ఐబీని బలోపేతం చేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
యువ అధికారులను ఎంపిక చేసుకోవాలని మ్యాక్‌కు సూచన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ టూల్స్‌కు ప్రాధాన్యం
‘మ్యాక్’ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న ఏజెన్సీలు
ఇతర మెట్రోలతోపాటు హైదరాబాద్‌కు కలిసిరానున్న ఈ నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదులపై నిఘా పెట్టడంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) పాత్ర అత్యంత కీలకం. దేశంలోని అనేక నగరాలతోపాటు హైదరాబాద్‌లోనూ ముష్కర మూకల కుట్రలను తిప్పికొట్టడంలో ఐబీ తన మార్కు చూపించింది. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, ‘ఆన్‌లైన్ ఉగ్రవాదం’ నేపథ్యంలో ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. తాజాగా ఢిల్లీలో జరిగిన మల్టీ ఏజెన్సీ కమిటీ (మ్యాక్) సమావేశంలో దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలక ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర పరిధిలో ఉన్న వివిధ ఏజెన్సీల అధినేతలు ఈ ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఐబీ వంటి నిఘా విభాగాల్లో అనుభవానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని ఆపరేషన్లు సక్సెస్ కావడం అనేది అందులో పనిచేసిన వారి అనుభవం మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అనుభవజ్ఞులకు తోడు సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవడానికి యువ అధికారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు.
టెర్రర్ రిక్రూట్‌మెంట్‌లో పంథా మారింది
పుష్కరకాలంగా ఉగ్రవాదుల పంథా పూర్తిగా మారింది. ఒకప్పుడు దేశంలో విధ్వంసాలు సృష్టించడానికి అవసరమైన వారిని రిక్రూట్ చేసుకోవడానికి పాకిస్తాన్ నుంచి ఏజెంట్లు వచ్చేవారు. 1998లో హైదరాబాద్ పాతబస్తీలో పట్టుబడిన మహ్మద్ సలీం జునైద్ ఆ కోవకు చెందినవాడే. ఇలా అనేకమంది ఏజెంట్లు పట్టుబడ్డారు. యువతను ఆకర్షించి, సరిహద్దులు దాటించి, శిక్షణ ఇచ్చి, తిప్పి పంపడంతో పాటు పేలుడు పదార్థాలు సైతం సరిహద్దు ఆవలి నుంచే పంపడంలో ఈ ఏజెంట్లు కీలకంగా వ్యహరించేవారు. అయితే దశాబ్దకాలంగా ఉగ్రమూకలు అప్‌డేట్ అయ్యాయి.
యవతను ఆకర్షించి రిక్రూట్ చేసుకోవడం, వారిని ప్రేరేపించడం, శిక్షణ ఇవ్వడం, స్థానికంగా పేలుడు పదార్థాలు సమీకరించుకునే మార్గాలు సూచించడం... ఇవన్నీ ఆన్‌లైన్‌లోనే సాగుతున్నాయి. ప్రధానంగా ఐసిస్ ప్రాబల్యం పెరిగిన తర్వాత ఈ ధోరణి మరింత పెరిగింది. దీనికోసం ముష్కరమూకలు వివిధ రకాలైన సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో పాటు డార్క్ వెబ్ వాడుతున్నాయి. హైదరాబాద్‌లో పట్టుబడిన అనేక మంది ఉగ్రవాదులు ఇదే అంశాన్ని స్పష్టం చేశారు.
సాంకేతిక పరిజ్ఞానంతోనే వారికి చెక్ చెప్పేలా...
హైటెక్ ఉగ్రవాదులకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారానే చెక్ చెప్పవచ్చని కేంద్రం నిర్ణయించింది. ఇదే అంశాన్ని శుక్రవారంనాటి మ్యాక్ సమావేశంలో అమిత్‌షా స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోపాటు మిషన్ లెర్నింగ్ టూల్స్ వినియోగించడం ద్వారా ఉగ్రవాదులు, వారి కార్యకలాపాలపై పటిష్ట నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం ఆ విభాగంలో ప్రస్తుతం ఉన్న అధికారులకు తోడు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న యువకులను ఎంపిక చేసుకొని బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఉగ్రవాదుల కంటే ఒక అడుగు ముందు ఉండటానికి ఇది అవసరమని అమిత్‌షా అభిప్రాయపడ్డారు. ఏ మాత్రం కాలయాపనకు ఆస్కారం ఇవ్వకుండా వీలైనంత త్వరగా ఈ సంస్కరణలను అమలులోకి తీసుకురావాలని అమిత్‌షా స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలు నిత్యం ముష్కరుల టార్గెట్‌లో ఉండే హైదరాబాద్ సహా అనేక మెట్రో నగరాలకు కలిసి వచ్చే అంశమని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment