బీజింగ్: కోవిడ్-19 మహమ్మారి నుంచి ప్రపంచం కోలుకుంటున్నప్పటికీ.. వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో వైరస్ కట్టడికి ‘జీరో కోవిడ్’ ఆంక్షలు అమలు చేస్తోంది చైనా. అయితే, రోజుల తరబడి ఇంట్లోనే నిర్భందించటంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని ప్రజలు రోడ్లపైకి వస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో జీరో కోవిడ్ ఆంక్షలను సడలిస్తోంది డ్రాగన్. ఓవైపు కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో ఆంక్షలను సడలిస్తే పెను విపత్తు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో పాటు వైద్య వ్యవస్థపై పెను భారం పడుతుందంటున్నారు.
చైనాలో ఇప్పటికీ చాలా మందికి వ్యాక్సిన్ అందలేదు. హెర్డ్ ఇమ్యూనిటీ సైతం లేని తరుణంలో కోవిడ్ ఆంక్షలను సడలించి పూర్తి స్వేచ్ఛ ఇస్తే దేశంలో ఎన్ని మరణాలు సంభవిస్తాయనే అంశంపై పరిశోధకులు అంచనా వేశారు. శుక్రవారం నాటికి చైనాలో 5,233 మరణాలు, 331,952కేసులు నమోదయ్యాయి.
పరిశోధకుల అంచనా ప్రకారం..
► 20లక్షలకుపైగా మరణాలు.. హాంకాంగ్ తరహాలో పూర్తి స్థాయిలో కరోనా ఆంక్షలు సడలిస్తే మెయిన్‌ల్యాండ్ చైనాలో 20 లక్షలలకుపైగా మరణాలు సంభవించే అవకాశం ఉందని గ్వాంగ్జీ ప్రాంతంలో ఉన్న సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెడ్ జౌ జియాటంగ్ అంచనా వేశారు. గత నెలలో షాంఘై జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధనా పత్రంలో ఈ విషయాలను పేర్కొన్నారు. మరోవైపు.. కరోనా కేసులు సైతం 23 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు.
► దేశంలో టీకాల పంపిణీని వేగవంతం చేయకుండా, ఆరోగ్య సదుపాయలు మెరుగుపరచకుండా జీరో కోవిడ్ పాలసీని చైనా ఎత్తివేస్తే దాదాపు 15 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందని చైనా, అమెరికాకు చెందిన పలువురు పరిశోధకులు గత మే నెలలోనే అంచనా వేశారు. కరోనా పీక్ దశకు చేరిన సమయంలో ఐసీయూలకు 15 రెట్ల డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, వ్యాక్సినేషన్‌పై దృష్టి పెడితే మరణాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
► జీరో కోవిడ్ ఆంక్షలను పూర్తిగా తొలగిస్తే 13 నుంచి 21 లక్షల మంది మరణించే అవకాశం ఉందని బ్రిటిష్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అనలిటిక్స్ కంపెనీ ఎయిర్‌ఫినిటీ పేర్కొంది. టీకాలు, బూస్టర్ రేటు, హైబ్రిడ్ ఇమ్యూనిటీ తక్కువగా ఉండటమే అందుకు కారణంగా తెలిపింది.
ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి జాంబీ వైరస్!.. పెను విపత్తుకు దారి తీయొచ్చా?
Comments
Please login to add a commentAdd a comment