భయపెట్టి నోర్లు మూయిస్తున్నారు!
► జర్నలిస్టులు, అధికారులు వాస్తవాలు చెప్పలేకపోతున్నారు
► మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన రాహుల్
► బెంగళూరులో నేషనల్ హెరాల్డ్ స్మారక సంచిక విడుదల
సాక్షి, బెంగళూరు: దేశంలో జర్నలిస్టులు స్వేచ్ఛగా నిజాలురాసే పరిస్థితి లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులను, అధికారులను భయపెట్టడంతోపాటు దళితులు, మైనారిటీలను చితగ్గొడుతూ నోరు మూయిస్తోందన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బెంగళూరులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్.. ‘సత్యానికుండే గొప్ప శక్తిని అణగదొక్కుతున్నారు.
ఎవరైనా నిజం మాట్లాడాలని ప్రయత్నిస్తే వారిని పక్కకు నెట్టేస్తున్నారు. వేల మంది జర్నలిస్టులు వారు రాయాలనుకున్నది రాసే పరిస్థితుల్లేవు’ అని అన్నారు. నేషనల్ హెరాల్డ్‌లో పనిచేసే పాత్రికేయులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని.. తప్పు ఎక్కడ జరిగినా ప్రజలు తెలియజేయటంలో వీరిపై ఎవరి ఒత్తిడులూ ఉండవన్నారు. నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికను ఇంగ్లీషుతోపాటుగా హిందీ, ఉర్దూ భాషల్లో తీసుకురానున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, ఈ పత్రిక డైరెక్టర్లలో ఒకరైన ఆస్కార్ ఫెర్నాండెజ్ తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ 70 ఏళ్ల స్మారక సంచికను రాహుల్, అన్సారీ తదితరులు విడుదల చేశారు.
భారత్‌లో మీడియా స్వేచ్ఛ అవసరం: అన్సారీ
దేశ ప్రజల హక్కులను కాపాడేందుకు భారత మీడియాకు స్వేచ్ఛ అవసరమని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛతోనే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. మీడియా, జర్నలిస్టులపై ఇలాంటి దాడుల వల్ల మీడియా స్వీయనియంత్రణ కోల్పోవాల్సి వస్తుందన్నారు. తాజాగా ఎన్డీటీవీపై సీబీఐ దాడుల నేపథ్యంలో అన్సారీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
దీక్షిత్‌కు రాహుల్ మందలింపు
ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌ను ‘వీధి రౌడీ’ అని సంబోధించిన కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌ను రాహుల్ తీవ్రంగా మందలించారు. ‘భారత ఆర్మీ దేశం కోసం పనిచేస్తుంది. అలాంటి వ్యవస్థపై రాజకీయ నేతలెవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదన్నారు. ప్రజలు ఆర్మీ చీఫ్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేయొద్దు’ అని రాహుల్ అన్నారు.