న్యూఢిల్లీ : దేశాన్ని కుదిపేసిన 'బోఫోర్స్' వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. బోఫోర్స్ ఒప్పందం కుంభకోణం తేనెతుట్టను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కదిలించారు. బోఫోర్స్ ఒప్పందం ...కుంభకోణం అని నిర్థారాణ కాలేదని ఆయన అన్నారు. బోఫోర్స్ ఒప్పందం స్కాం అని మీడియాలోనే వచ్చిందని ప్రణబ్ పేర్కొన్నారు.
స్వీడన్ ఛానల్ స్వదేశ్ నేషనల్ డైలీ ఇంటర్వ్యూలో ఆయన పైవిధంగా స్పందించారు. బోఫోర్స్ కుంభకోణం అని ఏ న్యాయస్థానం ఇంకా నిర్ధారించలేదన్నారు. బోఫోర్స్ కొనుగోలు సమయంలో తాను రక్షణమంత్రిగా ఉన్నానన్నారు. బోఫోర్స్ శతఘ్నులు అద్భుతమైనవని ఆర్మీ అధికారులు ధ్రువీకరించిన తర్వాతే కొనుగోలు చేశామన్నారు.
స్వీడన్‌కు చెందిన హోవిట్జర్ తుపాకులను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు 1986లో కుదుర్చుకున్న రూ.1600 కోట్ల ఒప్పందంలో రూ.64 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు అభియోగాలు ఉన్నాయి. 'బోఫోర్స్' దెబ్బకు 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.
బోఫోర్స్ కుంభకోణంలో కీలక పాత్రధారి అయిన ఇటాలియన్ వ్యాపారి ఒట్టావియో ఖత్రోకీ ఆరోపణలు ఎదుర్కొన్న ఖత్రోకీ, అరెస్టును తప్పించుకునేందుకు 1993లో భారత్‌ను విడిచి పారిపోయాడు. అతడి అప్పగింత కోసం సీబీఐ రెండుసార్లు విఫలయత్నాలు చేసింది. తొలుత 2002లో మలేసియాను, తర్వాత 2007లో అర్జెంటీనాను ఖత్రోకీ అప్పగింత కోసం కోరినా ఫలితం లేకపోయింది. 2013 జులైలో ఇటలీలోని మిలాన్ నగరంలో అతడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ వ్యవహారంపై బీజేపీ... మరోసారి సీబీఐ దర్యాప్తుకు అప్పట్లో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.