్లో చదివినప్పుడు కాస్త ఆగి ఆలోచించాలని కోరారు. ఈ విషయంలో ఎవరూ తమ బాధ్యత నుంచి తప్పించుకోకూడదని, మనం ఏం చేశామని భావి తరాలు వివరణ కోరతాయని అన్నారు. ఈ ప్రశ్నను తనకు తాను కూడా వేసుకుంటున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా, రాహుల్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ప్రణబ్.. ‘ఒక స్వాతంత్య్ర పోరాట సైనికుడు తిరిగి అవతరించాడు’ అని ఆ పత్రికను కొనియాడారు. సమైక్య భావనపై దాడి: సోనియా చట్టాన్ని అమలు చేయాల్సిన వారి నుంచే ‘సంరక్షక’ హింసకు మద్దతు లభిస్తోందని సోనియా మండిపడ్డారు. మత విద్వేషం, నిరంకుశత్వం పెరిగాయని, ఎవరేం తినాలో ఆదేశిస్తున్నారన్నారు. దేశ సమైక్య భావనపై దాడి జరుగుతోందంటూ ఎన్డీఏ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు సంధించారు. ప్రశ్నించకుండా, నిజాలు చెప్పకుండా, తమను పొగడాలని, అదుపాజ్ఞల్లో ఉండాలని కొందరు మీడియాపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. కాగా, విదేశాలకు వెళ్లిన రాహుల్ శనివారం తిరిగొచ్చారు. -
భయపెట్టి నోర్లు మూయిస్తున్నారు!
► జర్నలిస్టులు, అధికారులు వాస్తవాలు చెప్పలేకపోతున్నారు ► మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన రాహుల్ ► బెంగళూరులో నేషనల్ హెరాల్డ్ స్మారక సంచిక విడుదల సాక్షి, బెంగళూరు: దేశంలో జర్నలిస్టులు స్వేచ్ఛగా నిజాలురాసే పరిస్థితి లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులను, అధికారులను భయపెట్టడంతోపాటు దళితులు, మైనారిటీలను చితగ్గొడుతూ నోరు మూయిస్తోందన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బెంగళూరులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్.. ‘సత్యానికుండే గొప్ప శక్తిని అణగదొక్కుతున్నారు. ఎవరైనా నిజం మాట్లాడాలని ప్రయత్నిస్తే వారిని పక్కకు నెట్టేస్తున్నారు. వేల మంది జర్నలిస్టులు వారు రాయాలనుకున్నది రాసే పరిస్థితుల్లేవు’ అని అన్నారు. నేషనల్ హెరాల్డ్‌లో పనిచేసే పాత్రికేయులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని.. తప్పు ఎక్కడ జరిగినా ప్రజలు తెలియజేయటంలో వీరిపై ఎవరి ఒత్తిడులూ ఉండవన్నారు. నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికను ఇంగ్లీషుతోపాటుగా హిందీ, ఉర్దూ భాషల్లో తీసుకురానున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, ఈ పత్రిక డైరెక్టర్లలో ఒకరైన ఆస్కార్ ఫెర్నాండెజ్ తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ 70 ఏళ్ల స్మారక సంచికను రాహుల్, అన్సారీ తదితరులు విడుదల చేశారు. భారత్‌లో మీడియా స్వేచ్ఛ అవసరం: అన్సారీ దేశ ప్రజల హక్కులను కాపాడేందుకు భారత మీడియాకు స్వేచ్ఛ అవసరమని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛతోనే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. మీడియా, జర్నలిస్టులపై ఇలాంటి దాడుల వల్ల మీడియా స్వీయనియంత్రణ కోల్పోవాల్సి వస్తుందన్నారు. తాజాగా ఎన్డీటీవీపై సీబీఐ దాడుల నేపథ్యంలో అన్సారీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీక్షిత్‌కు రాహుల్ మందలింపు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌ను ‘వీధి రౌడీ’ అని సంబోధించిన కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌ను రాహుల్ తీవ్రంగా మందలించారు. ‘భారత ఆర్మీ దేశం కోసం పనిచేస్తుంది. అలాంటి వ్యవస్థపై రాజకీయ నేతలెవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదన్నారు. ప్రజలు ఆర్మీ చీఫ్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేయొద్దు’ అని రాహుల్ అన్నారు.