మత్స్యకారులే సైనికులు.. | Fishermans Itself the Soldiers | Sakshi
Sakshi News home page

మత్స్యకారులే సైనికులు..

Published Tue, Aug 27 2019 4:53 AM | Last Updated on Tue, Aug 27 2019 4:53 AM

Fishermans Itself the Soldiers - Sakshi

సాక్షి, అమరావతి: తమిళనాడు సముద్ర తీరం నుంచి ఉగ్రవాదులు చొరబడ్డారన్న కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి అప్రమత్తత పెరిగింది. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరంలో చొరబాటుకు అవకాశం ఉన్న దాదాపు 380 బ్లాక్‌ స్పాట్‌లలో భద్రత చర్యలు ముమ్మరమయ్యాయి. మెరైన్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో హై అలర్ట్‌ ప్రకటించారు. విశాఖపట్నం కేంద్రంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు కోస్తా తీరం వరకు ఆంధ్రప్రదేశ్‌ కోస్టల్‌ సెక్యూరిటీ పోలీస్‌ (ఏపీసీఎస్‌పీ), కోస్ట్‌ గార్డ్స్, నేవీ బృందాలు గస్తీ కట్టుదిట్టం చేశాయి. ఐబీతో పాటు రాష్ట్రానికి చెందిన కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ వింగ్‌లు కూడా కోస్తా తీరంలో అపరిచితుల కదలికలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో డేగ కళ్లతో కాపు కాస్తున్నాయి.

మత్స్యకారులే సైనికులు..
ఆంధ్రప్రదేశ్‌లో సువిశాల కోస్తా తీరంలో మత్స్యకారులే పౌర సైనికులని చెప్పక తప్పదు. సముద్ర తీరంలో ఏపీసీఎస్‌పీ, కోస్ట్‌గార్డ్స్‌కు కూడా తెలియని ప్రాంతాలపై మత్స్యకారులకు అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తీరంలో అపరిచితులు ఎవరైనా చొరబడితే తమకు సమాచారం అందించేలా ఏపీసీఎస్‌పీ, నేవీ సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. రాష్ట్ర తీరం వెంబడి దాదాపు 541 గ్రామాల్లో 3.04 లక్షల మంది మత్స్యకారులున్నారు. మొత్తం 70 వేలకు పైగా బోట్లు నిత్యం తిరుగుతుంటాయి. మత్స్యకారులకు తగిన సౌకర్యాలు సమకూర్చి మరింత ప్రాధాన్యత ఇస్తే దేశ అంతర్గత భద్రతకు మేము సైతం అంటూ ముందు నిలుస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ముంబై దాడుల తర్వాత తీరం పటిష్టం
దశాబ్ధం కిందట ముంబైలో టెర్రరిస్ట్‌ దాడులు దేశంలోని సముద్ర తీరం భద్రతను సవాలు చేశాయి. ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చిన కేంద్ర హోంశాఖ 2017లో సముద్ర తీర రాష్ట్రాలకు 183 మెరైన్‌ పోలీస్‌స్టేషన్లను మంజూరు చేసింది. ఏపీలో కళింగపట్నం (శ్రీకాకుళం జిల్లా), రుషికొండ (విశాఖపట్నం), వాకలపూడి (తూర్పుగోదావరి), గిలకలదిండి (కృష్ణా), సూర్యలంక (గుంటూరు), దుగరాజపట్నం (నెల్లూరు) ప్రాంతాల్లో మెరైన్‌ పోలీస్‌ స్టేషన్‌లు ఉండగా.. మరో 15 కొత్తగా ఏర్పాటయ్యాయి. వాటికి తగిన పోలీస్‌ సిబ్బంది నియామకంతోపాటు, మరబోట్లు, జెట్టీలు, అధునాతన ఆయుధాలు సమకూర్చాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement