రాజకీయ రంగంలో తెలంగాణ అస్తిత్వాన్ని భారత్ మింగేసింది. ఇప్పుడు దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణపై పట్టు కోసం సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్ధమైంది. దాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా పరావర్తనం చెందింది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ ఇప్పుడు ‘అబ్ దిల్లీ దూర్ నహీ’ అనే కొత్త నినాదాన్ని వినిపిస్తున్నది.
ఇక తెలంగాణలో అన్నీ జాతీయ పార్టీలే! బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు తోడు సీపీఐ, సీపీఎం, బీఎస్‌పీ, ఎఐఎమ్‌ఐఎమ్ వంటి చిన్నకారు సన్నకారు పార్టీలది కూడా జాతీయ హోదానే! ఎమ్‌ఐఎమ్‌కు మూడు నాలుగు రాష్ట్ర శాసనసభల్లో ప్రాతినిధ్యం ఉన్నందువల్ల అది కూడా జాతీయ పార్టీగానే చలామణీ అవుతున్నది. వైఎస్ షర్మిల పార్టీ ఒక్కటే ప్రాంతీయ పార్టీ. కొన్ని మరీ చిన్న పార్టీలు ఉన్నా లేనట్టే లెక్క. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల విలాసం, నివాసం హైదరాబాదే కానీ, తెలంగాణలో ఆ పార్టీకి సైన్ బోర్డ్ కూడా మిగల్లేదు.
టీఆర్‌ఎస్ దక్షిణాదిలోని ఒక ప్రాంతీయ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉప ప్రాంతీయ పార్టీగా కూడా పిలిచేవారు. అటువంటి పార్టీ ఉత్తరాదికి విస్తరించి అతి బలాఢ్యుడైన శత్రువును ఢీకొట్టగలదా? ఇప్పుడిదొక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే, శ్రీశ్రీ చెప్పినట్టు ‘అభాగ్యులం మేము, సరిహద్దులు దొరకని సంధ్యలలో మా సంచారం. అన్నీ సమస్యలే. సందేహాలే మాకు’.
అప్పుడెప్పుడో 13 శతాబ్దాలకు పూర్వం ఉత్తరాది చక్రవర్తి హర్షవర్ధనుడు దక్షిణాదిపైకి దండెత్తి వచ్చాడట! దక్కన్ ప్రాంత చాళుక్య రాజు రెండో పులకేశి ఆ చక్రవర్తిని నర్మదా నది ఆవలి దాకా తరిమి తరిమి కొట్టాడట! ‘కనోజ్ (హర్షుని రాజధాని) బహుత్ దూర్ హై’ అని భావించి ఉంటాడు. అందుకని అక్కడి దాకా వెళ్లే ఆలోచన రెండో పులకేశి చేయలేదు.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో కూడా దక్షిణాది నాయకుడెవరూ జాతీయ పార్టీని స్థాపించే ప్రయత్నం చేయలేదు. ఒక్క శ్రీమాన్ చక్రవర్తుల రాజగోపాలాచారి మాత్రమే నెహ్రూ విధానాలతో విభేదించి స్వతంత్ర పార్టీని స్థాపించారు. ప్రకాశం పంతులు, ఎన్‌జీ రంగా, గౌతు లచ్చన్న, బెజవాడ రామచంద్రారెడ్డి వగైరా ఆంధ్రా నాయకులు ఆయనకు అండగా నిలబడ్డారు. పార్టీ ప్రభావం మాత్రం ఉత్తరాదిలోనే ఎక్కువగా కనిపించింది. 1967–71 మధ్యకాలంలో 44 సీట్లతో లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా కూడా పనిచేసింది.
స్పష్టమైన సిద్ధాంతాలు, విధానాల ప్రాతిపదిక మీద ‘స్వతంత్ర పార్టీ’ ఆవిర్భవించింది. సోషలిస్టు తరహా ఆర్థిక విధానాలకు ఆ పార్టీ బద్ధవ్యతిరేకి. పీవీ నరసింహారావు అమలుచేసిన ఆర్థిక సరళీకరణను ముప్ఫయ్యేళ్లు ముందుగానే ‘స్వతంత్ర పార్టీ’ ప్రవచించింది. కాలంతోపాటు కాకుండా ముప్పయ్యేళ్లు ముందు నడిచి అనతికాలంలోనే కాలధర్మం చెందింది.
ఆ తర్వాత మరో దక్షిణాది నాయకుడు ఎవరూ జాతీయ పార్టీ పెట్టే ప్రయత్నం చేయలేదు. ఎమ్‌జీ రామచంద్రన్ నాయకత్వంలో ఏర్పడిన అన్నా డీఎమ్‌కే పార్టీకి ముందు ఆల్ ఇండియా అని తగిలించినప్పటికీ ఆ పార్టీ నాయకులెప్పుడూ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కే ఆలోచన చేయలేదు. ఎన్టీ రామారావు మాత్రం నేషనల్ పార్టీ కోసం కొన్ని కలలు కన్న తర్వాత నేషనల్ ఫ్రంట్‌తో సరిపెట్టుకున్నారు.
ఇన్నాళ్ల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దక్షిణాది జాతీయ పార్టీ అనే గాండీవాన్ని దసరా నాడు జమ్మిచెట్టు దించారు. ఈ సాహసం వెనుక కేసీఆర్ లక్ష్యం ఏమిటి? సవాలక్ష సందేహాల్లో మొదటి సందేహం, ప్రశ్నల పరంపరలో మొదటి ప్రశ్న ఇదే! గుజరాత్ మోడల్‌ను ప్రచారం చేసుకొని మోదీ అధికారంలోకి వచ్చాడు. తెలంగాణా మోడల్‌ను మేము జాతీయ రాజకీయాల్లో ప్రచారం చేసుకుంటామని వివిధ సందర్భాల్లో టీఆర్‌ఎస్ నాయకులు చెప్పుకొచ్చారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ మోడల్‌ను ఓడించడమా? కేసీఆర్ మోడల్‌ను గెలిపించడమా? ఏది టీఆర్‌ఎస్ ప్రధాన లక్ష్యం కానున్నది? వైరుద్ధ్యం లేనట్టు కనిపిస్తున్న ఈ రెండంశాలూ ఒకటి కాదు. సినిమాల్లో బాలకృష్ణ డైలాగ్ మాదిరిగా ‘బోత్ ఆర్ నాట్ సేమ్!’ ఈ రెండు లక్ష్యాల్లో ఒక్కో దానికి ఒక్కో రకమైన కార్యాచరణ అవసరమవుతుంది.
మోదీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ఉంటే, మరో జాతీయ పార్టీ కాంగ్రెస్‌ను బలహీనపరచాలనుకోవడం సరైన వ్యూహం కాకపోవచ్చు. కాంగ్రెస్ ఎంత దిగజారినా, ఇప్పటికీ సుమారు 170 లోక్‌సభ స్థానాల్లో బీజేపీని ముఖాముఖి ఎదుర్కోగల స్థితిలో ఉన్నది. కేరళలోని 20 స్థానాల్లో పోటీ కాంగ్రెస్ – లెఫ్ట్ కూటమిల మధ్యనే ఉంటుంది. ఇంకో ఇరవై సీట్లలో ప్రాంతీయ పార్టీలతో ప్రధాన పోటీలో ఉండగల స్థితిలో ఉన్నది.
కాలం కలిసొస్తే ట్రిపుల్ డిజిట్‌ను అందుకోగల సామర్థ్యం ప్రతిపక్షాల్లో ఒక్క కాంగ్రెస్‌కు మాత్రమే ఉన్నది. సమాజ్‌వాది పార్టీ సుమారు 50 సీట్లలో బీజేపీకి పోటీ ఇవ్వగలదు. తృణమూల్ కాంగ్రెస్ 40 సీట్లలో, ఆర్‌జేడీ 25 సీట్లలో, బీజేడీ 20 స్థానాల్లో బీజేపీని ఎదుర్కొంటాయి. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో రెండు జాతీయ పార్టీలకూ ఠికానా లేదు.
పైన చెప్పిన పార్టీలతో పోలిస్తే బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్) ముఖాముఖి బీజేపీతో తలపడేది తక్కువ సీట్లలోనే! తెలంగాణలో హైదరాబాద్ పోను మిగిలిన 16 స్థానాల్లో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఎక్కువ చోట్ల త్రిముఖ పోటీ ఉంటుంది. తెలంగాణకు బయట బీఆర్‌ఎస్ బలంగా నిలబడగలిగిన లోక్‌సభ సీటు ఇప్పటికైతే ఒక్కటి కూడా లేదు.
బీఆర్‌ఎస్‌కు ఆంధ్రప్రదేశ్‌లో మద్దతు లభిస్తుందనుకోవడం భ్రమే అవుతుంది. తెలంగాణ ‘ఇచ్చిన’ కాంగ్రెస్‌నే నామరూపాలు లేకుండా చేశారు అక్కడి జనం. ఇక ‘తెచ్చిన’ కేసీఆర్‌ను ఆదరిస్తారంటే నమ్మడం కష్టం. అందుకు వాళ్ల కారణాలు వాళ్లకు ఉన్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఒక మహానగరం లేని పరిస్థితిలో ఎలా ఉన్నదో అరవయ్యేళ్ల అనంతరం ఏపీ విభజన తర్వాత కూడా అదే పరిస్థితిలో ఉన్నది.
విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ఆశ్రయం కల్పించగల మహానగరం ఆవశ్యకతను ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలకు మహానగరాలే గ్రోత్ ఇంజన్లుగా మారుతున్నాయి. విలీనం – విభజన వంటి ప్రయోగాలు లేకుండా ఈ అరవయ్యేళ్లలో విశాఖపట్టణంపై ఫోకస్ పెట్టి వుంటే అదొక మహానగరంగా అభివృద్ధి చెంది ఉండేదనీ, తాము మోసపోయామని వాళ్లు భావిస్తున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌కు ఆంధ్రప్రదేశ్ టఫ్ టాస్క్‌గానే ఉండబోతున్నది. కర్ణాటకలో జేడీఎస్ మీద కేసీఆర్ ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. అక్కడ కాంగ్రెస్ – బీజేపీల మధ్య ఏర్పడిన పోటాపోటీ వాతావరణంలో జేడీఎస్ పలుకుబడి నానాటికీ క్షీణిస్తున్నది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోని తెలుగు ప్రాంతాలపై నమ్మకం పెట్టుకోవడం కూడా కష్టం.
ఆయా రాష్ట్రాల్లోని ప్రధానస్రవంతి రాజకీయాలకు భిన్నంగా భాషాపరమైన మైనారిటీలు వ్యవహరించడం సాధారణంగా జరగదు. మోదీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించడమే బీఆర్‌ఎస్ ప్రధాన లక్ష్యమైతే కేసీఆర్ గతంలో చెప్పినట్టు ఫెడరల్ ఫ్రంట్ ప్లస్ కాంగ్రెస్ కూటమే మెరుగైన ప్రత్యామ్నాయమవుతుంది. అప్పుడు కేసీఆర్ జాతీయపార్టీ అవసరం ఉండదు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అంపశయ్య మీద ఉన్నదనే అభిప్రాయం బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నది. పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే అభిప్రాయాన్ని బహిరంగంగానే చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి లేదనే అంచనాతో ఆ స్థానాన్ని తమ జాతీయ పార్టీ భర్తీ చేయాలని వారు భావిస్తున్నారు. తెలుగు సినిమాలు కంటెంట్‌తో పాన్ ఇండియా సినిమాలుగా వెలుగుతున్న విషయాన్ని కేటీఆర్ పదేపదే గుర్తు చేస్తున్నారు.
కంటెంట్‌తోనే పాన్ ఇండియా పార్టీ కూడా సక్సెస్ కొట్టగలదనే ధీమా ఆయనలో ఉన్నది. తెలంగాణా అభివృద్ధి మోడలే ఆ కంటెంట్! అధికారంలోకి వచ్చిన తర్వాత తాము అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసి దేశం దృష్టిని ఆకర్షించాలని బీఆర్‌ఎస్ ప్లాన్ చేసుకుంటున్నది. ముఖ్యంగా రైతులను, దళిత వర్గాలను ఫోకస్ సెక్షన్లుగా ఎంపిక చేసుకున్నట్లు కనిపిస్తున్నది. రైతు బంధు, దళిత బంధు, సాగునీరు, తాగునీరు, నిరంతర విద్యుత్ వంటి అంశాలనూ, తెలంగాణలోని సంక్షేమ పధకాలనూ విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు.
ఇక్కడే ఒక సమస్య ఉన్నది. తాము అమలు చేసిన పథకాలు దేశమంతటా జైత్రయాత్రకు ఉపకరిస్తాయని ఒకపక్క ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. మరోపక్క మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల కోసం రెండు గ్రామాలకో ఎమ్మెల్యేను, పది గ్రామాలకో మంత్రిని నియమించి పద్మవ్యూహాన్ని ప్రయోగిస్తున్నారు. ఎందుకింత కురుక్షేత్ర యుద్ధ సన్నద్ధత? అధికారంలో ఉన్న పార్టీ ఒక అసెంబ్లీ ఉపఎన్నికలో గెలవడం కోసం ఆపసోపాలు పడవలసిన పరిస్థితి ఎందుకొచ్చింది? పైగా అక్కడ అధికార పార్టీకే ఎక్కువ అనుకూలతలున్నాయి.
కాంగ్రెస్ తరఫున గెలిచిన అభ్యర్థి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఆ పార్టీకి అక్కడ పెద్దగా బలం లేదు. హుజూరాబాద్‌లో మాదిరిగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చేతులేత్తేసే పరిస్థితి లేదు. ఆ పార్టీ పునాదులు బలంగానే ఉన్నాయి. గట్టిగానే పోటీలో నిలబడగలుగుతుంది. రెండు ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలిక అధికార పార్టీకి రాచబాటే కదా! అయినా ఎందుకో ఆ ధీమా కనిపించడం లేదు. ఈ పరిస్థితి మునుగోడుకే పరిమితమా? రాష్ట్రమంతటా ఉన్నదా అనేది ఇంకా అంతుబట్టడం లేదు.
ఇప్పుడు మన సమాజంలో మిలీనియల్స్ తరం, ఆ తర్వాతి (ో) తరం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. వారి ఆలోచనలే సమాజ అభిప్రాయంగా రూపుదిద్దుకుంటున్నాయి. సోషల్ మీడియాను పరిపాలిస్తున్నది వారే! వారి దృష్టిలో ప్రభుత్వ పాలన, సంక్షేమాలకు అర్థాలు మారిపోయాయి. సామాజిక పెన్షన్లు హక్కులుగా మారిపోయాయి. నేటి యువతరం తారకమంత్రం సాధికారత.
వెనుకబడిపోయిన సమస్త వర్ణాలు, వర్గాలు, మహిళలు సాధికారతను కోరుకుంటున్నారు. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, ఎదిగేందుకు సమానమైన అవకాశాలు అందుబాటులో ఉండటమే సాధికారత మార్గాలుగా యువతరం భావిస్తున్నది. మారుతున్న ఆలోచనల్ని గ్రహించి పబ్లిక్ పల్స్ పట్టుకోగలిగితే బీఆర్‌ఎస్‌కు ప్రయోజనం కలగవచ్చు. డిసెంబర్‌లో పార్టీ మొదటి బహిరంగ సభ జరిగి పార్టీ ప్రణాళిక విడుదలయ్యే వరకు ఊహాగానాలు, సందేహాలు సందడి చేస్తూనే ఉంటాయి.
ఆ పార్టీ ప్రణాళిక కార్యక్రమం పబ్లిక్‌లో విడుదలై కంటెంట్ నచ్చితే, కేసీఆర్ పంచ్ డైలాగులు పేలితే బొమ్మ పాన్ ఇండియా హిట్ కావచ్చు. అవుతుందనే ఆశిద్దాం. బీఆర్‌ఎస్ హడావిడి∙ఇండియాలో ఏమోగానీ తెలంగాణలో గులాబీ పార్టీకి కొంత మేరకు ఉపయోగపడవచ్చని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. మైనారిటీల ఓట్లు, లెఫ్ట్ భావజాలం ఓట్లు (కమ్యూనిస్టు పార్టీల ఓట్ల కంటే ఇవే ఎక్కువ) కాంగ్రెస్‌ను కాదని గులాబీ పార్టీ వెనుక సమీకృతమయ్యే అవకాశాలుంటాయి.
అందుకోసమే కాంగ్రెస్ పార్టీని జీవచ్ఛవంగా అభివర్ణిస్తున్నారు. మోదీ ప్రభుత్వం కూడా ఈ మూడేళ్లలో వ్యతిరేక ఓటును బాగానే సంపాదించుకున్నది. అవీ గులాబీ ఖాతాలో పడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకతను కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకత న్యూట్రలైజ్ చేయవచ్చు. వెరసి రాష్ట్రంలో కొంత ఉపయోగం జరగవచ్చు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెత తెలిసిందే. రాష్ట్రస్థాయి లక్ష్యసాధన కోసం జాతీయ స్థాయి ఆయుధం ధరిస్తే తప్పేమున్నది?
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
అనిశ్చిత ప్రాభవం!
Published Sun, Oct 9 2022 12:01 AM | Last Updated on Sun, Oct 9 2022 12:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment