వాళ్లతో అమెరికాకు ముప్పే!
అమెరికా.. ప్రపంచంలోనే అగ్రరాజ్యం. అలాంటి పెద్ద దేశం కూడా ఒకరిని చూసి భయపడుతోంది. వాళ్లతో తమకు ముప్పేనని చెబుతోంది. అది ఎవరో కాదు.. వికీలీక్స్!! ఆ సంస్థ ఇటీవల బయటపెట్టిన ఎలక్ట్రానిక్ గూఢచార పద్ధతుల సమాచారాన్ని సీఐఏ నిర్ధారించలేదు గానీ, అలాంటి సమాచారం వల్ల అమెరికన్లకు ముప్పేనని చెబుతోంది. ఇలాంటి సమాచారం వల్ల అమెరికా సిబ్బందికి, వారి కార్యకలాపాలకు ఆటంకాలు కలగడమే కాదు, తమ సమాచారం వల్ల తమకే ప్రమాదం కలుగుతుందని సీఐఏ అధికార ప్రతినిధి హీతర్ ఎఫ్ హో్ర్నయిక్ అన్నారు.
జూలియన్ అసాంజే స్థాపించిన వికీలీక్స్ సంస్థ తాజాగా ఏడు బ్యాచ్‌ల పత్రాలను బయటపెట్టింది. వీటికి 'వాల్ట్ 7' అని పేరుపెట్టింది. ఇందులో మొత్తం 7,818 పేజీల సమాచారం ఉంది. దానికి 943 ఎటాచ్‌మెంట్ ఫైళ్లను జత చేశారు. ఇవన్నీ సీఐఏ రహస్య ఫైళ్లని వికీలీక్స్ చెప్పింది. అందులో.. సామాన్య ప్రజల కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను హ్యాక్ చేయడానికి ప్రభుత్వం ఏయే టూల్స్ ఉపయోగిస్తోందో వివరంగా తెలిపింది. ఇవి ఎంతవరకు నిజమో తాము చెప్పలేము గానీ, వీటివల్ల తమకు ఇబ్బంది మాత్రం తప్పదని ఇప్పుడు సీఐఏ అంటోంది. ప్రమాదకరమైన దేశాలు, ఉగ్రవాదుల బారి నుంచి అమెరికన్లను రక్షించడం తమ పని అని, అందుకోసం పలు దేశాలకు సంబంధించిన సమాచారాన్ని తాము సేకరిస్తామని సీఐఏ చెబుతోంది. అంతేతప్ప అమెరికన్ల మీద మాత్రం నిఘా పెట్టబోమని అంటోంది. కానీ వికీలీక్స్ బయటపెట్టిన పత్రాలు చూస్తే మాత్రం.. దాదాపు అమెరికన్లందరి ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు.. ఇలా అన్నింటిమీదా సీఐఏ నిఘా ఉన్నట్లు తెలుస్తోంది.