అమెరికా చేపట్టిన ‘ఉగ్రవాదంపై యుద్ధం’లో ఐదు లక్షల మందికి పైగా మరణించినట్లు అమెరికాకు చెందిన బ్రౌన్ యూనివర్సిటీ వాట్సన్ అంతర్జాతీయ, ప్రజా వ్యవహారాల సంస్థ నివేదిక వెల్లడించింది. మృతుల్లో ఉగ్రవాదులతోపాటు పోలీసులు, భద్రతా దళాలు, పౌరులు, అమెరికా, మిత్రపక్షాల సైనికులు ఉన్నారు. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి తర్వాత ఇరాక్, అఫ్ఘానిస్తాన్, పాక్‌లో ఉగ్రవాద స్థావరాలు, సమూహాలు, వ్యక్తులపై వివిధ రూపాల్లో అమెరికా దాడులు ప్రారంభించింది. అప్పటి నుంచి ఆయా దేశాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో 5.07 లక్షల మంది చనిపోయారని, వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని నివేదిక పేర్కొంది. 2016లో ఈ సంస్థ వెల్లడించిన గణాంకాలతో పోల్చితే ఈ రెండేళ్లలో లక్షా పది వేల మంది అధికంగా మృత్యువాతపడ్డారు. ‘ఉగ్రవాదంపై యుద్ధాన్ని అమెరికాలో పౌరులు, పత్రికలు, రాజకీయవేత్తలు పెద్దగా పట్టించుకోవడం లేదు.
అయితే, పెరుగుతున్న మృతుల సంఖ్య యుద్ధ తీవ్రతను స్పష్టం చేస్తోంది’ అని ఆ సంస్థ తెలిపింది. ఆ దాడుల్లో మృతులను మిలిటెంట్లుగా అమెరికాతోపాటు ఆయా దేశాల సైనికవర్గాలు అభివర్ణిస్తున్నా వాస్తవానికి వారు పౌరులై ఉండే అవకాశం ఉందని ఆ నివేదికను రూపొందించిన నేట క్రాఫోర్డ్ అభిప్రాయపడ్డారు. ‘ఇలాంటి యుద్ధాల్లో ప్రత్యక్షంగా ఎందరు చనిపోయి ఉంటారన్నది మనకు తెలిసే అవకాశం లేదు. ఉదాహరణకు ఇరాక్‌లోని మోసుల్‌తో పాటు ఇతర నగరాలను ఐసిస్ తీవ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకునే క్రమంలో వేల సంఖ్యలో పౌరులు మరణించి ఉంటారు. అయితే, వారి మృతదేహాలు లభ్యం కాకపోవడం వల్ల లెక్క తేలే అవకాశం లేదు’ అని క్రాఫోర్డ్ తెలిపారు. ఈ నివేదిక ప్రకారం...ఇరాక్‌లో దాదాపు 2,04,575 మంది, అఫ్గాన్‌లో 38,480 మంది, పాక్‌లో 23,372 మంది మరణించారు. ఇరాక్, అఫ్ఘానిస్తాన్‌లలో మోహరించిన దాదాపు 7 వేల మంది అమెరికా సైనికులు చనిపోయారు.
డ్రోన్ దాడుల్లో 2,714 మంది మృతి
ఉగ్రవాదంపై యుద్ధంలో భాగంగా అమెరికా గూఢచారి విభాగం సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) పాకిస్తాన్‌లో డ్రోన్ల ద్వారా 409 దాడులకు పాల్పడినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. 2004 నుంచి జరుగుతున్న ఈ దాడుల్లో ఇప్పటి వరకు 2,714 మంది మృతి చెందగా, 728 మంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment