
ఒట్టావా: అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండోసారి అధికార పీఠాన్ని అధిష్టించాక, అతను తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకు మింగుడుపడటం లేదు. ఇదే సందర్భంలో ట్రంప్ కెనడాను అమెరికాలోని 51వ రాష్ట్రంగా పిలవడంతో కెనెడియన్లు మండిపడుతున్నారు. వారు తమలోని ఆగ్రహాన్ని పలు రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో కెనడియన్ సూపర్‌హీరో ‘కెప్టెన్ కెనక్’(కామిక్ బుక్ క్యారెక్టర్) సరికొత్త కామిక్ బుక్ ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చాడు.
ఈ కామిక్‌లో ట్రంప్‌ను సూపర్ విలన్(Super villain)గా, ఎలాన్ మస్క్‌ను అతని పరమ విధేయునిగా చిత్రీకరించారు. కెప్టెన్ కెనక్ ఈ ఇద్దరి నుంచి కెనడా సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఎదుర్కొనే సన్నివేశాలను కామిక్‌లో ఆకర్షణీయంగా చూపించారు. ఈ కామిక్ కెనడాలో అందరినీ అలరిస్తోంది. ఈ కామిక్‌లతో కెనాడాలోని బుక్ స్టోర్‌లు, లైబ్రరీలలోని అరలు నిండిపోతున్నాయి. కెప్టెన్ కెనక్‌ను 1975లో రిచర్డ్ కోమెలీ సృష్టించాడు. ఈ సూపర్ హీరో కెనడా సార్వభౌమత్వాన్ని, సంస్కృతిని కాపాడే ఒక ప్రభుత్వ ఏజెంట్‌గా వ్యవహరిస్తుంటాడు. అతను ఒక రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ఆఫీసర్, గ్రహాంతరవాసులతో జరిగిన ఒక సంఘటన కారణంగా అతీంద్రియ శక్తులను పొందుతాడు.
కెప్టెన్ కెనక్ ఎరుపు, తెలుపు రంగుల దుస్తులు ధరించి, ఒక మాపుల్ లీఫ్ చిహ్నంతో కనిపిస్తాడు. ఇది కెనడా జాతీయ గుర్తింపును సూచిస్తుంది. 2025లో, కెప్టెన్ కెనక్ 50వ వార్షికోత్సవ సంచికలో.. కెనడాను ట్రంప్, మస్క్ బెదిరింపుల నుంచి కాపాడే సూపర్‌హీరోగా కనిపించాడు. ఈ కామిక్ కెనడియన్ జాతీయవాద భావనను అక్కడి ప్రజలలో మరింత బలపరిచింది. ఈ కామిక్‌లో ట్రంప్‌ను కెనడాపై ఆధిపత్యం చెలాయించాలనే కుట్రలతో రగిలిపోతున్న ఒక సూపర్‌విలన్‌గా చిత్రీకరించారు. ఎలాన్ మస్క్‌ను ట్రంప్‌కు విధేయునిగా చూపించారు. ఈ కామిక్‌లోని ఒక సన్నివేశంలో, కెప్టెన్ కెనక్.. ట్రంప్ మస్క్‌లను కాలర్ పట్టుకొని బయటకు లాగుతూ కనిపిస్తాడు. ఇది కెనడియన్ పాఠకులకు అమితమైన ఆనందాన్ని కలిగించిందట.
ఈ కామిక్ విజయం తర్వాత కెప్టెన్ కెనక్ కొత్త కామిక్ సిరీస్(Captain Canuck's new comic series)లు, యానిమేటెడ్ సిరీల అమ్మకాలు పెరిగాయి. కెప్టెన్ కెనక్ సృష్టికర్త అయిన రిచర్డ్ కోమెలీ (74) ఈ కామిక్ పునరాగమనం గురించి మాట్లాడుతూ 1970లలో కెనడియన్లు తమకొక ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకున్నారని, ఆ సమయంలోనే కెప్టెన్ కెనక్‌ను సృష్టించానన్నారు. ఇప్పుడు ట్రంప్ విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో కెనడియన్లు మళ్లీ ఈ హీరోను స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వ్యక్తిగాచూస్తున్నారని అన్నారు.
ఇది కూడా చదవండి: 26/11 దాడుల్లో ‘దుబాయ్ వ్యక్తి’? : ఎన్‌ఐఏ ఆరా