జమ్ముకశ్మీర్‌లోని దోడాలో వరుసగా నాల్గవరోజు కూడా ఎన్‌కౌంటర్ జరిగింది. నేడు (గురువారం) తెల్లవారుజామున ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఈ వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించారు.
కస్తిగఢ్ ప్రాంతంలోని జద్దన్ బాటా గ్రామంలో తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక భద్రతా శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. గంటకు పైగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
ఉగ్రవాదులను ఏరివేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సోమ, మంగళవారాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక కెప్టెన్‌తో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. ఈ ఘటన అనంతరం ఆర్మీ సిబ్బంది.. గ్రామంతోపాటు చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు. జూన్ 12 నుంచి దోడాలో వరుసగా దాడులు జరుగుతున్నాయి. చటర్‌గాలా పాస్ వద్ద జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడగా, మరుసటి రోజు గండోలో కాల్పులు జరిగాయి. దానిలో ఒక పోలీసు గాయపడ్డాడు.
జూన్ 26న, జిల్లాలోని గండో ప్రాంతంలో రోజంతా జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా, జూలై 9న ఘరీ కుంకుమ అడవుల్లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జమ్మూలోని ఆరు జిల్లాల్లో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 11 మంది భద్రతా సిబ్బంది, ఒక గ్రామ రక్షణ గార్డు, ఐదుగురు ఉగ్రవాదులు సహా మొత్తం 27 మంది మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment