
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : ఆర్‌ఎస్‌ఎస్ జూన్ 7న నిర్వహించబోచే ‘తృతీయ వర్ష్ వర్గా’ శిక్షణ కార్యక్రమ వీడ్కోలు వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించినట్లు సమాచారం. ఆర్‌ఎస్‌ఎస్ ‘తృతీయవర్ష్ వర్గా’ పేరుతో ఈ వేడుకను నాగపూర్‌లోని తన ప్రధాన కార్యలయం రేష్మీ నగర్‌లో నిర్వహిస్తుంది. గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ఓ ప్రముఖ వ్యక్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారితో చివరి సందేశాన్ని ఇప్పించడం ఆనావాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈ ఏడాది జూన్‌లో నిర్వహించబోయే ఈ వీడ్కోలు కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించినట్లు సమాచారం. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండే ఓ కాంగ్రెస్ నాయకుడు సంఘ్ పరివార్ తరపున ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రెకిత్తిస్తోంది.
ఈ విషయం గురించి ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ ‘మేము ఈ వీడ్కోలు వేడుకకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించాము. ఆయన కూడా ఈ వేడుకకు రావడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. అని పేర్కొన్నారు. అయితే ప్రణబ్ ముఖర్జీ ఈ వేడుకకు హజరవుతున్నారా లేదా అనే విషయం గురించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ప్రణబ్ ఈ వేడుకకు హజరయితే ఆ విషయం కాంగ్రెస్ వారికి ఇబ్బంది కలిగిస్తుందని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతాన్నాయి. ఎందుకంటే సంఘ పరివార్ స్థాపన నుంచే దానికి, కాంగ్రెస్ పార్టీకి సిద్దాంతపరంగా విభేదాలు ఉన్నాయి. అంతేకాక ఇంతవరకూ రాహుల్‌గాంధీ కూడా ఆర్‌ఎస్‌ఎస్ పట్ల తన వైఖరిని బయటపెట్టలేదు. గతంలో రాహుల్ ఒకసారి మహాత్మగాంధీ మరణానికి ఆర్‌ఎస్‌ఎస్ బాధ్యత వహించాలనే ఆరోపణలు చేయడంతో ప్రస్తుతం పరువు నష్టం కేసును కూడా ఎదుర్కొంటున్నారు.