సీఐఏ కుట్ర.. ఆధార్ వివరాలు చోరీ!
సాక్షి, చెన్నై: కోట్లాది మంది భారతీయుల వ్యక్తిగత వివరాలు అమెరికా ఇంటిలిజెన్స్ చేతుల్లోకి వెళ్లిందా?. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుంభకోణాలను వెలికితీసిన వీకీలీక్స్ సంస్ధ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. అమెరికాకు చెందిన కేంద్ర నిఘా సంస్థ(సీఐఏ) ఆధార్ వివరాలను చోరి చేసినట్లు పేర్కొంది. క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ అనే సంస్థ అభివృద్ధి చేసిన టూల్స్‌తో సీఐఏకు చెందిన ఆఫీస్ ఆఫ్ టెక్నికల్ సర్వీసెస్(ఓటీఎస్) ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు వెల్లడించింది.
ఇదే క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ)కు బయోమెట్రిక్ సొల్యూషన్స్‌ను అందిస్తోంది. దీంతో వీకీలీక్స్ చెప్పిన వివరాలు నిజమేననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గోప్యత ప్రాథమిక హక్కేనని భారతీయ సుప్రీంకోర్టు తీర్పు వెలువడి 72 గంటలైనా గడవకముందే ఇలాంటి వార్త వినడం బాధాకరం. గతంలో కూడా ఆధార్ వివరాలు లీకయ్యాయనే వార్తలు ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి. అంతేకాకుండా క్రాస్ మ్యాచ్ భారతీయ భాగస్వామి అయిన స్మార్ట్ ఐడెంటిటీ డివైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 12 లక్షల మంది భారతీయుల ఆధార్ వివరాలను నమోదు చేసింది. ఈ మేరకు ట్వీటర్ వేదికగా వీకీలీక్స్ పలుమార్లు పోస్టులు చేసింది.
వీకీలీక్స్ ట్వీట్లపై స్పందించిన అధికారులు ఆధార్ కార్డుల సమాచారం తస్కరణకు గురైందనే మాట అవాస్తవమని అన్నారు. వీకీలీక్స్ అసలు దీనిపై ఎలాంటి పోస్టులు చేయలేదని చెప్పారు. ఓ గుర్తు తెలియని వెబ్‌సైట్లో ఈ రిపోర్టు ఉందని గుర్తించామని అన్నారు. క్రాస్ మ్యాచ్ కేవలం బయో మెట్రిక్ పరికరాలను సరఫరా చేసే కంపెనీయే తప్ప వేరే విషయాలతో దానికి సంబంధం లేదని చెప్పారు.
ఆధార్ డేటాను పూర్తిగా ఎన్‌క్రిప్ట్ చేశామని.. దాన్ని యూఐడీఏఐ తప్ప మరే ఇతర ఏజెన్సీ డీక్రిప్ట్ చేయలేదని వెల్లడించారు.