సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నేడు పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, ఉద్యోగాల కరువు, కుల, మత ఘర్షణలు, రేప్‌లు, హత్యలు రాజకీయ ఆయుధాలు కాకుండా పోయాయి. వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టిన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల అవినీతి గురించి పాలకపక్షం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పరస్పరం దూషించుకుంటున్నాయి. అవినీతే మళ్లీ మళ్లీ ఆయుధం అవుతోంది. ఎందుకు ?
1987లో బోఫోర్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి రాజకీయ పక్షాలకు అవినీతే ప్రధాన ఆయుధంగా ఉంటూ వస్తోంది. నాడు బోఫోర్స్ కుంభకోణం గురించి ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో పాలకపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై గోల చేయడంతో ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కూలిపోయింది. అంతకు ముందు పార్లమెంట్ ఎన్నికల్లో 404 సీట్లతో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో కేవలం 197 సీట్లకే పరిమితం అయింది. ఎన్నికలపై అవినీతి మంత్రం ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో రాజకీయ పార్టీలకు మొదటిసారి తెలిసి వచ్చింది. 1991 నుంచి పాలకపక్షాన్ని అవినీతి పేరు మీద తూర్పారా పట్టడం ప్రతిపక్షాలకు ప్రధాన పనైంది.
అవినీతి ఆరోపణల్లో ఎంత బలం ఉంది? కోర్టు ముందు అవినీతి తేలుతుందా? లేదా? అన్న అంశంతో సంబంధం లేకుండా ప్రజల దృష్టిలో అభాసుపాలు చేయడమే ప్రధాన ఉద్దేశంగా కొనసాగుతూ వస్తోంది. వీపీ సింగ్, చంద్రశేఖర్, హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్, పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్‌లు ప్రధాన మంత్రులుగా ఉన్నప్పుడూ ఇదే జరిగింది. పీవీ నర్సింహారావుకు హర్షద్ మెహతా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తగా, మన్మోహన్ సింగ్ హయాంలో బొగ్గు, టెలిఫోన్ స్కామ్‌లపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు, కేసులు కొనసాగాయి. ఆ తర్వాత విజయం మాల్యా, ఇప్పుడు నీరవ్ మోదీ, చోక్సీల బాగోతాలు బట్టబయలయ్యాయి.
ప్రభుత్వ ఖజానాకు చౌకీదారుగా వ్యవహరిస్తానంటూ 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడేం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ దండెత్తడంతోపాటు.. దావోస్‌లో బిజినెస్ లీడర్లతో మోదీ దిగిన గ్రూప్ ఫోటోలో నీరవ్ మోదీ ఉండడాన్ని తప్పు పట్టింది. మెహుల్ చోక్సీని పేరుతో పిలిచే వీడియో క్లిప్‌ను ప్రచారంలోకి తెచ్చింది. దీనికి ప్రతిగా 2013లో నీరవ్ మోదీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరైన విషయాన్ని, నీరవ్ మోదీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అభిషేక్ సింఘ్వీ భార్యా, కూతురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్న కంపెనీ ఆఫీస్ స్పేస్‌ను అద్దెకు ఇవ్వడాన్ని బీజేపీ పట్టుకు చూపింది.
దేశంలో పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై గ్రామీణ ఓటర్లు స్పందిస్తుండగా, అవినీతి ఆరోపణలపై పట్టణ ఓటర్లు స్పందిస్తున్నారు. రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈ ఓటర్ల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment