అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో.. అభ్యర్థులైన అటు కమలా హారిస్, ఇటు డొనాల్డ్ ట్రంప్ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడంతోపాటు దేశ పౌరులకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచేందుకు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని అక్రమ వలసదారులపై విరుచుకుపడ్డారు. వలసదారులను ప్రమాదకరమైన నేరస్థులుగా అభివర్ణించారు. అమెరికా పౌరులను చంపిన వలసదారులకు మరణశిక్ష విధించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కొలరాడోలోని ఆరోరాలో నిర్వహించిన ప్రచార సభలో ట్రంప్ వలసదారులపై ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.
తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే వెనిజులా గ్యాంగ్ ట్రెన్ డీ అరాగ్వాకు చెందిన ముఠా సభ్యులను లక్ష్యంగా చేసుకొని ‘ఆపరేషన్ అరోరా’ ప్రారంభిస్తానని చెప్పారు.. ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక పాలసీని ప్రస్తావిస్తూ.. చట్టవిరుద్దమైన వలసదారుల చొరబాటు పౌరులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. దీనిని త్వరలోనే పరిష్కరిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు.
‘మన దేశాన్ని ప్రమాదకరమైన నేరస్థులు ఆక్రమించుకున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అమెరికాను ఆక్రమిత అమెరికా అని పిలుస్తున్నారు. నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే వలసదారులే లక్ష్యంగా నేషనల్ ఆపరేషన్ అరోరాను ప్రారంభిస్తా. దీంతో నవంబరు 5న అమెరికా విముక్తి దినోత్సవంగా మారుతుంది. అమెరికన్ పౌరుడిని, చట్టబద్ధంగా ఉన్న అధికారులను చంపిన వలసదారులకు మరణశిక్ష విధించే బిల్లును తెస్తాం.
వెనెజువెలా గ్యాంగ్‌ను ఏరిపారేయడానికి ఆరోరాపై దృష్టిసారిస్తా. అరోరాను, దాడి చేసి స్వాధీనం చేసుకున్న ప్రతీ పట్టణాన్ని నేను రక్షిస్తా. ఈ క్రూరమైన నేరస్థులను జైలులో పెడతాం. వారిని దేశం నుంచి తరిమేస్తాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక, యూఎస్ ప్రభుత్వం దక్షిణ సరిహద్దు నియంత్రణకు మెక్సికోతో పలు సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈనేపథ్యంలో ఆ ప్రాంతంలో వలసదారుల చొరబాటు పెరిగిపోతుందని ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు.
అంతేగాక మహిళలు, పిల్లల అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులతో సహా ఇతర నేరస్థులకు మరణశిక్షను పొడిగించాలని ట్రంప్ ఇప్పటికే ప్రతిపాదించారు. ఇక వచ్చే నెల 5వ తేదీని అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలాహారిస్‌లు బరిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment