సీఐఏ డైరెక్టర్‌గా రాట్‌క్లిఫ్
ట్రంప్ అనూహ్య నిర్ణయాలు
హోమ్‌లాండ్ సెక్యూరిటీ చీఫ్‌గా క్రిస్టీ
వాషింగ్టన్: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం పలు అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఫాక్స్ న్యూస్ చానల్ హోస్ట్, మాజీ సైనికాధికారి పీట్ హెగ్సెత్‌ను రక్షణ మంత్రిగా, కీలకమైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్‌గా జాన్ రాట్‌క్లిఫ్‌ను ఎంపిక చేశారు. సౌత్ డకోటా గవర్నర్ క్రిస్టీ నోయెమ్‌ను హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం చీఫ్‌గా, అర్కన్సాస్ మాజీ గవర్నర్ మైక్ హకబీ (69)ని ఇజ్రాయెల్‌లో అమెరికా రాయబారిగా నియమించాలని నిర్ణయించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి స్టీవెన్ విట్కాఫ్‌ను పశ్చిమాసియాకు తన ప్రత్యేక దూతగా నియమించారు. డొనాల్డ్ రమ్స్‌ఫెల్డ్ తర్వాత అతి పిన్న వయస్కుడైన రక్షణ మంత్రిగా 44 ఏళ్ల హెగ్సెత్ రికార్డు సృష్టించనున్నారు. ఆయన జీవితమంతా సైనికుల కోసం, దేశం కోసం యోధుడిగా గడిపారంటూ ట్రంప్ ప్రశంసించారు. ఇక క్రిస్టీది సరిహద్దు భద్రతపై ఏమాత్రం రాజీ పడని తత్వమంటూ కొనియాడారు. హెగ్సెత్ 2003లో సైన్యంలో చేరారు. ఇరాక్, ఆఫ్గానిస్తాన్లలో పని చేశారు. 2016 నుంచి ఫాక్స్ న్యూస్ వీకెండ్ మార్నింగ్ టాక్ షో నిర్వహిస్తున్నారు. ‘ది వార్ ఆఫ్ వారియర్స్’పేరుతో పుస్తకాలు రాశారు.
సీఐఏ డైరెక్టర్‌గా సన్నిహితుడు
కీలకమైన సీఐఏ డైరెక్టర్‌గా ఎంపికైన రాట్‌క్లిఫ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు. భారత సంతతికి చెందిన కశ్యప్ (కాష్) పటేల్‌కు ఈ పదవి దక్కుతుందని తొలుత ఊహాగానాలు వినిపించాయి. ‘‘2016 ఎన్నికలప్పుడు రష్యా కుట్ర అంటూ సాగిన తప్పుడు ప్రచారం డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పనేనని బయట పెట్టడం మొదలుకుని సత్యం కోసం, నిజాయితీ కోసం పోరాడిన యోధుడు జాన్ రాట్‌క్లిఫ్. అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్ గురించి 51 మంది ఇంటెలిజెన్స్ అధికారులు అబద్ధాలు చెప్పినా ఆయన మాత్రమే అమెరికన్ ప్రజలకు నిజం చెప్పారు’’అంటూ ట్రంప్ ప్రశంసించారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా ఉన్నప్పుడు రాట్‌క్లిఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2020లో ఆయన్ను అమెరికా అత్యున్నత గూఢచారిగా ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment