Central Intelligence Agency
-
రక్షణ మంత్రిగా హెగ్సెత్
వాషింగ్టన్: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం పలు అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఫాక్స్ న్యూస్ చానల్ హోస్ట్, మాజీ సైనికాధికారి పీట్ హెగ్సెత్ను రక్షణ మంత్రిగా, కీలకమైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్‌గా జాన్ రాట్‌క్లిఫ్‌ను ఎంపిక చేశారు. సౌత్ డకోటా గవర్నర్ క్రిస్టీ నోయెమ్‌ను హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం చీఫ్‌గా, అర్కన్సాస్ మాజీ గవర్నర్ మైక్ హకబీ (69)ని ఇజ్రాయెల్‌లో అమెరికా రాయబారిగా నియమించాలని నిర్ణయించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి స్టీవెన్ విట్కాఫ్ను పశ్చిమాసియాకు తన ప్రత్యేక దూతగా నియమించారు. డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ తర్వాత అతి పిన్న వయస్కుడైన రక్షణ మంత్రిగా 44 ఏళ్ల హెగ్సెత్ రికార్డు సృష్టించనున్నారు. ఆయన జీవితమంతా సైనికుల కోసం, దేశం కోసం యోధుడిగా గడిపారంటూ ట్రంప్ ప్రశంసించారు. ఇక క్రిస్టీది సరిహద్దు భద్రతపై ఏమాత్రం రాజీ పడని తత్వమంటూ కొనియాడారు. హెగ్సెత్ 2003లో సైన్యంలో చేరారు. ఇరాక్, ఆఫ్గానిస్తాన్‌లలో పని చేశారు. 2016 నుంచి ఫాక్స్ న్యూస్ వీకెండ్ మార్నింగ్ టాక్ షో నిర్వహిస్తున్నారు. ‘ది వార్ ఆఫ్ వారియర్స్’పేరుతో పుస్తకాలు రాశారు.సీఐఏ డైరెక్టర్‌గా సన్నిహితుడుకీలకమైన సీఐఏ డైరెక్టర్‌గా ఎంపికైన రాట్క్లిఫ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు. భారత సంతతికి చెందిన కశ్యప్ (కాష్) పటేల్‌కు ఈ పదవి దక్కుతుందని తొలుత ఊహాగానాలు వినిపించాయి. ‘‘2016 ఎన్నికలప్పుడు రష్యా కుట్ర అంటూ సాగిన తప్పుడు ప్రచారం డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పనేనని బయట పెట్టడం మొదలుకుని సత్యం కోసం, నిజాయితీ కోసం పోరాడిన యోధుడు జాన్ రాట్క్లిఫ్. అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్ గురించి 51 మంది ఇంటెలిజెన్స్ అధికారులు అబద్ధాలు చెప్పినా ఆయన మాత్రమే అమెరికన్ ప్రజలకు నిజం చెప్పారు’’అంటూ ట్రంప్ ప్రశంసించారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా ఉన్నప్పుడు రాట్క్లిఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2020లో ఆయన్ను అమెరికా అత్యున్నత గూఢచారిగా ధ్రువీకరించారు. -
వైద్య రంగానికే సవాల్‌గా హవానా.. భారత్‌లో వెలుగులోకి
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా దౌత్యప్రతినిధులు, గూఢచారులకు సోకుతూ వైద్య రంగానికే సవాల్ విసిరిన హవానా సిండ్రోమ్ మొట్టమొదటిసారిగా భారత్‌లో వెలుగు చూసింది. ఈ నెల మొదటి వారంలో భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)కి చెందిన అధికారి హవానా సిండ్రోమ్ లక్షణాలతో బాధపడినట్టుగా ఆలస్యంగా బయటపడింది. తిరిగి వెళ్లిన వెంటనే ఆయనకు వైద్యం అందించినట్టు సీఎన్ఎన్ వెల్లడించింది. గత నెలలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ వియత్నాం పర్యటనకు వెళ్లడానికి ముందు ఆ దేశంలోని అమెరికా రాయబారులు ఇద్దరికి ఈ సిండ్రోమ్ సోకడంతో వెంటనే స్వదేశానికి తీసుకు వచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 మంది అమెరికా అధికారులు, వారి కుటుంబీకులు ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. 2017లో క్యూబాలోని అమెరికా రాయబార కార్యాలయం సిబ్బందిలో తొలిసారిగా ఈ వ్యాధి లక్షణాలు మైగ్రేన్ తరహాలో తలనొప్పి, అలసట, కడుపులో వికారం, నిద్రమత్తు, చెవుల్లో వింత శబ్దాలు, తలతిరగడం కనిపించాయి. ఎందుకు సోకుతోందో ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. రష్యా దాడి చేస్తోందా ? రష్యా నిఘా వర్గాలు అల్ట్రాసోనిక్ వెపన్స్ వాడడం ద్వారా అమెరికా ఇంటెలిజెన్స్ ప్రతినిధులపై దాడి చేస్తున్నాయని, అందువల్లే నరాల బలహీనత, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయనే అనుమానాలున్నాయి. అమెరికా ఏమంటోంది ? ఇటీవల కాలంలో అమెరికా దౌత్య ప్రతినిధుల్లో ఈ తరహా లక్షణాలు బయటకు రావడం సర్వసాధారణంగా మారిందని సీఐఏ డైరెక్టర్ విలియమ్ బర్న్స్ బృందంలోని ఒక మహిళా ప్రతినిధి వెల్లడించారు. ఎక్కువ మందిలో వైద్యం అందిన వెంటనే ఈ లక్షణాలు సర్దుకుంటున్నాయని కొందరిలో మాత్రం శాశ్వతంగా మెదడు దెబ్బతింటోందని తెలిపారు. ఈ సిండ్రోమ్ ఎందుకు సోకుతోందో నిగ్గు తేల్చడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆమె వివరించారు. అమెరికాలో పలువురు న్యూరాలజిస్టులు ఇది మానసిక ఒత్తిడికి సంబంధించిన వ్యాధిగా చెబుతున్నారు. -
అక్రమంగా దేశంలోకి చొరబాటు.. బంగ్లాదేశీయుల అరెస్ట్
సాక్షి, అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): పాస్‌పోర్టు లేకుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన నలుగురు బంగ్లాదేశీయులను విజయవాడ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు వ్యక్తులు మనదేశంలోకి అక్రమంగా ప్రవేశించి రైలులో ప్రయాణం చేస్తున్నట్లుగా కేంద్ర నిఘా విభాగం నుంచి శుక్రవారం విజయవాడ పోలీసులకు సమాచారం అందింది. నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకొని ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. హౌరా నుంచి గోవా వెళ్తున్న 08047 నంబర్ రైలులోని ఎస్–3 బోగీలో అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. వారంతా బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ హాసన్ (33), హైదర్ అలీఖాన్ (37), ఇందాదల్ ఖాన్ (21), షేక్ సైఫుల్లా (25)గా పోలీసులు గుర్తించారు. వారిలో మొదటి ముగ్గురు అన్నదమ్ములు కాగా సైఫుల్లా వారికి సమీప బంధువని తేల్చారు. కొన్నేళ్ల క్రితం మహ్మద్ హాసన్, హైదర్ అలీఖాన్‌లు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడి బెంగళూరులో ఇనుప స్క్రాప్ షాపులో పనిచేస్తూ ఉండేవారు. 2019లో ఇద్దరూ తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయారు. తిరిగి తమ సోదరుడు ఇందాదల్ ఖాన్, బంధువు సైఫుల్లాలను కలుపుకొని గత నెల 30న ఇండియా బోర్డర్‌కు చేరుకున్నారు. చీకటిపడే వరకు అక్కడే ఉండి అర్ధరాత్రి సమయంలో దేశంలోకి అక్రమంగా ప్రవేశించి హౌరా చేరుకున్నారు. ఓ వ్యక్తి సాయంతో హౌరా నుంచి వాస్కోడిగామాకు ట్రైన్ టికెట్లను ఏర్పాటు చేయించుకొని ఈనెల ఒకటో తేదీన రైలు ఎక్కి రెండో తేదీన రాత్రి 8 గంటల సమయంలో విజయవాడకు చేరుకున్నారు. అప్పటికే ప్రత్యేక తనిఖీలు చేస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న ఈ నలుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పాస్‌పోర్టు, అనుమతులు లేకుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతో వారిపై సెక్షన్ 467, 468, 120–బీ, సెక్షన్ 420, 12(1ఏ, బీ), పాస్‌పోర్ట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సమగ్ర దర్యాప్తు వీరంతా ఉపాధి కోసం దేశంలోకి అక్రమంగా ప్రవేశించారా? లేక ఏదైనా ఉగ్ర కార్యకలాపాల్లో భాగంగా చొరబడ్డారా? అనే కోణాల్లో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బిహార్‌లో పేలుడుకు రసాయన పదార్థాలన్నీ రైల్లోనే తీసుకెళ్లినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలడం, ఇప్పుడు ఈ నలుగురు బంగ్లాదేశీయులు రైలులోనే ప్రయాణిస్తూ పట్టుబడడంతో ఆర్పీఎఫ్, ఇంటెలిజెన్స్, పోలీసు ప్రత్యేక విభాగాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి. పశ్చిమ జోన్ లా అండ్ ఆర్డర్ డీసీపీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో నార్త్ డివిజన్ ఏసీపీ షేక్ షాను, సత్యనారాయణపురం ఇన్చార్జ్ సీఐ లక్ష్మీనారాయణ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. -
విద్యుత్ రంగంపై డ్రాగన్ ఆగడాలకు చెక్
సాక్షి, అమరావతి: చైనా కేంద్రంగా విద్యుత్ నెట్‌వర్క్‌పై సైబర్ దాడికి అవకాశాలున్నాయని రాష్ట్ర విద్యుత్ సంస్థలను కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో రాష్ట్ర విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ఈ వ్యవహారంపై ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి నేతృత్వంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్, ట్రాన్స్‌కో, నెట్వర్క్ విభాగాల ఉన్నతాధికారులు తాజా పరిస్థితిపై చర్చించారు. విద్యుత్ సరఫరాలో కీలక భూమిక పోషిస్తున్న ఏపీ ట్రాన్స్‌కోకు చెందిన 400 కేవీ సబ్ స్టేషన్లలో సాంకేతిక అంశాలపై నిశితంగా దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గత ఏడాది ముంబై విద్యుత్ సంస్థలపై చైనా ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న హ్యాకింగ్ గ్రూప్‌లు సైబర్ అటాక్ చేశాయని, దీనివల్ల కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని అమెరికాకు చెందిన ఓ సంస్థ అధ్యయనంలో వెల్లడించింది. కేంద్రానికి చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీజీసీఎల్)తో విద్యుత్ సరఫరా వ్యవస్థ అనుసంధానమై ఉండటం వల్ల ఏపీలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థతి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఏ తరహా దాడి జరగొచ్చు! రాష్ట్రంలో 400 కేవీ సబ్ స్టేషన్లు, లోడ్ డిస్పాచ్ సెంటర్ పూర్తిగా ఇంటర్నెట్తో అనుసంధానమై ఉన్నాయి. వీటిలో వాడే ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలన్నీ ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. ఇందులో వాడే సాఫ్ట్వేర్ మొత్తం తయారీ సంస్థలకు తెలిసే వీలుంది. 400 కేవీ సబ్ స్టేషన్‌ను చైనా హ్యాకర్లు కమాండ్ ద్వారా నియంత్రించి విద్యుత్ సరఫరాను అడ్డుకునే వీలుంది. ఇదే జరిగితే పారిశ్రామిక, రైల్వే, వాణిజ్య వ్యవస్థలతో పాటు అత్యంత కీలకమైన వైద్య రంగానికి విద్యుత్ నిలిచిపోతుంది. సమాచార వ్యవస్థ కుప్పకూలి, గ్రిడ్ ఇబ్బందుల్లో పడుతుంది. దీనివల్ల పెద్దఎత్తున ఆర్ధిక నష్టం కలగడమే కాకుండా, గందరగోళానికి ఆస్కారం ఉంటుంది. కౌంటర్ అటాక్ సబ్ స్టేషన్లలో మాడ్యూల్స్‌ను నడిపించే సాఫ్ట్వేర్ భాష ఆయా ఉపకరణాల బ్లాక్ బాక్స్‌లో నిక్షిప్తమై ఉంటుంది. ఇది ఆంగ్లంలో ఉంటే తెలుసుకునే వీలుంటుంది. కానీ చైనా నుంచి దిగుమతి అయ్యే వాటిల్లో చైనా లిపినే వాడుతున్నారు. దీన్ని పూర్తిగా డీకోడ్ చేయడం సాధ్యం కావడం లేదని శ్రీకాంత్ నాగులాపల్లి చెబుతున్నారు. చైనా సాఫ్ట్‌వేర్‌ను వీలైనంత వరకూ డీకోడ్ చేయాలని అధికారులు ఆదేశించారు. మరీ కష్టంగా ఉన్న సబ్ స్టేషన్లలో ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థపై ఆధారపడాలని సూచించారు. కేంద్ర మార్గదర్శకాల నేపథ్యంలో గడచిన కొన్ని నెలలుగా చైనా నుంచి దిగుమతి అయ్యే ప్రతీ ఉపకరణాన్ని కేంద్ర సంస్థలు పరిశీలిస్తున్నాయి. అంతకు ముందు దిగుమతి చేసుకున్న ఉపకరణాలను నిశితంగా తనిఖీ చేసేందుకు ట్రాన్స్‌కో ఐటీ విభాగంతో ప్రత్యేక బృందాలను సిద్ధం చేశామని ట్రాన్స్ సీఎండీ శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ఎస్ఎల్డీసీలోనూ ఐటీ పరంగా పటిష్టమైన తనిఖీ చేస్తున్నామని లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇంజనీర్ భాస్కర్ తెలిపారు. సైబర్ నేరాలను ముందే పసిగట్టే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి. -
మత్స్యకారులే సైనికులు..
సాక్షి, అమరావతి: తమిళనాడు సముద్ర తీరం నుంచి ఉగ్రవాదులు చొరబడ్డారన్న కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి అప్రమత్తత పెరిగింది. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరంలో చొరబాటుకు అవకాశం ఉన్న దాదాపు 380 బ్లాక్ స్పాట్లలో భద్రత చర్యలు ముమ్మరమయ్యాయి. మెరైన్ పోలీస్స్టేషన్ల పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. విశాఖపట్నం కేంద్రంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు కోస్తా తీరం వరకు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ (ఏపీసీఎస్‌పీ), కోస్ట్ గార్డ్స్, నేవీ బృందాలు గస్తీ కట్టుదిట్టం చేశాయి. ఐబీతో పాటు రాష్ట్రానికి చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్‌లు కూడా కోస్తా తీరంలో అపరిచితుల కదలికలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో డేగ కళ్లతో కాపు కాస్తున్నాయి. మత్స్యకారులే సైనికులు.. ఆంధ్రప్రదేశ్‌లో సువిశాల కోస్తా తీరంలో మత్స్యకారులే పౌర సైనికులని చెప్పక తప్పదు. సముద్ర తీరంలో ఏపీసీఎస్‌పీ, కోస్ట్‌గార్డ్స్‌కు కూడా తెలియని ప్రాంతాలపై మత్స్యకారులకు అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తీరంలో అపరిచితులు ఎవరైనా చొరబడితే తమకు సమాచారం అందించేలా ఏపీసీఎస్‌పీ, నేవీ సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. రాష్ట్ర తీరం వెంబడి దాదాపు 541 గ్రామాల్లో 3.04 లక్షల మంది మత్స్యకారులున్నారు. మొత్తం 70 వేలకు పైగా బోట్లు నిత్యం తిరుగుతుంటాయి. మత్స్యకారులకు తగిన సౌకర్యాలు సమకూర్చి మరింత ప్రాధాన్యత ఇస్తే దేశ అంతర్గత భద్రతకు మేము సైతం అంటూ ముందు నిలుస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ముంబై దాడుల తర్వాత తీరం పటిష్టం దశాబ్ధం కిందట ముంబైలో టెర్రరిస్ట్ దాడులు దేశంలోని సముద్ర తీరం భద్రతను సవాలు చేశాయి. ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చిన కేంద్ర హోంశాఖ 2017లో సముద్ర తీర రాష్ట్రాలకు 183 మెరైన్ పోలీస్స్టేషన్లను మంజూరు చేసింది. ఏపీలో కళింగపట్నం (శ్రీకాకుళం జిల్లా), రుషికొండ (విశాఖపట్నం), వాకలపూడి (తూర్పుగోదావరి), గిలకలదిండి (కృష్ణా), సూర్యలంక (గుంటూరు), దుగరాజపట్నం (నెల్లూరు) ప్రాంతాల్లో మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉండగా.. మరో 15 కొత్తగా ఏర్పాటయ్యాయి. వాటికి తగిన పోలీస్ సిబ్బంది నియామకంతోపాటు, మరబోట్లు, జెట్టీలు, అధునాతన ఆయుధాలు సమకూర్చాల్సి ఉంది. -
తిరుమల, కాణిపాకంలో రెడ్ అలర్ట్
తిరుపతి క్రైం: దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందన్న కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఆధ్యాత్మిక నగరం అప్రమత్తమైంది. శ్రీలంక నుంచి కొందరు తీవ్రవాదులు సముద్ర మార్గాన ఏపీకి చేరే అవకాశం ఉందని సమాచారం రావడంతో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తిలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, చిత్తూరు ఎస్పీ వెంకట అప్పల నాయుడు ఆదేశాల మేరకు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై నిఘా పెంచారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్, ఇండస్ట్రీలు, హాస్పిటల్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం, దేవాలయాలు తదితర ప్రాంతాల్లో విçస్తృతంగా తనిఖీలు చేశారు. అనుమానిత వస్తువులు, వ్యక్తులను గమనిస్తే స్థానిక పోలీసులకు, 100, 8099999977 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లోకి వచ్చే వ్యక్తుల పాస్‌పోర్టులు తనిఖీ చేయడంతోపాటు భద్రతను పెంచినట్లు తెలిపారు. నగర ప్రవేశ ప్రాంతాల వద్ద వాహనాలను క్షుణ్నంగా పరిశీలిస్తూ, అనుమానిత వ్యక్తులను విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్బన్ ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ.. తిరుమల, తిరుపతితో పాటు తిరుచానూరు, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, శ్రీవారి మెట్టు ప్రాంతాలు, ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. -
సీఐఏ గూఢచారికి ఇరాన్ ఉరిశిక్ష
టెహ్రాన్: అమెరికాకు ఇరాన్ రహస్య సమాచారాన్ని చేరవేస్తున్న జలాల్ హాజీ జవెర్ అనే రక్షణశాఖ కాంట్రాక్టర్‌ను ఉరితీసినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) కోసం ఇతను పనిచేసేవాడని వెల్లడించింది. పక్కా సాక్ష్యాధారాలతో జలాల్‌ను పట్టుకున్నామనీ, అతని ఇంట్లో ఇరాన్ రక్షణశాఖకు సంబంధించి కీలక పత్రాలు, నిఘాపరికరాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. జలాల్‌ను ఇరాన్ మిలటరీ కోర్టు దోషిగా తేల్చి ందనీ, ఆయనకు కరాజ్ నగరంలోని రాజయ్ షాహ్ర్ జైలులో మరణశిక్షను అమలుచేశామని చెప్పింది. జలాల్‌తో కలిసి గూఢచర్యానికి పాల్పడ్డ నేరానికి ఆయన మాజీ భార్యకు 15 ఏళ్ల జైలుశిక్ష పడిందన్నారు. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజా ఘటన ఎటుదారితీస్తుందో అని ప్రపంచదేశాల్లో ఆందోళన నెలకొంది. -
సల్మాన్ ఆదేశాలతోనే ఖషోగ్గీ హత్య
వాషింగ్టన్: సౌదీఅరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. సల్మాన్‌కు తెలియకుండా లేదా అతని ప్రమేయం లేకుండా ఇలాంటి ఘటన జరిగే ప్రసక్తే లేదని వెల్లడించింది. ఈ మేరకు సీఐఏను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. యువరాజు సల్మాన్ నిర్ణయాలపై విమర్శనాత్మక కథనాలు రాసిన ఖషోగ్గీ అక్టోబర్ 2న ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్య కార్యాలయానికి వెళ్లి అదృశ్యమయ్యారు. సల్మాన్ ఆదేశాలతోనే ఖషోగ్గీ హత్య జరిగిందని సీఐఏ చెప్పడం అమెరికా–సౌదీ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
అమెరికా ఉగ్రపోరులో 5 లక్షల మంది హతం
అమెరికా చేపట్టిన ‘ఉగ్రవాదంపై యుద్ధం’లో ఐదు లక్షల మందికి పైగా మరణించినట్లు అమెరికాకు చెందిన బ్రౌన్ యూనివర్సిటీ వాట్సన్ అంతర్జాతీయ, ప్రజా వ్యవహారాల సంస్థ నివేదిక వెల్లడించింది. మృతుల్లో ఉగ్రవాదులతోపాటు పోలీసులు, భద్రతా దళాలు, పౌరులు, అమెరికా, మిత్రపక్షాల సైనికులు ఉన్నారు. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి తర్వాత ఇరాక్, అఫ్ఘానిస్తాన్, పాక్‌లో ఉగ్రవాద స్థావరాలు, సమూహాలు, వ్యక్తులపై వివిధ రూపాల్లో అమెరికా దాడులు ప్రారంభించింది. అప్పటి నుంచి ఆయా దేశాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో 5.07 లక్షల మంది చనిపోయారని, వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని నివేదిక పేర్కొంది. 2016లో ఈ సంస్థ వెల్లడించిన గణాంకాలతో పోల్చితే ఈ రెండేళ్లలో లక్షా పది వేల మంది అధికంగా మృత్యువాతపడ్డారు. ‘ఉగ్రవాదంపై యుద్ధాన్ని అమెరికాలో పౌరులు, పత్రికలు, రాజకీయవేత్తలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే, పెరుగుతున్న మృతుల సంఖ్య యుద్ధ తీవ్రతను స్పష్టం చేస్తోంది’ అని ఆ సంస్థ తెలిపింది. ఆ దాడుల్లో మృతులను మిలిటెంట్లుగా అమెరికాతోపాటు ఆయా దేశాల సైనికవర్గాలు అభివర్ణిస్తున్నా వాస్తవానికి వారు పౌరులై ఉండే అవకాశం ఉందని ఆ నివేదికను రూపొందించిన నేట క్రాఫోర్డ్ అభిప్రాయపడ్డారు. ‘ఇలాంటి యుద్ధాల్లో ప్రత్యక్షంగా ఎందరు చనిపోయి ఉంటారన్నది మనకు తెలిసే అవకాశం లేదు. ఉదాహరణకు ఇరాక్‌లోని మోసుల్‌తో పాటు ఇతర నగరాలను ఐసిస్ తీవ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకునే క్రమంలో వేల సంఖ్యలో పౌరులు మరణించి ఉంటారు. అయితే, వారి మృతదేహాలు లభ్యం కాకపోవడం వల్ల లెక్క తేలే అవకాశం లేదు’ అని క్రాఫోర్డ్ తెలిపారు. ఈ నివేదిక ప్రకారం...ఇరాక్‌లో దాదాపు 2,04,575 మంది, అఫ్గాన్‌లో 38,480 మంది, పాక్‌లో 23,372 మంది మరణించారు. ఇరాక్, అఫ్ఘానిస్తాన్‌లలో మోహరించిన దాదాపు 7 వేల మంది అమెరికా సైనికులు చనిపోయారు. డ్రోన్ దాడుల్లో 2,714 మంది మృతి ఉగ్రవాదంపై యుద్ధంలో భాగంగా అమెరికా గూఢచారి విభాగం సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) పాకిస్తాన్లో డ్రోన్ల ద్వారా 409 దాడులకు పాల్పడినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. 2004 నుంచి జరుగుతున్న ఈ దాడుల్లో ఇప్పటి వరకు 2,714 మంది మృతి చెందగా, 728 మంది గాయపడ్డారు. -
సీఐఏ కుట్ర.. ఆధార్ వివరాలు చోరీ!
సాక్షి, చెన్నై: కోట్లాది మంది భారతీయుల వ్యక్తిగత వివరాలు అమెరికా ఇంటిలిజెన్స్ చేతుల్లోకి వెళ్లిందా?. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుంభకోణాలను వెలికితీసిన వీకీలీక్స్ సంస్ధ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. అమెరికాకు చెందిన కేంద్ర నిఘా సంస్థ(సీఐఏ) ఆధార్ వివరాలను చోరి చేసినట్లు పేర్కొంది. క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ అనే సంస్థ అభివృద్ధి చేసిన టూల్స్‌తో సీఐఏకు చెందిన ఆఫీస్ ఆఫ్ టెక్నికల్ సర్వీసెస్(ఓటీఎస్) ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు వెల్లడించింది. ఇదే క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ)కు బయోమెట్రిక్ సొల్యూషన్స్‌ను అందిస్తోంది. దీంతో వీకీలీక్స్ చెప్పిన వివరాలు నిజమేననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గోప్యత ప్రాథమిక హక్కేనని భారతీయ సుప్రీంకోర్టు తీర్పు వెలువడి 72 గంటలైనా గడవకముందే ఇలాంటి వార్త వినడం బాధాకరం. గతంలో కూడా ఆధార్ వివరాలు లీకయ్యాయనే వార్తలు ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి. అంతేకాకుండా క్రాస్ మ్యాచ్ భారతీయ భాగస్వామి అయిన స్మార్ట్ ఐడెంటిటీ డివైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 12 లక్షల మంది భారతీయుల ఆధార్ వివరాలను నమోదు చేసింది. ఈ మేరకు ట్వీటర్ వేదికగా వీకీలీక్స్ పలుమార్లు పోస్టులు చేసింది. వీకీలీక్స్ ట్వీట్లపై స్పందించిన అధికారులు ఆధార్ కార్డుల సమాచారం తస్కరణకు గురైందనే మాట అవాస్తవమని అన్నారు. వీకీలీక్స్ అసలు దీనిపై ఎలాంటి పోస్టులు చేయలేదని చెప్పారు. ఓ గుర్తు తెలియని వెబ్సైట్లో ఈ రిపోర్టు ఉందని గుర్తించామని అన్నారు. క్రాస్ మ్యాచ్ కేవలం బయో మెట్రిక్ పరికరాలను సరఫరా చేసే కంపెనీయే తప్ప వేరే విషయాలతో దానికి సంబంధం లేదని చెప్పారు. ఆధార్ డేటాను పూర్తిగా ఎన్‌క్రిప్ట్ చేశామని.. దాన్ని యూఐడీఏఐ తప్ప మరే ఇతర ఏజెన్సీ డీక్రిప్ట్ చేయలేదని వెల్లడించారు.