
న్యూయార్క్: ఇటీవలి కాలంలో విస్తృతంగా వినియోగమవుతున్న కృతిమమేథ(Artificial intelligence) మనిషి ఆలోచనలకు సవాల్ విసురుతోంది. ఇటువంటి తరుణంలో అమెరికాలో ఒక వింత మోసం చోటుచేసుకుని, సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఫిన్‌టెక్ స్టార్టప్ నిర్వాహకుడు ఆల్బర్ట్ సానిగర్ తన ‘నేట్’ (Nate)షాపింగ్ యాప్ కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారంగా నడుస్తున్నదని ప్రచారం చేసి, 50 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 420 కోట్లు) పైగా నిధులు సేకరించాడు. అయితే ఈ యాప్ ఫిలిప్పీన్స్‌లోని ఒక కాల్ సెంటర్‌లోని సిబ్బంది ద్వారా నడుస్తున్నదని విచారణలో తేలింది. ఈ మోసం బయటపడటంతో, సానిగర్‌పై అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్.. సెక్యూరిటీస్ ఫ్రాడ్, వైర్ ఫ్రాడ్ ఆరోపణలు నమోదు చేసింది. ఈ ఆరోపణలు నిజమైతే ఆల్బర్ట్ సానిగర్‌కు గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.
నేట్ యాప్‌ను ఆల్బర్ట్ సానిగర్(Albert Saniger) 2018లో రూపొందించాడు. ఈ యాప్ ఒక యూనివర్సల్ షాపింగ్ కార్డ్‌గా ప్రచారం చేశాడు. దీని ద్వారా యూజర్లు ఎలాంటి ఇ-కామర్స్ సైట్ నుంచైనా ఒకే క్లిక్‌తో దేనినైనా కొనుగోలు చేయవచ్చని తెలిపాడు. ఈ యాప్ ఏఐ టెక్నాలజీ ద్వారా షాపింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుందని, బిల్లింగ్, షిప్పింగ్ వివరాలను దానికదే నిర్వహిస్తుందని సానిగర్ పేర్కొన్నాడు. ఈ యాప్ కోసం ఆయన కోట్యూ, ఫోర్‌రన్నర్ వెంచర్స్, రెనెగేడ్ పార్టనర్స్ తదితర వంటి పెట్టుబడిదారుల నుంచి 50 మిలియన్ డాలర్లకుపైగా నిధులు సేకరించాడు.
అయితే ఈ యాప్‌లో ఏఐ ఆటోమేషన్(Automation) దాదాపు శూన్యం అని అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ తేల్చింది. యాప్ ద్వారా జరిగే కొనుగోళ్లను ఫిలిప్పీన్స్‌లోని కాల్ సెంటర్‌లోగల వందలాది ‘పర్చేజింగ్ అసిస్టెంట్స్’ నెరవేరుస్తున్నారని తేలింది. ఈ నేపధ్యంలో ఆల్బర్ట్ సానిగర్ ఏఐ టెక్నాలజీ పేరును ఉపయోగించి, తప్పుడు కథనాన్ని సృష్టించాడని డిపార్ట్‌మెంట్ పేర్కొంది. 2021 హాలిడే షాపింగ్ సీజన్‌లో యాప్ డిమాండ్‌ను తట్టుకునేందుకు సానిగర్ తన ఇంజనీరింగ్ టీమ్‌ను కొన్ని లావాదేవీలను ఆటోమేట్ చేయడానికి ‘బాట్‌లు’ అభివృద్ధి చేయాలని ఆదేశించాడు. అయితే ఈ బాట్‌లు ఏఐ ఆధారితం కాకుండా, మానవ సిబ్బంది ఆధారంగా పనిచేశాయి. ఆల్బర్ట్ సానిగర్ చేసిన మోసం బయటపడటంతో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) అతనిపై సివిల్ కేసు నమోదు చేసింది. అతనిని ఇకపై ఇలాంటి కంపెనీలలో అధికారిగా పనిచేయకుండా నిషేధించాలని కోరింది. అలాగే పెట్టుబడిదారుల నుంచి సేకరించిన నిధులను సానిగర్ తిరిగి వారికి ఇవ్వాలని ఆదేశించింది. ఇదేవిధంగా గతంలో ప్రెస్టో ఆటోమేషన్ అనే కంపెనీ ఏఐ ఆధారిత డ్రైవ్ త్రూ సేవలను అందిస్తామని చెప్పి, ఫిలిప్పీన్స్‌లోని సిబ్బందితో కార్యకలాపాలు సాగించి మోసానికి పాల్పడింది.
ఇది కూడా చదవండి: గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన