అనుభవశాలి కనుమరుగు | Sakshi Editorial On Pranab Mukherjee Passes Away | Sakshi
Sakshi News home page

అనుభవశాలి కనుమరుగు

Published Tue, Sep 1 2020 12:49 AM | Last Updated on Tue, Sep 1 2020 5:47 AM

Sakshi Editorial On Pranab Mukherjee Passes Away

దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం గడించి, ఎన్నో పదవుల్లో రాణించి సమర్థుడిగా పేరుతెచ్చుకున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం కన్నుమూశారు. వేరే వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు తనకు కరోనా సోకిందని నిర్ధారణ అయిందని గత నెల 10న ఆయనే స్వయంగా ట్వీట్‌ చేశారు. మెదడులో ఏర్పడిన అవరోధాన్ని తొలగించడానికి అదేరోజు ఆయనకు శస్త్రచికిత్స కూడా చేశారు. ఆనాటినుంచీ ఆయన సురక్షితంగా కోలుకుని బయటపడాలని దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రార్థించారు. ప్రణబ్‌ ఆరోగ్యం కుదుటపడుతోందని గత నెల 16న ఆయన కుమారుడు ట్వీట్‌ చేశారు కూడా. కానీ ఆ మరుసటి రోజునుంచే దురదృష్టవశాత్తూ ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడం మొదలుపెట్టింది. మధ్యలో కొద్దికాలం మినహా ప్రణబ్‌ ముఖర్జీ 1969లో కాంగ్రెస్‌లో చేరింది మొదలు రాష్ట్రపతి అయ్యేవరకూ ఆ పార్టీతోనే ప్రయాణించారు. ఇందిరాగాంధీకి విశ్వాసపాత్రుడిగా మెలిగి 1973లో తొలిసారి కేంద్ర మంత్రి అయ్యారు. రెవెన్యూ, బ్యాంకింగ్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖను స్వతంత్రంగా చూస్తున్న సమయంలో స్మగ్లర్‌ హాజీ మస్తాన్‌ నేర సామ్రాజ్యంపై దాడులు చేయించినప్పుడు మీడియాలో ఆయన పేరు మార్మోగింది. ఎమర్జెన్సీ పర్యవసానంగా 1977లో కాంగ్రెస్‌ ఓటమిపాలయ్యాక తాత్కాలికంగా తెరమరుగైనా 1982లో ఆ పార్టీ తిరిగి అధికారంలోకొచ్చినప్పుడు ప్రణబ్‌కు ఇందిరాగాంధీ కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖను అప్పగించారు. స్వతంత్రంగా ఆలోచించడం, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మొదటినుంచీ ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. దేనికో ప్రభావితం కావడం, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం మొదటినుంచీ ఆయనకు పడదు. ఆయన హయాంలోనే భిన్న రంగాలకు సేవచేసేందుకు అనువుగా అనేక సంస్థలు మొగ్గతొడిగాయి. గ్రామీణ బ్యాంకులు, నాబార్డ్, ఎగ్జిమ్‌ బ్యాంకు వగైరాలు ప్రణబ్‌ చలవేనంటారు. 

 అనునిత్యం ఎన్నో సవాళ్లు, సమస్యలు వచ్చిపడే రాజకీయ రంగంలో మానసిక ఒత్తిళ్లకు లోనుకాకుండా వుండటం అసాధ్యం. పరస్పర విరుద్ధమైన ప్రయోజనాల కోసం సంఘర్షించే భిన్న వర్గాలను ఒక తాటిపైకి తీసుకురావడం కూడా కష్టం. కానీ ప్రణబ్‌ వీటిని స్థిరచిత్తంతో ఎదుర్కొన్నారు. సమస్యను జాగ్రత్తగా ఆకళింపు చేసుకుని, అన్ని వర్గాలతో ఓపిగ్గా చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడంలో ప్రణబ్‌కు ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ప్రభుత్వంలోనైనా, పార్టీలోనైనా ఆయన తీరు అదే. అందుకే ఆయన్ను ‘సంక్షోభ పరిష్కర్త’గా చూసేవారు. ఆర్థికమంత్రిగా వున్నప్పుడు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్‌) రుణాన్ని వెనక్కి తిప్పి పంపడం ఒక సంచలనం. సంస్కరణలవైపు మొగ్గుచూపినా వాటిని సంయమనంతో అమలు చేయడం ప్రణబ్‌ ప్రత్యేకత.  ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్‌గాంధీ అధికారంలోకొచ్చాక ప్రణబ్‌ ప్రభ మసకబారడం మొదలైంది. తనను ఆయన పీసీసీ అధ్యక్షుడిగా పంపారని అలిగిన ప్రణబ్‌ సొంతంగా రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్‌ను స్థాపించారు. 1987 ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో మౌనంగా వుండిపోయారు. రాజీవ్‌ మరణానంతరం పీవీ నరసింహారావు హయాంలో తిరిగి కాంగ్రెస్‌లో చేరి పూర్వ వైభవాన్ని పొందగలిగారు. 2004లో కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకొచ్చినప్పుడు ప్రధాని పదవి చేపట్టడానికి సోనియాగాంధీ నిరాకరించాక అందరి దృష్టీ ప్రణబ్‌పైనే పడింది.

పార్టీలో ఆయన్ను మించిన అనుభవశాలురు లేరు. కానీ రాజీవ్‌తో వున్న అనుభవంరీత్యా ఆయనేమీ ఆశించలేదు. ఇందిర హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేస్తూ రిజర్వ్‌బ్యాంకు గవర్నర్‌గా తాను నియమించిన మన్మోహన్‌ సింగ్‌ను ప్రధాని పదవికి ఎంపిక చేస్తే మారుమాట్లాడకుండా శిరసావహించారు. రెండోసారి 2009లో కూడా ప్రధాని పదవికి ప్రణబ్‌ పేరు ప్రస్తావనకొచ్చింది. కానీ అప్పుడూ ఆయనకు అది దక్కలేదు. స్వతంత్రంగా వ్యవహరించే ప్రణబ్‌ తీరుపై సోనియాగాంధీకున్న భయాందోళనలే ఇందుకు కారణమంటారు. అయితే 2012లో రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు ఆయన తన అభీష్టాన్ని దాచుకోలేకపోయారు. రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్‌ తొలి చాయిస్‌ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీయేనని అప్పట్లో మీడియాలో కథనాలొచ్చాయి. సంక్షోభ పరిష్కర్తగా వుండే ప్రణబ్‌ అనుభవాన్ని వదులుకోలేకే ఇలాంటి ఆలోచన చేసినట్టు కాంగ్రెస్‌ లీకులిచ్చినా 2014లో బొటాబొటీ మెజారిటీ వచ్చే పక్షంలో ఆయన సహకరించకపోవచ్చునన్న సంశయం సోనియాగాంధీకి వుందంటారు. ఏమైతేనేం రాష్ట్రపతి పదవికి ఆయన్ను ఎంపిక చేయక తప్పలేదు.

సాధారణంగా రాజకీయాల్లో మునిగి తేలేవారికి పుస్తక రచన సంగతలావుంచి పుస్తకాలు చదవడానికి కూడా సమయం చిక్కదు. కానీ ప్రణబ్‌ ఇందుకు భిన్నం. ఆయన ఎన్ని సమస్యల్లో తలమునకలైవున్నా గ్రంథ పఠనానికి, అధ్యయనానికి సమయం కేటాయించుకునేవారు. రాష్ట్రపతి అయ్యాక తీరిక దొరకడం వల్ల కావొచ్చు...ఆయన తన అనుభవాలను రంగరించి మూడు పుస్తకాలు తీసుకొచ్చారు. పదవినుంచి వైదొలగాక మరో గ్రంథాన్ని రాశారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తనకెదురైన అనుభవాలు, వివిధ సందర్భాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలపై తన మనోభీష్టాన్ని వాటిల్లో వ్యక్తం చేశారు. అయితే సంక్షోభ పరిష్కర్తగా పేరున్నందువల్ల కావొచ్చు... ఎక్కడా ఆయన వివాదాస్పద అంశాల జోలికి పోలేదు. ఎవరినీ నొప్పించే ప్రయత్నం చేయలేదు. చివరకు రాజీవ్‌ తనను తొలుత కేంద్ర కేబినెట్‌ నుంచీ, ఆ తర్వాత పార్టీనుంచి సాగనంపడంపై ప్రచారంలో వున్న కథనాలను సైతం ఆయన కొట్టిపడేశారు. ఉద్దేశపూర్వకంగానే కొన్ని జ్ఞాపకాలను పంచుకోవడం లేదని కూడా ఆ పుస్తకాల్లో తేల్చిచెప్పారు. అయిదు దశాబ్దాలపాటు దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి కనుమరుగైన ప్రణబ్‌కు ‘సాక్షి’ నివాళులర్పిస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement