ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం
జమ్మూ: జమ్మూ జిల్లాలోని అఖ్నూర్ సెక్టార్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. వాస్తవాధీన రేఖకు సమీపంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా ఆర్మీ కాన్వాయ్‌పైకి ఉగ్ర మూకలు కాల్పులకు దిగాయి. బలగాలు అప్రమత్తమై దీటుగా స్పందించడంతో ప్రమాదం తప్పింది. అనంతరం ముష్కరులు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పరారయ్యారు. ఆ ప్రాంతాన్ని దిగ్బంధించిన బలగాలు అదనంగా పోలీసులను, ఆర్మీని తరలించి గాలింపు ముమ్మరం చేశారు. ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
అతడి వద్ద ఆయుధం స్వాధీనం చేసుసుకున్నారు. హెలికాప్టర్‌ను రంగంలోకి దించి బలగాలు ఓ భవనం బేస్‌మెంట్‌లో ఉగ్రవాదులు దాగినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా భారీ పేలుళ్లు, కాల్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు సభ్యుల ముష్కరుల ముఠా ఆదివారం రాత్రి సరిహద్దులు దాటి దొంగచాటుగా దేశంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ అంబులెన్సుకు కనీసం డజను బుల్లెట్లు తగిలాయని చెప్పారు. అంతకుముందు, ఉగ్రవాదులు అస్సన్ ఆలయంలోకి ప్రవేశించి సెల్‌ఫోన్ కోసం అక్కడి వారిని అడిగారు, ఇంతలోనే అటుగా వస్తున్న ఆర్మీ కాన్వాయ్‌ని గమనించి కాల్పులకు దిగారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment