
కేంద్ర ప్రభుత్వం ఆశించినట్టుగానే హెచ్‌సీయూ ప్రతిష్ఠాత్మక విద్యా కేంద్రంగానే వెలుగొందింది. వారసత్వంగా సంక్రమించిన భూమిని కేటాయించడం, గౌరవ హోదాను అనుభవించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఖర్చంతా యూజీసీ పద్దులే భరించాయి. యూనివర్సిటీని స్థాపించిన యాభయ్యేళ్లకు దాని భూములపై ఇప్పుడు జాతీయస్థాయిలో వివాదం జరుగుతున్నది. నిజానికి పాతికేళ్ల కిందనే ఈ చర్చను లేవనెత్తి ఉండాలి. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు అప్పటి మీడియా కరపత్రికల్లా వ్యవహరించడం వల్ల, కేంద్రంలో కూడా ఆయన మిత్రపక్షమే ఉన్నందువల్ల చర్చ జరగలేదు. యూనివర్సి టీకి కేటాయించిన 2300 ఎకరాల్లో 800 ఎకరాల సంతర్పణ వివిధ సంస్థల పేర్లతో ఇష్టారాజ్యంగా జరిగి పోయింది.
ఉస్మానియా యూనివర్సిటీకి ఉద్యమాల పుట్టినిల్లుగా పేరుండేది. ఉద్యమాల పర్యవసానంగా పుట్టిన యూనివర్సిటీ హైదరా బాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఒక భావోద్వేగ పూరితమైన నేపథ్యం హెచ్‌సీయూ ఆవిర్భావానికి కారణమైంది. 1969, 1972 సంవత్సరాల్లో రెండు ఉధృతమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్య మాలను తెలుగు నేల చూడవలసి వచ్చింది. ఆ ఉద్యమాలను చల్లార్చి ఉమ్మడి రాష్ట్రాన్ని కొనసాగించడం కోసం ఒక రాజీ ఫార్ములాగా ఆరు సూత్రాల పథకాన్ని కేంద్రం ముందుకు తెచ్చింది. అందులో ఒక అంశం హైదరాబాద్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు! విద్యారంగంలో వెనుకబాటుతనా నికి గురైన ప్రాంతంగా ఉన్న తెలంగాణలో ఒక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఏర్పాటు, రాష్ట్ర రాజధానిలో ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు కూడా సమాన అవకాశాలు లభించే విధంగా దాన్ని కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఉభయతారకంగా ఉంటుందని భావించారు.
ఇందుకోసం రాజ్యాంగ సవరణ అవసరమైంది. 32వ సవరణ ద్వారా 371వ అధికరణానికి ‘ఈ’ అనే సబ్‌క్లాజ్‌ను జోడించారు. పార్లమెంట్ ఒక చట్టం ద్వారా హైదరాబాద్‌లో ఒక ‘సెంట్రల్’ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ఈ క్లాజ్ అవకాశం కల్పించింది. ఆ మేరకు హైదరాబాద్ విశ్వవిద్యాలయ చట్టం 1974ను పార్లమెంట్ ఆమోదించింది. అదే సంవత్సరం సెప్టెంబర్‌లో గెజెట్‌లో ఈ చట్టాన్ని ప్రచురించారు. భారత రాజ్యాంగంలో 371వ అధికరణం కింద ప్రస్తావించిన ఏకైక విశ్వవిద్యాలయం హెచ్‌సీయూ మాత్రమే! అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారుగా 2,300 ఎకరాల భూమిని హైదరాబాద్ నగర కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గచ్చిబౌలిప్రాంతంలో కేటాయించింది. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడమో, లేక ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించడమో చేయలేదు.
పూర్వపు హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో వాటిని ఆనుకొని ఉన్న ఇతర జిల్లాల్లో ఉన్న భూములన్నీ నవాబ్ సొంత భూములుగా (‘సర్ఫెఖాస్’గా) పరిగణించేవారు. పోలీస్ యాక్షన్ తర్వాత ‘హైదరాబాద్ స్టేట్’ ఇండియన్ యూనియ న్‌లో విలీనమైంది. నైజాం... భూములన్నీ హైదరాబాద్ స్టేట్‌కు వారసత్వంగా లభించాయి. ఇందుకోసం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జీవించి ఉన్నంతకాలం పెద్దమొత్తంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా రాజభరణం చెల్లించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలాది ఎకరాల భూములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ నగరంలో డజన్లకొద్ది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు ఈ భూముల లభ్యతే కారణం.
హెచ్‌సీయూను ఒక ప్రతిష్ఠాత్మక విద్యా కేంద్రంగా మల చాలని కేంద్రం భావించినందు వల్ల అప్పటికి ప్రపంచ స్థాయిలో పేరున్న యూనివర్సిటీలను దృష్టిలో పెట్టుకొని వాటి స్థాయి లోనే భూములను కేటాయించాలని భావించారు. ఈ భూము లను కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవోను కూడా విడుదల చేసింది. కాకపోతే భూముల రిజిస్ట్రేషన్ జరగలేదు. అటువంటిది అవసరమని కూడా నాటి యూని వర్సిటీ పాలకవర్గాలు భావించలేదు. హెచ్‌సీయూకు చీఫ్ రెక్టార్‌గా ఒక గౌరవ హోదా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పార్లమెంట్ చట్టపరంగానే కట్టబెట్టింది. కంచే చేను మేస్తుందని ఎవరు భావిస్తారు! అందువల్ల టెక్నికల్‌గా ఆస్తుల బదలాయింపు జరగలేదు.
కేంద్ర ప్రభుత్వం ఆశించినట్టుగానే హెచ్‌సీయూ ప్రతి ష్ఠాత్మక విద్యా కేంద్రంగానే వెలుగొందింది. వారసత్వంగా సంక్ర మించిన భూమిని కేటాయించడం, గౌరవ హోదాను అనుభవించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఖర్చంతా యూజీసీ పద్దులే భరించాయి. యూనివర్సిటీని స్థాపించిన యాభయ్యేళ్లకు దాని భూములపై ఇప్పుడు జాతీయస్థాయిలో వివాదం జరుగుతున్నది. నిజానికి పాతికేళ్ల కిందనే ఈ చర్చను లేవనెత్తి ఉండాలి. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు అప్పటి మీడియా కరపత్రికల్లా వ్యవహరించడం వల్ల, కేంద్రంలో కూడా ఆయన మిత్రపక్షమే ఉన్నందువల్ల చర్చ జరగలేదు. యూనివర్సిటీకి కేటాయించిన 2300 ఎకరాల్లో 800 ఎకరాల సంతర్పణ వివిధ సంస్థల పేర్లతో ఇష్టారాజ్యంగా జరిగి పోయింది.
మిగిలిన దాంట్లో 400 ఎకరాల భూమిని తాడూ బొంగరం లేని క్రీడా నిపుణుల పేరుతో బిల్లీరావు అనే వ్యక్తికి కారుచౌకగా చంద్రబాబు కట్టబెట్టారు. అదీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, కేబినెట్ అనుమతి కూడా లేకుండానే ఈ కేటా యింపులు జరిగాయి. ఈ నాలుగొందల ఎకరాలు చాలవని ఎయిర్‌పోర్టు సమీపంలో మరో నాలుగొందల యాభై ఎకరా లను కూడా కట్టబెట్టారు. ఆనాటికి దేశంలోని అతిపెద్ద స్కాముల్లో ఈ బిల్లీరావు భూబాగోతం కూడా ఒకటి. వెంటనే ఎన్నికలు రావడం, చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోవడం,తదనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డిప్రభుత్వం ఈ అక్రమ కేటాయింపును రద్దు చేయడం తెలిసిన విషయాలే! రద్దును సవాల్ చేస్తూ బిల్లీరావు కోర్టుల్ని ఆశ్రయించి ఇరవయ్యేళ్లపాటు వ్యాజ్యాన్ని నడిపాడు.
రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగానే నిలవడంతో ఇరవయ్యేళ్ల తర్వాత గత సంవత్సరమే సుప్రీంకోర్టు తుది తీర్పునిస్తూ ఈ 400 ఎకరాలు ప్రభుత్వాని వేనని తేల్చేసింది. కేవలం టెక్నికల్‌గానే ప్రభుత్వ భూములు అనుకోవాలి. యూనివర్సిటీకి ఈ భూములను కేటాయించినట్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వ కార్య దర్శి రామచంద్రారెడ్డి యూనివర్సిటీ అధికారులకు 1975లోనే ఫిబ్రవరి 21న డీఓ లెటర్ ద్వారా కమ్యూ నికేట్ చేశారు. 2,300 ఎకరాలు కేటాయించినట్టు అందులో స్పష్టంగా పేర్కొన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు గానీ, ఆ రోజుల్లో రెండు కోట్లు ఖర్చుపెట్టి కాంపౌండ్‌వాల్ కట్టించింది.
ఇక్కడ తలెత్తుతున్న కీలకమైన ప్రశ్న ఏమిటంటే, రెండు ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాల నేపథ్యంలో ఆరు సూత్రాల పథకంలో భాగంగా ఏర్పడిన యూనివర్సిటీ ఇది. పార్లమెంట్‌లో ప్రత్యేకంగా చట్టాన్ని చేసి ఏర్పాటుచేశారు. రాజ్యాంగంలో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా భూముల్ని కేటాయించింది. ఈ భూముల్ని అకడమిక్ అవసరాలకు మాత్రమే వినియోగించాలని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే షరతు కూడా విధించింది.
ఆ షరతును ఉల్లంఘించడానికి రాష్ట్ర ప్రభు త్వమే సిద్ధపడటం, అమ్ముకోవడానికి కూడా తెగించడం చెల్లు బాటయ్యే విషయాలేనా? నైతికంగానే కాదు, న్యాయపరంగా కూడా! విశ్వవిద్యాలయ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం తప్ప స్టేక్ హోల్డర్లు ఇంకెవరూ లేరా?కోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఈ భూముల్ని తాకట్టు పెట్టి పదివేల కోట్లు అప్పు తీసుకున్నదట! ఇప్పుడు వేలానికి సిద్ధపడింది. ఈ 400 ఎకరాల్లో పర్యా వరణ విధ్వంసం జరుగుతున్నదన్న వార్తలు వ్యాపించడం, హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఇది జాతీయ సమస్యగా మారింది.
ఈ నాలుగొందల ఎకరాల పరిధిలోని దట్టమైన పొదలు స్క్రబ్ అడవిగా అల్లుకున్నాయి. మంజీరా బేసిన్‌లో ఎత్తయిన ప్రాంతంలో ఉన్నందువల్ల ఇక్కడి కుంటల్లో చేరిన నీరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూగర్భ జలాలకు ఊపిరిపోస్తున్నాయని చెబుతున్నారు. హెచ్‌సీయూ వెబ్‌సైట్ లోనే ఇక్కడున్న బయో డైవర్సిటీ గురించి అధికారికంగా పొందు పరిచారు. వంద ఎకరాల్లో బయో డైవర్సిటీని ధ్వంసం చేశారన్న వార్తలను అధికారికంగా రూఢి చేసుకున్న తర్వాతనే సర్వోన్నత న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది. ఏప్రిల్ 16వ తేదీ లోగా నివేదికను ఇవ్వాలని రాష్ట్ర సీఎస్‌ను ఆదేశించింది. న్యాయ స్థానం జోక్యంతో ప్రస్తుతం సద్దుమణిగినట్టు కనిపిస్తున్నా,ఎంపిక చేసుకున్న పత్రికల్లో వస్తున్న లీకు వార్తలు కొత్త కలవరాన్ని కలిగిస్తున్నాయి.
400 ఎకరాలే కాదు, మొత్తంరెండువేల ఎకరాల్లో ‘ఎకో పార్క్’ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నదనీ, ఇందుకోసం సెంట్రల్ వర్సిటీకి ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాలు కేటాయించి, అక్కడికి తర లిస్తారనీ ముందుగా ఒక తెలుగు పత్రిక రాసింది. దానికి ప్రభుత్వ అనుకూల పత్రికగా పేరున్నది. ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఖండనా రాలేదు. రెండోరోజు ఒక జాతీయస్థాయి ఇంగ్లిషు పత్రికలో మరింత ప్రముఖంగా, సమగ్రంగా అదే వార్త వచ్చింది.
ఎవరూ ఖండించలేదు. అధికారికంగా ప్రకటించనూ లేదు. ఇటువంటి వార్తల్నే జనం పల్స్ తెలుసుకోవానికి ప్రయో గించే ‘లీకు వార్త’లంటారు. నిజంగా ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశం ఉన్నదా? వేలానికి అడ్డుపడ్డ సెంట్రల్ వర్సిటీ విద్యా ర్థులపై కోపమా? వాళ్ల మీద కోపంతో యూనివర్సిటీ స్థాయిని తగ్గించాలనుకుంటున్నారా? వాళ్లదేముంది. రెండు మూడేళ్లు చదువుకొని వెళ్లిపోతారు. నిజంగానే సెంట్రల్ వర్సిటీని వంద ఎకరాల్లోకి పంపించే ఉద్దేశం ఉంటే మాత్రం దాని స్థాపిత లక్ష్యాలను అవహేళన చేసినట్టే అవుతుంది. ఒక తప్పును దిద్దు కోవడానికి మరో తప్పు చేసినట్టవుతుంది. ప్రతిష్ఠాత్మకమైన కేంద్రీయ విశ్వవిద్యాలయంతో ఫుట్‌బాల్ ఆడుకునే హక్కు, అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయా అనే సంగతి కూడా తేలవలసి ఉన్నది.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com