వాషింగ్టన్ : అమెరికా సరిహద్దుల నుంచి వలసదారుల్ని నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానం ప్రకారం అమెరికాలోకి అక్రమంగా చొరబడిన తల్లిదండ్రులతోపాటు ఉన్న పిల్లల్ని వేరుచేసి వేర్వేరు కేంద్రాల్లో ఉంచుతారు. ఎలాంటి సంరక్షణా లేకుండా తాత్కాలికంగా తయారుచేసిన కేజ్‌ల్లో ఐదారేళ్ల పసివారిని నిర్బంధిస్తున్నారంటూ అన్ని వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. తాజాగా జీరో టాలరెన్స్ విధానాన్ని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో పాటు లారా బుష్ కూడా తప్పుపట్టారు. అయితే విధానంపై సమాధానం ఇవ్వాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం(డీహెచ్‌ఎస్) జీరో టాలరెన్స్ విధానం గురించి పత్రికా ప్రకటన విడుదల చేసింది.
భద్రతా కారణాల దృష్ట్యానే...
సరిహద్దు గుండా అక్రమంగా దేశంలోకి చొరబడే తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేసేందుకు ప్రత్యేకంగా ఒక విధానమంటూ ఏదీలేదని డీహెచ్‌ఎస్ స్పష్టం చేసింది. కాకపోతే మైనర్లను కస్టడీలోకి తీసుకొని వారి బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత తమకు ఉందని తెలిపింది. అయితే.. అక్రమ వలసదారుల్లో కొంత మంది మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారు ఉండే అవకాశం ఉన్నందున పిల్లల భద్రత దృష్ట్యానే తాము కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నామని పేర్కొంది. 2017 అక్టోబర్ నుంచి 2018 ఫిబ్రవరి మధ్య కాలంలో ఈవిధంగా సరిహద్దుల గుండా పిల్లలతో సహా ప్రవేశించే వారి సంఖ్య 315 శాతం పెరిగిందని, వీరిలో చాలా మంది పిల్లల గురించి ప్రశ్నించినపుడు సరైన సమాధానం చెప్పకుండా తడబడటం తమ అనుమానాన్ని మరింతగా పెంచిందని డీహెచ్‌ఎస్ తెలిపింది. ఇటువంటి కారణాల వల్లే కుటుంబ సభ్యుల నుంచి పిల్లల్ని వేరుచేస్తున్నామని.. అయితే కోర్టు ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్న పిల్లల్ని 20 రోజుల్లోగా విడుదల చేస్తున్నామని డీహెచ్‌ఎస్ తెలిపింది.
వారిని తిరస్కరించడం లేదు...
ఆశ్రయం కోరి వచ్చేవారిని అమెరికా తిరస్కరించడంలేదని, కేవలం తమ పౌరుల భద్రతా దృష్ట్యానే వలసదారులను అన్ని విధాలా పరీక్షించిన తర్వాతే దేశంలోకి అనుమతిస్తామని డీహెచ్‌ఎస్ స్పష్టం చేసింది. ఈ విషయంలో అమెరికా సరిహద్దు రక్షణా విభాగం(యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్) నిబంధనలను అనుసరించి ఎంత మంది విదేశీయులకు దేశంలోకి ప్రవేశించే అనుమతి ఇవ్వాలనే నిర్ణయం జరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నట్లుగా అక్రమ వలసదారుల నుంచి పిల్లల్ని వేరుచేసిన తర్వాత వారి బాగోగుల గురించి తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం అందించడంలేదనే వార్తల్ని డీహెచ్‌ఎస్ ఖండించింది. పిల్లల్ని ఎక్కడ ఉంచామనే విషయం తల్లిదండ్రులకు కచ్చితంగా తెలియజేస్తామని.. అదేవిధంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్(హెచ్‌ఎస్‌ఎస్) సహాయంతో డిటెన్షన్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ లైన్(డ్రిల్) ద్వారా ఫోన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిల్లలతో సంభాషించే వీలు కల్పిస్తున్నామని పేర్కొంది.
అవన్నీ అవాస్తవాలే...
అమెరికా సరిహద్దు అధికారులకు ఇతర భాషలు తెలియని కారణంగానే సమస్యలు ఎక్కువవుతున్నాయంటూ వచ్చిన వార్తల్ని డీహెచ్‌ఎస్ ఖండించింది. బార్డర్ పెట్రోల్ ట్రైనీస్ కచ్చితంగా రెండు భాషల్లో(ఇంగ్లీష్, స్పానిష్) ప్రావీణ్యం కలిగి ఉంటారని, వలసదారుల మాటల్ని వారు చక్కగా అర్థం చేసుకోగలరని తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే మైనర్లను అదుపులోకి తీసుకుంటారని.. అదేవిధంగా అదుపులోకి తీసుకునే సమయంలో, తిరిగి తల్లిదండ్రులకు అప్పగించే సమయంలో డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌లో నిబంధనలు కచ్చితంగా పాటిస్తారని తెలిపింది. వలసదారులకు శుభ్రమైన తాగు నీటిని అందించడంతో పాటు వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతున్నామని డీహెచ్‌ఎస్ పేర్కొంది. అదేవిధంగా పిల్లల్ని కేజ్‌లు, ఐస్‌బాక్స్‌లో బంధించడం లేదని, వారి సంరక్షణకు సంబంధించి బాధ్యతగా వ్యవహరిస్తున్నామని తెలిపింది. ఫోర్స్ సెటిల్‌మెంట్ అగ్రిమెంట్ నిర్బంధంలోకి తీసుకున్న వారిని 20 రోజుల్లోగా తప్పనిసరిగా విడుదల చేస్తున్నామని.. ఒంటరిగా దేశంలోకి చొరబడిన మైనర్లను అదుపులోకి తీసుకున్న 72 గంటల్లోగా హెచ్‌ఎస్‌ఎస్‌కు తరలించి వారి వివరాలు సేకరిస్తామని డీహెచ్‌ఎస్ వివరించింది.
నిర్బంధంలో ఉన్న పిల్లలతో మాట్లాడటానికి హెచ్‌ఎస్‌ఎస్ కల్పించే సదుపాయాల వివరాలు...
హెచ్‌ఎస్‌ఎస్ హాట్‌లైన్ (ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో 24 గంటలు అందుబాటులో ఉంటుంది)
1. ఐసీఈ(యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్) నిబంధనల ప్రకారం నిర్బంధ సౌకర్యాలేని వారు ఫోన్ చేయాల్సిన నంబర్ : 1-800-203-7001
2. ఐసీఈ నిబంధనల ప్రకారం నిర్బంధంలో ఉన్నవారు : 699#
ఫోన్ చేసే వ్యక్తులు పిల్లల పూర్తి పేరు, పుట్టిన తేదీ, మాతృదేశం తదితర వివరాలు తెలపాల్సి ఉంటుంది.
హెచ్‌ఎస్‌ఎస్ ఈమెయిల్ : information@ORRNCC.com
ఐసీఈ కాల్‌సెంటర్ : (సోమ వారం- శుక్రవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు)
నంబర్లు : 1-888-350-4024, 9116#
ఈమెయిల్ - Parental.Interest@ice.dhs.gov
Comments
Please login to add a commentAdd a comment